కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాలి

మంగళగిరి: భారతదేశాన్ని కాపాడుకోవడానికి కలిసివచ్చే అన్ని లౌకికవాద శక్తులు, కమ్యూనిస్టులు, ప్రజాతంత్రవాదులు, అందర్నీ కలుపుకొని ఏకమై కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ప్రథమ కర్తవ్యంగా కృషిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. సామాజిక మార్పును కోరే ప్రగతిశీల శక్తుల కోసం కమ్యూనిస్టు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘ నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు- కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యాలు!’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం మంగళగిరిలోని వేములపల్లి శ్రీకష్ణ భవన్ (సీపీఐ కార్యాలయం)లో జరిగింది.
సదస్సుకు అధ్యక్ష వర్గంగా లాల్, నీల్ మైత్రి ఉద్యమ కార్యకర్త రేకా చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా నాయకుడు కంచర్ల కాశయ్య వ్యవహరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభోపన్యాసం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి 2014 వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయికాని నరేంద్రమోదీ ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ఇది రియాక్షనరీ కమ్యునల్ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసం లేదన్నారు. ఆర్థిక విధానాల్లో పక్కా కార్పొరేటు అనుకూలమని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు రెట్టింపయ్యాయని, వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల్లేవ్… పైగా కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో 2.50 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, 34 శాతం చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని రామకృష్ణ చెప్పారు. రైతులను గాలికొదిలేశారన్నారు. ఆర్థికంగా దేశాన్ని దివాళా తీయించారన్నారు. దేశంలో 2014 ముందు వరకు ప్రభుత్వాలు 67 సంవత్సరాల్లో 47లక్షల కోట్లు అప్పలు చేయగా, గత ఏడేళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వంలో 122 లక్షల కోట్ల మేర అప్పులు పెరిగాయన్నారు. ఈ ఏడాది కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవ్వగా, ముకేశ్ అంబాని ఆస్తులు 128 శాతం, ఆదాని ఆస్తులు 467 శాతం మేర పెరిగాయని, నరేంద్రమోదీ ప్రభుత్వం పక్కా కార్పొరేట్లకు అనుకూలమని విమర్శించారు.
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వారికి నయాన, భయాన లౌకిక పార్టీలను కూడగట్టేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు వంటి రకరకాల పద్ధతులతో బెదరించి తమ వైపు తిప్పుకుంటున్నాయి. రాష్ట్రంలోనూ టీడీపీ, వైసీపీ, చివరకు జనసేన పార్టీలు నరేంద్రమోదీకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి కాని వాస్తవానికి వీరెవరికీ మోదీపై ప్రేమలేదు.. కానీ తమ అవసరాల కోసం, అవకాశవాదంతో భయపడి సపోర్టు చేస్తున్నాయని రామకృష్ణ పేర్కొన్నారు.
సైద్ధాంతికంగా పోరాడేది కమ్యూనిస్టులే…
బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఓడించగలిగే పరిస్థితులు లేనప్పటికీ, సైద్ధాంతికంగా ఎదిరించగల శక్తి ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. భారతదేశ రాజకీయాల్లో మార్పు రావాలంటే అణగారిన వర్గాలను కూడగట్టాలి. ఒకవేదికపైకి వచ్చి ముందుకుపోవాలి లేకపోతే ఈ దేశాన్ని మనువాదులు శాసిస్తారు.
భారత దేశంలో మనం కోల్పోయిన ప్రతిష్టను మళ్లీ మనం తెచ్చుకోవాలన్నా, మన పార్టీ భారత దేశ రాజకీయరంగంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నా.. కమ్యూనిస్టులు రాజకీయాలను ప్రభావితం చేయాలన్నా.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన వాటి ప్రభావం ఉండాలన్నా కచ్చితంగా కమ్యూనిస్టుల బలం పెరగాలి. కమ్యూనిస్టుల బలం పెరగాలంటే కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాలి. దానికోసం అందరం కూడా కృషిచేయాలని రామకృష్ణ కోరారు.
అణగారిన వర్గాలకు సంబంధించి కూడా వారందర్నీ కూడగట్టాలి. అందుకు రేకా కృష్ణార్జునరావు, రేకా చంద్రశేఖరరావులు లాల్- నీల్ నినాదాన్ని పదే పదే ముందుకు తెస్తున్నారు. మంచిదే ఆ వైపునకు కూడా ఆలోచన జరగాలి అని రామకృష్ణ పేర్కొన్నారు.
రైతు ఉద్యమం స్ఫూర్తి…
కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా 500 రైతు సంఘాలు ఒక వేదికపైకి వచ్చి ఏడాది కాలం పోరాటం చేశాయి, వారి ఉద్యమాలకు దేశవ్యాప్తంగా మద్దుతు లభించింది. 19 రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే అందులో ప్రజలు పాల్గొంటారు. ఉద్యమాలు విజయవంతమవుతాయి. ఇక రాష్ట్రంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని 222 రోజులుగా కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజలు, కార్మికులు, రైతులు వారి వారి సమస్యలపై పోరాడుతున్నప్పుడు సమాయత్తమవుతారు.
రాజధాని అమరావతి కోసం పోరాటం…
రాష్ట్రంలో రాజధాని అమరావతి కోసం 700 రోజులుగా ఒక సుదీర్ఘ పోరాటం జరుగుతోంది. ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు… ప్రధానంగా రైతులు, మహిళలు ముందుండి నడిపిస్తున్న ఈ పోరాటం సక్సెస్ అవుతోంది. వారు చేపట్టిన మహాపాదయాత్రకు గ్రామగ్రామాన స్పందన లభిస్తోంది. ఉద్యమకారులపై పూలు జల్లుతున్నారు. జనస్పందన విశేషంగా ఉందని రామకృష్ణ వివరించారు.
‘మహిళలు, బాలికలపై పెచ్చరిల్లుతున్న దాడులు – అత్యాచారాలు’ అంశంపై పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య ప్రసంగించారు. సదస్సులో ఆచార్య అబ్దుల్ నూర్ బాషా, ప్రముఖ సామాజికవేత్త ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి, సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, రేకా కృష్ణార్జునరావు, ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకుడు ఎంపీ రామ్ దేవ్, సీపీఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.రవి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, రైట్స్ రాష్ట్ర కార్యదర్శి జైభీమ్ కారుమంచి రామారావు, బహుజన తత్వవేత్త జైభీమ్ డెన్నీస్ రాయ్, ఏఐటీయూసీ పట్టణ నాయకుడు అన్నవరపు ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా నాయకుడు లోకం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి శీల న్యాయవాదుల వేదిక జిల్లా కన్వీనర్ శిఖా సురేష్ బాబు స్వాగతం పలికిన ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, విశ్వశాంతి కళాపరిషత్, ప్రజాకళాకారులు సామాజిక విప్లవ గీతాలను ఆలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *