మహిళలపై అసహ్యకరమైన లైంగిక సంభాషణలు చేసిన ప్రజా ప్రతినిధుల పై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కు మహిళా సంఘాల నేతలు లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం
లేఖ మీద డి.రమాదేవి (ఐద్వా రాష్ట్ర కార్యదర్శి) పి. దుర్గాభవాని (ఎన్ఎఫ్ఐ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి), సుంకర పద్మశ్రీ (మహిళా కాంగ్రెస్ ) రాగి గంగాభవాని (పి ఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు నాగమణి (ఐప్వా రాష్ట్ర కార్యదర్శి) ఎన్ మాలతి (మహిళా సత్తా)లు సంతకాలు చేశారు.
సమస్యలపై చర్చించే ప్రజా వేదికగా ఉండాల్సిన శాసనసభ మహిళల గౌరవాన్ని భంగం పరిచే కక్షపూరిత సంభాషణలకు, అసహ్యకరమైన దుర్భాషలకు వేదిక కావడం అత్యంత విషాదకరం.
19-11-21 న అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి జరిగిన దుర్భాషల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
సభలో లేని వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడడం సభా మర్యాద కాదు అనేది మీకు తెలియని విషయం ఏమీ కాదు.
సభలో లేని మహిళను అన్యాపదేశంగా ఉద్దేశించి కొడుకు పుట్టుకను వివాదాస్పదం చేయడం, నిందారోపణలు చేయడం లైంగిక వేధింపులకు క్రిందకే వస్తుంది. సభలో లేని అమ్మ గురించి, చెల్లి గురించి మాట్లడనడం ఏరకంగా న్యాయబద్దమైనది?
అత్యున్నత శాసనసభ మందిరంలో ఈ రకమైన లైంగిక సంభాషణలను నిరోధించాల్సిందిగా కోరుతున్నాము.
ప్రజలకు బాధ్యత వహిస్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, చట్టాలను గౌరవిస్తామని ప్రకటించి, ప్రమాణం చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రతిపక్షాలను మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని బిడ్డల పుట్టుకను ప్రశ్నించడం మహిళలకే కాదు, శాసనసభకు, శాసనసభా నాయకుడికి అగౌరవం. ప్రతిపక్ష నాయకుడు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడాదమనడం ఏరకమైన సభామర్యాద?
కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు అత్యంత ఆక్షేపణీయం గా ఉంది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఎవరు ఎవరిని ఉద్దేశించి ఏమి మాట్లాడోరో కూడా పత్రికల లో మీడియా లో చర్చ నియాంశమవుతుంది. వెరసి రాజకీయాలలో అధికార ప్రతి పక్షాలు తమ రాజకీయ మైలేజి కోసం మహిళ లను, చివరకు మహిళా ప్రజాప్రతినిధులు కూడా సభలోనూ బయట అవమానకరంగా ఆరోపిస్తున్నారు. ఇవి నేరపూరిత మైన వ్యాఖ్యానాలు.
వారు శాసన సభ లో ఆఫ్ ది రికార్డు మాట్లాడినా అక్కడ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, విలేకరులు అందరూ కూడా జరిగిందేమిటో, మాట్లాడింది ఏమిటో విన్నారు..
దీనిపై మీరు విచారణ చేయాలి. అసభ్య సంభాషణలు చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి…
మహిళలను గౌరవించడం మాత్రమే కాదు మహిళల కోసం చేసిన చట్టాలను రక్షించాల్సిన బాధ్యత కూడా శాసనసభ కున్నది.
అసెంబ్లీలోనూ,బయటా ఏమి మాట్లాడినా చెల్లుబాటవుతుందనే ధోరణికి అడ్డుకట్ట వేయటానికి అవసరమైన చర్యలు చేపట్టాలి.
ఒక బిడ్డ తన పోలికలతో లేదని ఇటీవల కాలంలో తండ్రి సొంత బిడ్డను చంపడం మీడియా లో రిపోర్ట్ అయింది.
శాసనసభలో జరిగిన ఈ అసహ్యకరమైన ఆరోపణలు అంతకంటే తక్కువ నేరమేమీ కాదు. నేరస్తులకు శిక్షలు పడాలి. అంటే నేరం పై విచారణ జరగాలి.
మహిళలను ఉద్దేశించి సైగలు కూడా లైంగిక వేధింపులకిందకు వస్తాయని ఇండియన్ పీనల్ కోడ్ నిర్వచిస్తుంది.
అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించారు అన్న వార్తలు అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చాయి .
ఆ అన్ పార్లమెంటరీ పదాలు మహిళల లైంగికతను కించపరుస్తూ వాడినప్పుడు కచ్చితంగా వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది.
మీరు మీ అధికారాన్ని ఉపయోగించి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇప్పటికే ఒక ఎమ్మెల్యే చేసిన లైంగిక దూషణలు యూ ట్యూబ్ లో ప్రసారమవుతున్నాయి.ఇద్దరు శాసనసభ్యులు మహిళలతో అనుచిత లైంగిక సంభాషణలు మీడియా లో ప్రచారం లో ఉన్నాయి.
శాసన సభ సభ్యుల నైతిక ప్రవర్తన పైన చర్యలు చేపడతారని ఆశిస్తున్నాము.
మహిళలకు సాధికారత కల్పిస్తున్నామని అసెంబ్లీలో ముందు రోజే ప్రకటించారు.మహిళలసాధికారతకు భంగ కరంగా అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఉంది.
జరిగిన ఘటనలపై విచారణ జరపాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.