వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు టిఆర్ ఎస్ ప్రభుత్వానికి సంబంధమే లేదు.ఒక్క సారి భారత్ బంద్ జరిపి తర్వాత మళ్లీ పట్టించుకోనేలేదు. రైతు చట్టాలను కెసిఆర్ ప్రశంసించారు. ఇపుడేమో పాలాభిషేకాలు. ఇదే రాజకీయం?
(వడ్డేపల్లి మల్లేశము)
రైతును రాజు అన్న ప్రభుత్వాలే, రాజకీయ పార్టీలే ఆగం చేసి ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాయి. ఈ విషయాన్ని పాలకులు అంగీకరించక పోవచ్చు కానీ ఇది నగ్నసత్యం. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి బిజెపి తెరాస మధ్య జరుగుతున్న ఘర్షణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ధర్నాప్లతో ప్రజలను ప్రలోభ పెట్టడం, బిజెపి దాటవేత ధోరణి ఇందుకు ప్రబల నిదర్శనంగా భావించవచ్చు.
రైతు చట్టాలలో కి వెళ్తే
2020 సెప్టెంబర్ మాసంలో దేశంలోని రైతులకు అనేక రకాల మేలు చేస్తామని భావించిన బిజెపి ప్రభుత్వం రైతులకు సంబంధించి మూడు చట్టాలను ఆమోదించడం జరిగింది. కనీస మద్దతు ధరకు ప్రాధాన్యత లేదని, ప్రభుత్వం బాధ్యత నుండి తప్పించుకునే ధోరణి అవలంబిస్తోందని, ప్రైవేటు వ్యాపారుల ఉచ్చులో మోసపోయే ప్రమాదం ఉందని భావించిన రైతు సంఘాలు ప్రభుత్వం చేసిన చట్టాలను వ్యతిరేకించడం ప్రారంభించిన వి. 2020 నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనల ద్వారా తమ ఉద్యమాన్ని ప్రారంభించిన రైతు సంఘాలు భారత్ బంద్, చలో ఢిల్లీ వంటి అనేక రకాల ఉద్యమాలను తీసుకొని ఎండ, వాన, చలి లో గత సంవత్సర కాలంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఉద్యమిస్తున్నారు.
రైతు ఉద్యమం లోని ఈ వాస్తవాన్ని గ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం రైతుల సమ్మె చేసే హక్కు ను గుర్తిస్తూనే పరిష్కారానికి రెండు పక్షాలూ సిద్ధపడాలని సూచించినది. అంతవర దాకా చట్టాల అమలును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ ఉమ్మడి కమిటీని కూడా వేయడం జరిగింది కానీ నిర్మాణాత్మక చర్చలు, నిర్ణయాలు కానీ జరగకపోగా 700 మంది రైతులు అనేక కారణాల రీత్యా ఉద్యమానికి బలిదానం చేయక తప్పలేదు.
పోలీసుల లాఠీచార్జి ,భాష్పవాయువు ప్రయోగము, ఇతర విధ్వంసకర పద్ధతులను ఉపయోగించి రైతుల ఉద్యమాన్ని చిన్నాభిన్నం చేయడం జరిగింది. రోడ్లపైన నిరసన ప్రదేశంలో మేకులను దించి ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా విద్రోహ చర్యలకు పాల్పడింది కేంద్ర ప్రభుత్వం. అయినా పట్టువదలని విక్రమార్కుల వలె రైతు సంఘాలు ట్రాక్టర్ ర్యాలీ, పాదయాత్ర వంటి అనేక రూపాలలో ఉద్యమాన్ని కొనసాగించి అనేక రాష్ట్రాల ప్రజల మద్దతును పొందగలిగింది అనేది నిర్వివాదాంశం.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఉద్యమ ప్రాంతానికి వెళ్లి వారి అవసరాలను తీర్చి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గా ప్రకటించడం చాలా గొప్ప విషయం. పంజాబ్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఉద్యమానికి అందించిన మద్దతు ప్రభుత్వాన్ని ఆలోచింపజేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కేంద్ర ప్రభుత్వ వాదన
ఉద్యమం జరిగిన సందర్భంలోనూ రైతు చట్టాలను ఉపసంహరించుకున్న నేడు కూడా ప్రధానమంత్రి చట్టాల్లోని లోపాలను అంగీకరించక పోగా అవి రైతులకు మేలు చేస్తాయి అని చెప్పడం ప్రభుత్వం మొండి తనానికి నిదర్శనం. చట్టాల్లోని రైతు ప్రయోజనాన్ని రైతులకు విడమర్చి చెప్పినప్పటికీ ఆమోదిచలేదని రైతులను ఒప్పించలేకపోయినందునే చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించి తన పట్టును నిలుపుకోవాలని చూసింది.
2022 సంవత్సర ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలలో జరగాల్సిన ఇటువంటి సాధారణ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి సవాల్ గా మారిన నేపథ్యంలో రైతు సంఘాలు ప్రధానంగా ఆ రాష్ట్రాల నుండి ఉద్యమించి పాల్గొన్నాయి. కనుక రైతు వ్యతిరేకతను తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చట్టాలు ఉపసంహరణకు పాల్పడినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్, రాజనీతి శాస్త్ర ఆచార్యులు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు చట్టాల ఉపసంహరణ రైతుల, ప్రజల విజయమని ఈ అనుభవం దేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక ఉద్యమాలకు కనువిప్పు కావాలని ఆకాంక్షించారు.
రైతు చట్టాల ఉపసంహరణ ఏం చెబుతుంది?
అనేక కష్టనష్టాలకోర్చి సంవత్సర కాలంగా పట్టు వదలకుండా పోరాడిన కారణంగానే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని చట్టాల ఉపసంహరణకు ఆమోదించడం ప్రజా ఉద్యమాల యొక్క తీవ్రతను తెలియజేస్తుంది అని ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను గుర్తించ నటువంటి యువత, విద్యార్థి సంఘాలు ఈ ఉద్యోగం చూసైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలు చేసిన వాగ్దానాలు అమలు కాకపోగా లక్షల కోట్ల రూపాయలను అప్పుగా చేసి ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేల ప్రజా ఉద్యమాలు రావలసిన అవసరాన్ని ప్రజాసంఘాలు ,అఖిలపక్షాలు గుర్తించవలసిన అవసరం ఉంది. ధాన్యం కొనుగోలు పేరుతో అధికార పార్టీలు రెండూ కూడా దోబూచులాడుతున్న విషయాన్ని బహిర్గతం చేయడానికి కూడా ముందుకు రావాలి. చట్టాల రూపకల్పనలో నూ చట్టాల రద్దు కోసం కూడా ప్రజా ఉద్యమాలు తప్పక పని చేస్తాయని అనేక దృష్టాంతాలు ఉన్నవేళ అందుకు ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి సిద్ధ పడాల్సిన అవసరాన్ని ఈ రైతు విజయం చెప్పకనే చెప్పింది. ఈ సందర్భాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, అఖిల పక్షాలు, ముఖ్యంగా వామపక్షాలు ఉపయోగించుకోవడం ద్వారా తమ ఉనికి ప్రశ్నార్థకం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఉపసంహరణకు టిఆర్ ఎస్ ప్రభుత్వానికి సంబంధమే లేదు
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను ఆమోదించిన తర్వాత అంగీకరించని రైతు సంఘాలు ఉద్యమ బాట పడితే తెరాస పార్టీ మాత్రం ప్రభుత్వ రైతు చట్టాలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించి కేంద్రాన్ని సమర్థించింది. ఆ తర్వాత మాట మార్చిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థించిన రైతు చట్టాలను వ్యతిరేక చుట్టాలని తూలనాడడం ప్రభుత్వం యొక్క రెండు నాలుకల ధోరణి కి నిదర్శనం. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇటీవల కేంద్రంపై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రతినిధులు రైతు వ్యతిరేక చట్టాలు అంటూ ప్రకటించడం జరిగింది.
పాలాభిషేకాలు ఎందుకు?
పాలాభిషేకాల సంస్కృతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన బానిసత్వాన్ని ప్రతిబింబించే ప్రజా వ్యతిరేక సంస్కృతి. సభలు, సమావేశాలు, ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ మద్యం ఏరులై పారింది ఎక్కువగా ఈ కాలంలోనే.