దత్తత మండలాలుగా పిలవబడుతున్న మన ప్రాంతాన్ని రాయలసీమగా నామకరణం చేయడం ఆత్మగౌరవానికి ప్రతీకని, అందుకే నేడు రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవాన్ని రాయలసీమ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు తెలిపారు.
స్థానిక కర్నూలు నగరంలోని మాస్టర్స్ జూనియర్ కాలేజ్ నందు జెఎసి కన్వీనర్ కొత్తకోట మోహన్ అధ్యక్షతన 93వ రాయలసీమ నామకరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా ఆర్.యు.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, విద్యార్థి జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యంలో రతనాల సీమగా వెలిగిన రాయలసీమ, నిజాం రాజ్యంలో వుంటూ నవాబు నిర్లక్ష్యానికి గురై, అప్పుడు వున్న పాలేగళ్ళ పాలనలో సతమతం అవుతూ వుండేవారని, నిజాం రాజ్యంకి మరాఠా, టిప్పు సేనల నుంచి ప్రమాదం వున్న పరిస్థితులలో బ్రిటిష్ సైన్య సహకారం కోసం మన సీమ జిల్లాలను దత్తుగా ఇచ్చేసాడని, సాయం ఇస్తున్న కారణంగా వచ్చిన ప్రదేశాన్ని ఆ సాయం కోసం ఖర్చు అయిన వ్యయానికి పదింతలు మన కరువు సీమ నుంచే బ్రిటిష్ వారు పన్నుల రూపంలో వసూలు చేసే వారని, ఇలా దాడులు మరియు రాజుల ఆటలో విసిరి వేయబడ్డ మన సీమ “దత్తు” అనే పిలుపుతో ఆత్మ విశ్వాసం దెబ్బతినేలా వుండేదన్నారు.1928 నవంబర్ 18 న ఉదయం “ప్రథమ దత్త మండల సమావేశం” కె. శరభారెడ్డి సభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కాగా, కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రారంభమైనది. ఈ సభలో అనేక రాయలసీమ సమస్యలు చర్చకు వచ్చాయని, ఇదే సందర్భంలో ఈ ప్రాంతానికి దత్తమండలం బదులు, “రాయలసీమ” అని ఉంటే బాగుంటాదని పప్పూరి రామాచార్యులు సూచించారు.
అనంతపురం కాలేజి అధ్యాపకులు శ్రీకాకులం వాసి చిలుకూరి నారాయణరావు ప్రతిపాదించాడని, నిజానికి చిలుకూరి వారు1928 సెప్టెంబర్ 8 నాడే “దత్త” అనే గేయం రాసి కాలేజి మ్యాగజైన్ లో ప్రచురించాడని ఈ ప్రాంతం దత్త కాదని చాలా గొప్పదని ఆ గేయంలో తెలిపాడని అన్నారు
చరిత్రలో రాయలసీమ అనే పద ప్రయోగం పట్ల అనంత భూపాలుడి ఆస్థానంలో వెలువడిన “అభిషిక్తరాఘవీయం” కావ్యంలో కనిపిస్తుందని వివరించారు. చిలుకూరు వారు రాయలసీమ పేరు పై స్పష్టంగా తన ఆలోచనలు నంద్యాలలో తెలియ చేశాడని, ఈ ప్రాంత ఆత్మగౌరవానికీ ప్రతీకగా రాయలసీమ పేరును సీమవాసులందరు ఏకగ్రీవంగా ఆమోదించారని, ఈ పేరునే పప్పూరు రామచార్యులు తన సాధన పత్రికకు వాయిస్ ఆప్ ది రాయలసీమ అని ట్యాగ్ లైన్ పెట్టి రాయలసీమ పదాన్ని ప్రచారం చేసాడని, మిగతా సీమ నాయకులు కూడా రాయలసీమ పదాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారని, ఆ రకంగా నుండి రాయసీమగా మారిన ఆ దినాన్ని “రాయలసీమ ఆత్మగౌరవదినం”గా నాలుగు జిల్లాలలో ప్రజలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ నాయుడు, జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రవి, విద్యార్థి జెఎసి ప్రచార కార్యదర్శి బి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.