వరి ధాన్యం సేకరణ విషయంలో తన తప్పేమీ లేదన్నట్లు నెపం మొత్తం కేంద్రంపై తోసేసి చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్
(కన్నెగంటి రవి)
” కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్ధు చేయాలి . తెలంగాణలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి . పెట్రోల్, డీజిల్ పై కేంద్రం పూర్తిగా సెస్ పూర్తిగా రద్ధు చేయాలి. ఈ డిమాండ్లతో డిల్లీలో ధర్నా చేస్తాం. ఉద్యమం చేస్తున్న ఉత్తర భారత రైతులకు మద్ధతుగా కూడా ధర్నా చేస్తాం. ఇకపై కేంద్ర ప్రభుత్వం వెంట పడతాం . రాష్ట్ర బీజీపీ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడితే మెడలు విరిచేస్తాం. నాలుకలు కోసేస్తాం”
తెలంగాణలో ధర్నా చౌక్ ను రద్ధు చేసిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశ్చర్యకరంగా ఈ రోజు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి, కేంద్రానికి వ్యతిరేకంగా తన పార్టీ ఎంఎల్‌ఏ లు, ఎంఎల్‌సి లు, ఎంపి లతో డిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు .
పైగా తనను విమర్శిస్తున్న బీజీపీ నాయకులపై చట్టబద్ద చర్యలు తీసుకోవడమే కాకుండా మెడలు విరిచేస్తాం , నాలుకలు తెగ్గొస్తాం అని హింసాత్మక భాష కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏ హింసకూ పాల్పడకుండా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణా ప్రజా సంఘాల కార్యకర్తలపై UAPA కేసులు పెడుతున్న ఈ ముఖ్యమంత్రి , ఇప్పుడు ఈ తరహా హింసాత్మక బెదిరింపులు ప్రెస్ మీట్ లో చేస్తే చట్టం మౌనంగా ఉంటుందా, తన పని తాను చేసుకు పోతుందా చూడాలి.
గత ఏడేళ్లుగా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు , ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక సంస్థలు కేంద్రం పోకడలపై, నిరంకుశ పాలనా పద్ధతులపై చేస్తూ వచ్చిన విమర్శలనే ఈ రోజు ముఖ్యమంత్రి తనదైన భాషలో బలంగా చెప్పారు. కేంద్రం పై ఈ రోజు ప్రెస్ మీట్ లో కేసిఆర్ మాట్లాడిన విషయాలన్నీ వాస్తవాలే.
తనకు కోపం వచ్చినప్పుడల్లా కేంద్రంపై ఇలాంటి భాష మాట్లాడడం కేసిఆర్ కు కొత్త కాదు. గతంలో అనేక సార్లు ఇది జరిగింది . కేసిఆర్ కేంద్రంతో ఎప్పటికప్పుడు ఎటువంటి లాలూచీ పడతారో చెప్పలేం కానీ, గతంలో కేంద్రం తెచ్చిన అనేక ప్రజా వ్యతిరేక చర్యలను సమర్ధించడం, పార్లమెంటులో అధికార పార్టీకి అండగా నిలబడడం చాలా సార్లు తెలంగాణా ప్రజలు చూశారు. మూడు వ్యవసాయ చట్టాల విషయం లోనూ కేసిఆర్ తీసుకున్న U టర్న్ లను కూడా చూశాం.
ఈ రోజు కూడా కేసిఆర్ కేంద్రంపై విరుచుకు పడిన వైనాన్ని చూసి , కొంతమందికి సంతోషం కలగొచ్చు . కానీ ఆ సంతోషాన్ని కేసిఆర్ ఎన్ని రోజులు నిలబెడతారో చూడాల్సి ఉంది. ప్రజలు హుజూరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు చూసి, కేసిఆర్ తక్షణ కోపంగా ఈ రోజు కేంద్రంపై విరుచుకు పడ్డారనడంలో ఏ మాత్రం సందేహం లేదు . కేసిఆర్ ఈ రోజు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కేంద్ర తప్పుడు , ప్రజా వ్యతిరేక విధానాలపై నిలకడగా పోరాడే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిగా ఉంటుందా? తిరిగి మరోసారి కేంద్రంతో కుమ్మక్కు రాజకీయాలకు కేసిఆర్ ప్రాతిపదిక వేసుకోవడానికి ఉపయోగ పడుతుందా ? అన్నది చూడాల్సి ఉంది.
రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో ఉంది. పంటల ఉత్పత్తి , పరిశోధన , మార్కెట్లు, ధరలు –అన్నీ రాష్ట్ర జాబితా లోనే ఉన్నాయి. మరి ఈ బాధ్యతలను కేసిఆర్ సక్రమం గా నిర్వర్తించాడా ? రాష్ట్రానికి అవసరమైన సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాడా ? రాష్ట్ర వాతావరణ పరిస్థితులు , అవసరాల ప్రాతిపదికన పంటల ప్రణాళిక రూపొందించాడా ? రాష్ట్రంలో పండే కూరగాయలకు , పండ్లకు కేరళ తరహాలో కనీస మద్ధతు ధరలు ప్రకటించాడా ? రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన నూనె గింజలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా అమలు చేశాడా ? ఏమీ లేదు . మనం ఎంత మొత్తుకున్నా అటువైపు కనీసం దృష్టి సారించలేదు .
పైగా ఇప్పటికీ , రాష్ట్రంలో రసాయనిక ఎరువుల వాడకం మూడు రెట్లు పెరగడాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను గొప్పగా చెప్పుకుంటున్నాడు . శాస్త్రీయత లేకుండా ప్రారంభించిన ఎత్తి పోతల ప్రాజెక్టుల నిర్మాణాన్ని విచక్షణా రహితంగా సమర్ధించుకుంటున్నాడు. వాస్తవ సాగు దారులకు ఇవ్వకుండా , సాగు చేయని భూములకు కూడా రైతు బంధు ఇస్తూ , వేల కోట్లు దుర్వినియోగం చేస్తూ అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు. రాష్ట్రంలో వరి, పత్తి పంటలు విపరీతంగా పెరగ డానికి కారణమైన తన నియంత్రిత సాగు ప్రణాళికను సమర్ధించుకుంటున్నాడు. వీటి పట్ల ఆత్మ విమర్శనా యుతంగా ఈ రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు.
దేశ ఆహార బధ్రతకు అవసరమైన ధాన్యం సేకరణ చేయడం ,కొంత బఫర్ స్టాక్ కోసం సేకరించడం కేంద్రం బాధ్యత . కేంద్రం తన పిడిఎస్ అవసరాల మేరకు , లేదా బఫర్ స్టాక్ అవసరాల మేరకు తప్పకుండా రాష్ట్రాల నుండి సేకరించాల్సిందే . కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో నిర్ధిష్ట ప్రణాళిక ఉండడం లేదు . సేకరణ ప్రణాళిక విషయంలో సరైన సమయానికి రాష్ట్రానికి సమాచారం ఇవ్వడం లేదు . రాజకీయ కారణాలు కూడా ఈ సేకరణ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు కూడా ఈ పంటల సేకరణ ప్రక్రియ లో సమస్యలను సృష్టిస్తున్నాయి. ఎఫ్‌సిఐ ని మూసేసే ఆలోచన , ప్రజా పంపిణీ వ్యవస్థ ( PDS) ను బలహీన పరచడం, పంటల సేకరణ నుండి ప్రభుత్వ సంస్థలు పూర్తిగా బయటకు వచ్చేయాలనే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో ఉన్నాయి. అమెరికా , బ్రెజిల్ లాంటి దేశాలు కూడా ఈ విషయంపై WTO కోర్టులో భారత దేశానికి వ్యతిరేకంగా కేసులు దాఖలు చేస్తున్నాయి. వాటి ఒత్తిడికి భారత ప్రభుత్వం లొంగిపోతున్నది. రైతులకు, ప్రజలకు హాని చేసే కేంద్ర ప్రభుత్వ ఈ విధానాలను తప్పకుండా మనం వ్యతిరేకించాల్సిందే.
ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పినట్లుగా “కేంద్రం వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ వైపు తీసుకు వెళుతున్నది”. ఈ విధానాలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా వ్యతిరేకిస్తుంటే , ఆ పోరాటానికి తెలంగాణా ప్రజలు తప్పకుండా మద్ధతు ఇవ్వాల్సిందే.
తెలంగాణా రాష్ట్రంలో పంట మార్పిడి చేయమని కేంద్రమే చెప్పిందని కేసిఆర్ ప్రకటించారు. నాబార్డ్ కూడా 2018 లోనే తెలంగాణలో పత్తి, వరి పంటలను తగ్గించుకోవాలని చెప్పింది . సుస్థిర వ్యవసాయ కేంద్రం ( సిఎస్‌ఏ ), రైతు స్వరాజ్య వేదిక కూడా మొదటి నుండీ తెలంగాణా రైతులు పంటల మార్పిడి చేసుకోవాలని చెబుతూ వచ్చాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఇది అవసరం కూడా .
ఈ నేపధ్యంలో ఇప్పటికైనా కేసిఆర్ కేంద్రం మీదకు నెపం నెట్టేసి , చేతులు దులుపుకోకుండా , రాష్ట్ర వ్యవసాయాన్ని బాగు చేయడానికి , సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి. వ్యవసాయ అభివృద్ధి పేరుతో తాను తీసుకున్న కొన్ని తప్పుడు ధోరణులను,పథకాలను వెంటనే సవరించుకోవాలి. ఈ సంవత్సరం వానాకాలంలో పండిన వరి పంటను కేంద్రం పూర్తిగా కొనేలా కేంద్రం పై ఒత్తిడి చేయాలి. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. కేంద్రం పూర్తిగా కొనే స్థితి లేకపోతే , కొంత ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సేకరించి,ప్రాసెస్ చేయించి తక్కువ ధరలకు బియ్యాన్ని వినియోగదారులకు రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ద్వారా నేరుగా అమ్మడానికి ప్రయత్నం చేయాలి .
సాంఘిక సంక్షేమ హాస్టళ్లు , స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకం , ఐసిడిఎస్ లాంట్ పథకాలకు కూడా ఈ సంవత్సరం రాష్ట్రం నేరుగా బియ్యాన్ని సేకరించాలి. విద్యార్ధి సంఘాలు కోరుతున్నట్లుగా ప్రభుత్వ ఇంటర్ , డిగ్రీ ,సాంకేతిక కాలేజీలలో కూడా విద్యార్ధుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలి .2013 ఆహార భద్రతా చట్టం కు 2017 రాష్ట్ర నియమాల ప్రకారం అర్హులైన అన్ని కుటుంబాలకు అంత్యోదయ అన్నయోజన పథకం క్రింద కార్డులు ఇచ్చి ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యం సరఫరా చేయాలి. ఆ రకంగా ఉత్తపత్తి అయిన బియ్యాన్ని వినియోగంలోకి తీసుకు రావాలి .
ఈ యాసంగి నుండే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ప్రారంభించాలి . రైతులకు ఈ పంటల విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలి. చెరకు విస్తీర్ణాన్ని పెంచడానికి , షుగర్ మిల్లులను వెంటనే తెరిపించే ప్రక్రియ చేపట్టాలి . పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు సాగు చేసే రైతుల నుండి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్ధతు ధరలకు కొని నేరుగా వినియోగదారులకు పిడిఎస్ ద్వారా సరఫరా చేయాలి. రైతులకూ, వినియోగ దారులకూ కూడా దీని వల్ల లాభం జరుగుతుంది . రాష్ట్రంలో కూరగాయల విస్తీర్ణాన్ని పెంచాలి. రాష్ట్రంలో పండే అన్ని కూరగాయలకు ,పండ్లకు కేరళ తరహాలో కనీస మద్ధతు ధరలను ప్రకటించాలి . అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం వీటిని కొని సంచార వాహనాల ద్వారా వినియోగదారులకు అమ్మాలి.
రాష్ట్రం చెబుతున్నట్లుగా తెలంగాణా లో వరి సాగు అంత లేదని కేంద్రం అంటోందని కేసిఆర్ కు కోపం వచ్చింది. మనం అబద్దాలు చెబుతామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . కానీ, నిజంగానే వరి, పత్తి విస్తీర్ణాల విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మరోసారి లెక్కలు సరి చూసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్నంత భూమి కానీ, పంటల ఉత్పత్తి కానీ కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో రైతు బంధు కోసం వ్యవసాయ అధికారులతో రైతులు రాయించుకుంటున్న లెక్కలన్నీ తప్పుల తడకలు . వాటి ఆధారంగా కేసిఆర్ కేంద్రానికి లెక్కలు చెప్పి ఒప్పించడం కష్టం.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను గుర్తించకుండా ఇబ్బంది పెడుతుంటే కేసిఆర్ ఎంత బాధ పడ్డారో, ఆయనకు ఎంత కోపం వచ్చిందో కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో చూశాం . ఇలాగే రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉండి, రాష్ట్రంలో కౌలు, పోడు రైతులను గుర్తించక పోవడం వల్ల , ఆ రైతులు ఎంత బాధ పడుతున్నారో , ఎంత నష్ట పోతున్నారో కేసిఆర్ కు ఎప్పుడు అర్థమవుతుంది?
తాము రైతు బంధు ఇవ్వడం వల్ల , రైతులు బ్యాంకులకు వెళ్ళి, పంట రుణాలు కూడా తెచ్చుకోవడం లేదని కేసిఆర్ ఈ రోజు గొప్పలు చెప్పుకున్నారు . రాష్ట్రం లో పత్తికి, వరికి ఎకరానికి 35 వేల రూపాయలు ఖర్చు అవుతుందని నిర్ణయించి, రాష్ట్ర బ్యాంకులే 35,000 రూపాయలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గా ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు 5000 రూపాయలు ఎలా పెట్టుబడికి సరి పోతాయి. నిజానికి రైతుల ఋణ మాఫీ సక్రమంగా అమలు చేయక పోవడం వల్ల, రైతులందరికీ బ్యాంకులలో పాత బకాయిలు ఉండిపోయి , బ్యాంకులు కొత్తగా రైతులకు పంట రుణాలు ఇవ్వడం మానేశాయి. అంతే తప్ప రైతు బంధు ఇవ్వడం వల్ల, రైతులు ఇక రుణాలు తీసుకోవడం లేదని కేసిఆర్ చెప్పుకోవడం అతిశయోక్తి మాత్రమే. రైతులు, ప్రైవేట్ రుణాల ఊబిలో కూరుకు పోతున్నారని ఇటీవలే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 73 వ నివేదిక బయట పెట్టింది .
2021 ఆగస్టులో ఒక సభలో కేసిఆర్ మాట్లాడుతూ , ఖరీఫ్, రబీలో తెలంగాణా 3 కోట్ల టన్నుల ధాన్యం పండించడం గురించి గొప్పగా చెప్పుకుని గర్వ పడ్డాడు. తెలంగాణా ధాన్యాగారంగా మారిందనీ, ఎఫ్‌సిఐ కి అత్యధిక వడ్లు సరఫరా చేయడం ద్వారా, దేశానికి అన్నం పెట్టేలా ఎదిగిందనీ మురిసిపోయాడు . తన ప్రభుత్వం గ్రామాలలో సెంటర్లు పెట్టి ధాన్యం కొంటుందని గొప్పగా చెప్పుకున్నాడు. కేసిఆర్ మాటలను రైతులు అమాయకంగా నమ్మారు కూడా. ఇప్పటివరకూ ధాన్యం సేకరణలో కేంద్రం పాత్రేమీ లేదని సాధారణ రైతులు అనుకున్నారు. కేసిఆర్ గొప్ప పని చేస్తున్నాడని మెచ్చుకున్నారు. ఎప్పుడు,ఎంత వరి ధాన్యం సాగు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కొనాలని అందుకే డిమాండ్ చేస్తున్నారు.
కానీ ఈ సంవత్సరం ఎఫ్‌సిఐ తాను యాసంగి ధాన్యం, ముఖ్యంగా పారా బాయిల్డ్ రైస్ కొనలేనని తేల్చి చెప్పడంతో, ఒక్క సారిగా కేసిఆర్ భూమి మీదకు వచ్చాడు. ధాన్యం కేంద్రం కొనాలనీ , అది కేంద్రం బాధ్యతనీ గగ్గోలు పెడుతున్నాడు . రాష్ట్ర రైతులు రాష్ట్ర ప్రభుత్వం తో కలసి, కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని, ముఖ్యమంత్రి, మంత్రులు పిలుపు ఇస్తున్నారు
ఈ సంకటి స్థితి నుండి బయట పడడానికే, కేసిఆర్ ఇప్పుడు కేంద్రంపై యుద్దం ప్రకటించాడు . కానీ పూర్తి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందో, లేదో ప్రెస్ మీట్ లో కూడా స్పష్టంగా కేసిఆర్ ప్రకటించలేదు. సెంటర్లు వేగంగా ఓపెన్ చేయడం గురించీ, పూర్తి ధాన్యం కొనడం గురించీ ఏ మాటా చెప్పకుండా , ధర్నాలకు పిలుపు ఇచ్చి చేతులు దులుపు కున్నాడు.
మొత్తంగా రాష్ట్ర వ్యవసాయ రంగం ఇప్పుడు చౌరస్తాలో నిలబడి ఉంది. రాష్ట్ర రైతుల చైతన్యంతో , పోరాటంతో సరైన మార్గంలోకి మళ్లుతుందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దున్న పోతుల పోట్లాటలో కాళ్ళు విరగ్గొట్టుకునే ,లేగదూడలా మిగిలిపోతుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది.
(కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, ఫోన్: 9912928422)