అగ్గి రాజేస్తున్న శ్రీ బాగ్ ఒడంబడిక – 2

(వి. శంకరయ్య)
అమర జీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో పాటు మరి పలువురు బలి దానాలు సంభవించిన తర్వాత గాని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించ లేదు. 1952 అక్టోబర్ 19 వతేదీ పొట్టి శ్రీరాములు మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి ఇంటిలో ఆమరణ దీక్ష ప్రారంభించగా దొడ్డిదారిన మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రాజాజీ కాంగ్రెస్ వారినందర్నీ కట్టడి చేశారు. ఇంకా సూటిగా చెప్పాలంటే 1952 లో ఆంధ్ర ప్రాంతం నుండి కొందరు తనను కలసి ఆంధ్ర రాష్ట్రం వద్దని చెప్పినట్లు రాజ్యసభ లో పుచ్చలపల్లి సుందరయ్య ప్రశ్నకు ప్రధాని నెహ్రూ జవాబు చెప్పి వున్నారు. . తుదకు డిసెంబర్ 16 వతేదీ పొట్టి శ్రీరాములు అమరులైనారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడంతో చిర కాలంగా పెండింగ్ లో వున్న భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గం సుగమమైనది. గమనార్హమైన అంశమేమంటే పొట్టి శ్రీరాములు బలి దానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధాని కాగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కొనసాగింపుగా సాగిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లో భాగంగా కర్నూలు నుండి రాజధాని హైదరాబాదుకు మార్పు చేయబడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఫజల్ అలీ కమిషన్ నియమించింది. ఫజల్ అలీ కమిషన్ నివేదిక తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన చట్టం వచ్చింది. తదుపరి కేరళ కర్నాటక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి కర్నూలు రాజధాని పోయి హైదరాబాద్ అయింది. సీమ వాసులు జీర్ణించుకోలేని ఇదొక చారిత్రక పరిణామం.
స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్ర బద్దంగా తీర్మానం చేసి వున్నా పొట్టి శ్రీరాములు ఆర్మార్పణతో గాని అమలుకు పూనుకోలేదు. 1953 అక్టోబర్ ఒకటవ తేదీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరగగా 15వ తేదీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు, తదుపరి కర్నూలు రాజధానిగా ఎంపిక ముందు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు
సంభవించాయి.
1952 సాధారణ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా అవిభక్త మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయింది. 375 మంది సభ్యులు గల శాసన సభలో కాంగ్రెస్ పార్టీ తరపున 152 సభ్యులు మాత్రమే గెలుపొందారు. . అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలో 144 స్థానాలకు కేవలం 40 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆనాటి కాంగ్రెస్ లో ఉద్దండులైన బెజవాడ గోపాలరెడ్డి నీలం సంజీవరెడ్డి కళా వెంకట్రావు లాంటి వారు ఓడి పోయారు. కమ్యూనిస్టు పార్టీ 42 స్థానాల్లోనూ ప్రకాశం పంతులు నాయకత్వాన గల కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 20 స్థానాల్లోను ఆచార్య రంగా నాయకత్వానగల కృషీకార్ లోక్ పార్టీకి 15 మంది ప్రజా సోషలిస్టులతో పాటు ఇండిపెండెంట్లు పలువురు ఎన్నికైనారు.
ఈ నేపథ్యంలో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో 1952 ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలో పడింది. కమ్యూనిస్టులతో సహా కాంగ్రెసేతర పార్టీలు ఏకమై యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వాన ఏర్పాటు చేశారు. శాసన సభ లో వీరికి 166 మంది శాసనసభ్యుల బలం వుండగా కాంగ్రెస్ కు 152 మంది మాత్రమే వున్నారు. అయితే మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటుకు పైగా కమ్యూనిస్టులు అందులో భాగ స్వాములుగా వుండటాన్ని కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం అంగీకరించ లేదు. అంత క్రితం గవర్నర్ జనరల్ గా పని చేసిన రాజాజీని కౌన్సిల్ కు నామినేట్ చేశారు. అప్పటి మద్రాసు గవర్నర్ ప్రకాష్ శాసన సభలో ప్రకాశం పంతులుకు మెజారిటీ వున్నా ప్రభుత్వం ఏర్పాటుకు పిలవ కుండా సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ పేర కాంగ్రెస్ కు నాయకడైన రాజాజీని ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించారు. రాజాజీ తమిళ నాడులో కొన్ని పార్టీలను ఆంధ్రలో కృషీకార్ లోక్ పార్టీని చీల్చి మెజారిటీ సాధించారు
ఈ పూర్వ రంగంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగినపుడు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతి పాదన చేయగానే అంత వరకు కమ్యూనిస్టులతో కలసి రాజగోపాలాచారికి వ్యతిరేకంగా పోరాడిన ప్రకాశం పంతులు కాంగ్రెస్ పక్షం చేరి పోయారు. 1952 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయిన నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితమై శ్రీ కాళహస్తిలో ఉప ఎన్నికలు తెప్పించి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. ఈ సందర్భంలో రాజధాని సమస్య తీవ్ర వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్ లో ఒక వర్గం కమ్యూనిస్టు సభ్యులు మరి కొందరు రాష్ట్రం నడి బొడ్డు విజయవాడలో రాజధాని వుండాలని పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించారు. గమనార్హమైన అంశమేమంటే ఆ రోజుల్లో రాయలసీమలో కాంగ్రెస్ కోస్తా జిల్లాల్లో కమ్యూనిస్టు సభ్యులతో పాటు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీతో పాటు ఇండిపెండెంట్ ఎక్కువగా ఎన్నికైనారు. ఈ పరిస్థితుల్లో విజయవాడలో రాజధాని నెలకొల్పితే రోజు వారీ ప్రభుత్వ కార్యకలాపాలు సాగించడం కష్టమని పైగా నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులతో వుండి వెంటనే కాంగ్రెస్ తో కలసి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ప్రకాశం పంతులు ప్రభుత్వం నిర్వహించడం కుదరదని భావించారు. దీనికి తోడు రాయల సీమలో శ్రీ బాగ్ ఒడంబడిక డిమాండ్ బలంగా తెర మీదకు వచ్చింది. ఫలితంగా ప్రకాశం పంతులు కర్నూలు రాజధానిగా ఎంపిక చేశారు. రామాయణంలో పిడకల వేట లాగా కొత్తగా ఏర్పడిన ఆంధ్ర శాసన సభ లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఉత్తరాంధ్ర నుండి ఎన్నికైన కొందరు ఇండిపెండెంట్లకు గాలం వేసి 1955 తర్వాత రాజధానిని విశాఖకు మార్పు చేయబడుతుందని హామీ ఇచ్చి వారి సాయం పొందారు. ఇన్ని చిక్కుల మధ్య ఆ రోజుల్లో కర్నూలు రాజధాని అయింది.
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితే తదగుణంగా సంభవించిన కొత్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా శ్రీ బాగ్ ఒడంబడిక ద్వారా దక్కిన రాజధానిని సీమ వాసులు కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజింప బడిన తర్వాత సంభవించిన పరిణామాలు ఈ తరం వారికి ప్రత్యేకంగా చెప్ప పని లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *