తిరుమల: తిరుమల శ్రీవారి మెట్ల మార్గం, అలిపిరి నడకదారులను రేపు, ఎల్లుండి మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నడక మార్గాలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే పేర్కొంది. ఈ మేరకు శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. గత వారంలో కూడా తిరుమల వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డును మూసేసిన సంగతి తెలిసిందే.
వర్షం హెచ్చరిక
నవంబర్ 17 రాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలవుతాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. బలమైన అల్పపీడనం వల్ల నవంబర్ 17 రాత్రి నుంచి 20 వరకు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు-తూర్పు, కడప, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ నుంచి తీవ్రమైన వర్షాలు పడనున్నాయి.
ఆ తర్వాత 18 నుంచి చిత్తూరు, కడప జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించనుంది. నవంబర్ 19 ఈ వర్షాలు కొనసాగనుంది, ఆ రోజు అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి. అప్పటికే కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం దక్షిణం, చిత్తూరు తూర్పు, కడప జిల్లాలతో పాటు, పక్కన గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం జిల్లా దాక వర్షం విస్తరించనుంది.
నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కడప నగరాల మీద ఎక్కువ ప్రభావం ఉండనుంది. ఈ సారి కూడ. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయి. కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి.
నవంబర్ 20 నుంచి వర్షాలు మెళ్లగా తగ్గుముఖం పట్టనుంది. కానీ పూర్తిగా తగ్గవు. ఇప్పుడు ఎలా కొనసాగుతున్నాయో, అలాగే కొనసాగుతాయి. మళ్లీ అన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి.