సంప్రదాయ ఆహార్యం…సమసమాజ ఆలోచన !
(రాఘవ శర్మ)
ఆలూరి లలితా (76) ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు కర్నాటకలోని గుల్బర్గాలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె ప్రముఖ రచయిత, అనువాదకులు ఆలూరి భుజంగరావు జీవిత సహచరి.
వేళ్ళపైన లెక్కపెట్టగలిగేవే కావచ్చు కానీ, ఆమె మంచి కథలు, కవితలు రాశారు. చివరి శ్వాస విడిచే వరకు ఆమె విరసం సభ్యురాలు, ఎక్కడ విరసం సభలు జరిగినా ఆ భార్యాభర్తలు పుస్తకాలమ్ముతూ కనపడేవారు.
వచ్చిన ప్రతి వారిని ‘ఏం నాయనా…, ఏం అమ్మా..’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు.
ఒకప్పుడు గుడివాడలోవారిల్లు విప్లవ రచయితలకు, విప్లవాభిమానులకు కేంద్రం. వారికి అక్కడే భోజనం, అక్కడే పడక. ఆలూరి భుజంగరావు నాకు బాబాయి అవుతారు.
అంటే , మా పెద్ద తాత కొడుకు. మా నాన్నకు పెదనాన్న కొడుకు.వారితో నాకు కాస్త దూరపు బంధుత్వమైనా, సాహిత్య అనుబంధమే ఎక్కువ.
ఎప్పుడో నేను పదవ తరగతి చదివేటప్పడనుకుంటా, మా భుజంగరావు బాబాయి తొలి అనువాదం ప్రేమ్‌చంద్ గబన్ చదివాను.
ఆ తరువాత పదేళ్ళ వరకు వారిని చూడలేదు. అంతకు ముందు కూడా చూడలేదు.
(తిరుపతి జ్ఞాపకాలు – 46)
గుంటూరు జిల్లా జువ్వలపాలెంలో జనసాహితి సాంస్కృతిక సమాఖ్య వర్కషాప్ (1980) జరిగింది. ఆ వర్క్‌షాప్‌లో నేను పాల్గొన్నాను.
అనువాదాలపై మా భుజంగరావు బాబాయి పాఠం చెప్పారు అదే తొలిసారిగా ఆయన్ను చూడడం, ఆయనతో మాట్లాడడం.
పదిరోజుల పాఠశాల అయిపోయాక నేను గుడివాడ వెళ్ళాను. మా బాబాయి కుటుంబాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది .
మాబాబాయితో నాకు రక్త సంబంధం. మా పిన్ని పరాయి సంబంధం. అయినా మా పిన్ని నాతో ఎంత ఆప్యాయంగా, ఎంత ఆత్మీయంగా వ్యవహరించిందో! తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం.
నాతోనే కాదు, వాళ్ళింటికి వచ్చిన ప్రతివారితోనూ ఒక తల్లిలాగా అదే ఆప్యాయత, అదే ఆత్మీయం.
అది చివరి వరకూ చూశాను.
మా పిన్ని నిన్న కాక మొన్న ఫోన్ చేసి ‘నాయనా శర్మా నేను మీ పిన్నిని. ఎలా ఉన్నావ్? అమ్మ ఎలా ఉంది?’ అంటూ పలకరించింది.
మా బాబయికి, పిన్నికి నలుగురు కూతుర్లు, ఒక్క కొడుకు.పిల్లలందరికీ ఆదర్శ వివాహాలు చేశారు. వారిలో ముగ్గురు కూతుర్లవి కులాంతర వివాహాలు.
పెద్ద కూతురు పార్వతికి ఇరవైనాలుగేళ్ళ వయసులో వివాహం చేశారు. అప్పటి వరకు మా పిన్ని ఒక రహస్యాన్ని దాచిపెట్టింది.ఇప్పటికీ చెప్పక పోవడం తప్పవుతుందనుకుంది.
పార్వతి మా భుజంగరావు బాబాయి మొదటి భార్య కూతురు.
మా బాబాయిమొదటి భార్య బిడ్డ(పార్వతి)ని ప్రసవించి మరణించాక కొన్నాళ్ళకు మా బాబాయి లలితను వివాహం చేసుకున్నాడు.
తరువాత వారికి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. సవతి బిడ్డన్న తేడా రాకుండా మా పిన్ని తన పిల్లల తో పార్వతిని పెంచింది. రహస్యం గుట్టు విప్పే సరికి అయిదుగురు పిల్లల్లో ఒక ఉద్వేగం.ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం.
పెళ్ళి ముందు చెప్పే సరికి పార్వతి కళ్ళ వెంట నీళ్ళు. ఇలా ఉండడం ఎంత మందికి సాధ్యం!? ఒక్క మా(లలిత) పిన్నికి తప్ప.
మా బాబాయి చదివిన పుస్తకాలన్నిటినీ మా పిన్ని చదివింది. సాహిత్యమే కాదు, రాజకీయాలూ చర్చించింది.
బతికినంత కాలం ఆ ఆదర్శాలతోనే బతికింది. మా బాబాయితోపాటు సభలకు వెళ్ళింది. ఎలాంటి భేషజాలకు పోకుండా కింద కూర్చుని పుస్తకాలమ్మింది.ఆయనతో పాటు ప్రయాణం చేసింది.
ఇద్దరిదీ ఒకటే మాట, ఒకటే బాట.
ఎన్నో సార్లు వాళ్ళింటికి వెళ్ళాను.
లెక్కలేనన్ని సార్లు మా ఇంటికి వచ్చారు.
ఎప్పుడు వచ్చినా మొహమంతా విప్పారి , నోరారా మాట్లాడడం. అదే ఆప్యాయతతో ఇంట్లో అందరినీ పలకరించడం.
కన్న బిడ్డలు లోపలకు వెళితే కాదనలేదు.లోపలకు వెళ్ళిన వారిని పెళ్ళి చేసుకున్నా కాదన లేదు.మా బాబాయి లోపలకు వెళితే తానూ వెళ్ళింది.
వయోభారంతో, అనారోగ్యంతో తిరిగొస్తే తాను తిరిగొచ్చింది.
మా బాబాయిని కంటికి రెప్పలా కాపాడింది.
ఆయన పుస్తకాలు అచ్చేయడానికి ప్రోత్సహించింది.
పెద్ద బొట్టు , అంచు చీర, చేతినిండా గాజులతో సంప్రదాయంగా కనిపిస్తుంది.
కానీ ఆలోచన లు కులాల కతీతం, మతాల కతీతం, వర్గాల కతీతం !
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)