తిరుపతి సమీపంలో ని రాయల్ చెరువు ఇపుడు వార్తల్లో ఉంది. ఇపుడు కురుస్తున్న వర్షాల వల్ల ఈ చెరువు కట్ట తెగిపోయే పరిస్థితి వచ్చింది. రెడ్ ఎలెర్ట్ ప్రకటించారు. దాదాపు ఇరవై గ్రామాలనుంచి ప్రజలను తరలించాలరని వార్తలొస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లోని పురాతమయిన, ముఖ్యమయిన, అతి పెద్దయిన చెరువు ఇది. విజయనగరరాజు శ్రీకష్ణ దేవరాయలు కట్టించిన చెరువు ఇది. ఈ ప్రాంతమంతా కృష్ణ దేవరాయలు కట్టించిన చెరువులే ఉన్నాయి. ఇలాగే రాయల చెరువు పేరుతో అనంతపురంజిల్లాలో కూడా ఒక వూరుంది. అది కూడా చెరువు నుంచి వచ్చిన పేరే. అయితే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాక, ఈ చెరువులను పటిష్టం చేయడం మానేశారు. ఇలా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చి ఈ చెరువు ఇపుడు ప్రమాదపుటంచుల్లో ఉంది. వారం రోజులుగా అధికారులకు కంటి మీదకునుకు లేకుండా చేస్తున్నది. ఇపుడు విపరీతంగా వర్షాలు రావడంతో పరిస్థితి విషమించింది. వర్షాలుఇంతటి ఆగిపోతే, పర్వాలేదు. డిసెంబర్ 2 లోపు మరొక దఫా తుఫాన్ వుందని చెబుతారు. అపుడుకూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఏమవుతుందో.
తిరుపతి కి 15కిమీ దూరాన రామచంద్ర పురం మండలంలో ఈ చెరువు ఉంటుంది. రాయలసీమలో అతి పెద్ద చెరువు ఇదే. విజయనగర రాజ్య సంస్థాపకులు హరిహర,బుక్క రాయలు 1336-1340 మధ్య ఈ చెరువు నిర్మాణం చేపట్టారు.అయితే, 1509-1520 మధ్య శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఇది పూర్తయింది. ఇక ఉజ్వల చరిత్ర ఉన్న ఈ చెరువు అక్రమణలకు గురయింది. 2000 ఎకరాల విస్తీరణంలో 1500 ఎకరాల దాకా అక్రమించుకున్నారని మీడియా రాస్తున్నది. పూర్వం చెరువులో 25 అడగుల నీటి మట్టం వున్నపుడు తిరుపతి ఉత్తరం దాకా బావుల్లో నీళ్లుండేవి. ఇపుడు చెరువులో పది అడుగుల మట్టం దాకా కూడా నీళ్లు నిలువ ఉండటం లేదు. ఆక్రమణలకు తోడు చెరువులో పూడికిపెరిగింది. ఇలా కుంచించుకుపోయిన చెరువుకు ఉప్పెన లాగా నీరొచ్చిపండిందిపుడు.
వెదురు కుప్పం, రామచంద్రపురం, వడమాల్ పేట్, రేణిగుంట, తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల మంచినీళ్ల అవసరాలను కూడా తీర్చే చెరువు ఇది. ఈ చెరువువల్లే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఈ చెరువును రిపేర్ చేస్తే చాలా వ్యవసాయం స్తిరీకరణ అవుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హంద్రీ-నీవా నీటినితో ఈ చెరువును నింపాలనేప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే, ప్రభుత్వం మారినతర్వాత హంద్రీ నీవాపనులు నత్తనడకలో పడ్డాయని చెబుతారు.
ఇపుడు ఎమర్జన్సీ రావడంతో తిరుపతి అర్బన్ అర్బన్ యస్.పి వెంకట అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్,ఇరిగేషన్ విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు రాత్రిపూటకూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆదివారం ఉదయం చెరువుకట్టకు ఉత్తరంవైపున (ఆంజనేయస్వామి గుడి వైపు) కట్ట కింది భాగంలో చెరువు నీరు లీకేజీని ప్రజలు గుర్తించారు. అధికారులను అప్రమత్తం చేశారు. దీనితో రాయల చెరువు కట్టకు ముప్పు అన్న వార్త వైరలయింది. ఈ కట్ట తెగితే సమీపంలోని 18 గ్రామాలతోపాటు, వడమాలపేట మండలం వైపు పూడి వరకు పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.అర్బన్ యస్.పి వెంకట అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎం హరినారయన్ ,ప్రత్యేకాధికారి పీఎస్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ రాజబాబు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు రాయల చెరువు వద్దకు చేరుకొని గండిని పూడ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
చెరువు గట్టుకు పడ్డ గండికి అడ్డముగా ఇసుక మూటలను నుంచి చెరువు నుంచి వెలుపలకు వస్తుంది ప్రవాహాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ అధికారులందరూ ఈ రోజు రాత్రి పూర్తిగా చెరువు వద్దే ఉండి, రాయల చెరువు కట్ట తెగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టి, జరగబోయే విపత్తులు ఆపడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. చెరువు గట్టు వద్ద ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టారు. ముంపునకు గురి కాబోయే 18 గ్రామాల ప్రజలను తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయం కు బస్సుల ద్వారా తరలించారు. ఈ గ్రామాలన్నీ పూర్తిగా ఖాళీ అయ్యాయి.
ఎన్.డి.అర్.ఎఫ్ సహాయక బృందాలు
రెండు ఎన్.డి.అర్.ఎఫ్., ఎస్.డి.అర్.ఎఫ్ బృందాలు చెరువు గట్టు వద్ద సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు.