చరిత్ర తెలిసిన మీరు, కుల గణనను కాదనకండి. కాదంటే, కుల బాధితులకు ద్రోహం అవుతుంది.
“కుల గణన కాదు” అనడం, జాతి జీవనం మీద కుల ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయ గలిగిన, రంగనాయకమ్మ గారి లాంటి పరిణితి గల ప్రముఖులు మాట్లాడ్డం, చాలా వింతగా ఉంది. అది సరికాదు.
అసమానంగా సమాజం నిర్మాణం కావడానికి, ప్రధాన కారణం కులం అనే వాస్తవానికి ఈ కోవ మేధావులు, వర్గ వాదంతో ముసుగు వేయగలరా ? వర్గ వాదంతో కుల ప్రభావాన్ని అప్రధానం చేయి గలరా ? అటువంటి ప్రయత్నాలు కొనసాగించడం ఎవరి లబ్ధి కోసం ? ఆధిపత్య శక్తుల లబ్ధికోసం కాదా ?
అది కాదు అన తలచుకొంటే, ఇప్పటికే తమ దామాషాకు మించి, నాలుగైదు రెట్లు అవకాశాలను సొంత చేసుకొంటున్న ఆధిపత్య శక్తులకు, హాస్యాస్పదంగా ధ్వనించే వారిలోని “ఆర్ధిక వెనక బాటు తనం” సాకుతో, రిజర్వేషన్ల పేరుతో, అదనంగా మరో 10% అవకాశాలు కల్పించడాన్ని, రంగనాయకమ్మ గారు ఏమేరకు వ్యతిరేకించారో సమాజం చూసింది.
వారికి కులం గురించి ప్రస్తావించడం ఇష్టం లేకపోవచ్చు. నచ్చక పోవచ్చు. వారు నమ్మిన సిద్ధాంతానికి పొంతన కుదరదు అని భావిస్తే భావించి కూడా ఉండ వచ్చు.
అయితే, ఈ దేశ జీవనాన్ని సర్వ విధాల ప్రభావితం చేస్తున్నది, కులాన్ని మించిన మరో నిజం లేదు అనే వాస్తవం తెలియని మేధావులు ఈ స్థాయిలో మరెవరైనా ఉంటారా ? ఉండ కూడదు. అయితే, అది కుల బాధితులకు అర్ధమైనంతగా కులవ్యవస్థ లోని లబ్ధి దారులకు అర్థం కాదు అనేదే వాస్తవంలా కనపడుతుంది. ఈ దేశ జీవనాన్ని, “కులం” ప్రమాణంలో మాత్రమే వివరించడానికి, అర్థం చేసుకోవడానికి వీలైనంతగా, వర్గం ప్రమాణంలో అర్థం చేసుకోవడం కుదరదు. కులంలో ఉన్న వర్గం, వర్గవాదులకు కనబడదా ? లేక అది సరిపోదా ?
“కుల గణన కాదు, వర్గ గణన కావాలి” అనే శీర్షికతో 20-10-2021 నాటి ఆంధ్ర జ్యోతి దినపత్రిక లో ప్రచురితమైన రంగనాయకమ్మ గారి వ్యాసం పై స్పందన
దేశ జీవనాన్ని అన్నివిధాలా, అన్నిరంగాల్లో, నిత్యం నిర్ణయాత్మక గా ప్రభావితం చేస్తున్న “కులం” నిజాన్ని చూసి కులవ్యవస్థ లబ్ధిదారులు తొమ్మిది దశాబ్దాలుగా భయపడుతున్నారు. అందుచేతే కుల గణన ను, తొమ్మిది దశాబ్దాలుగా, ముఖ్యంగా, స్వాతంత్ర్యానంతరం ఏడు దశాబ్దాలుగా, ప్రత్యక్షంగానూ పరోక్షంగా నూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రంగనాయకమ్మ గారు కూడా దీనికి అతీతం కాలేక పోతున్నారు. ఈ వాస్తవం చాలు, సమ సమాజ నిర్మాణానికి, కుల గణన అవసరాన్ని నొక్కి చెప్పడానికి.
సమ సమాజ నిర్మాణం జరగాలన్నా, కులవ్యవస్థ నిర్మూలన కావాలన్నా, కొనసాగుతున్న, అసమాన విలువలకు, అవకాశాలకు అద్దం కావాలన్నా, కుల గణన జరిగి తీరాల్సిందే. కుల గణన కేవలం, బీసీ కులాలకే పరిమితం కావాలనడం, సమస్య స్వరూపం పూర్తిగా అర్ధం కాకే, కొందరు బీసీ నాయకులు అమాయకంగా కోరుతున్నారు. కులం కలిగిన ప్రతీ పౌరుణ్ఢి, ఆధిపత్య కులాలనుండి అంటరాని కులాలుగా ఉండిన అన్ని కులాలు, కుల గణన చట్రంలో ఉండితీరాలి. ఎవరి పరిస్థితి ఏంటో సమాజానికి తెలియ వలసిన నిజం. అది సర్వ కుల గణన ద్వారా మాత్రమే వీలవుతుంది. అసమానతల సమాజం, రాజ్యాంగ లక్ష్యం అయిన సమసమాజం గా రూపాంతరం చెందాలంటే, కుల గణన తప్పని సరి. పుండుని కప్పి పెట్టి చికిత్స చేయలేం.
కుల గణన ను వ్యతిరేకిస్తుంది, అంతర్గతంగా సమన్యాయం కిట్టని, సామాజిక న్యాయం ఇష్టం లేని, సమ సమాజ నిర్మాణం తట్టుకో లేని, ఆధిపత్యానికి ఆరాటపడే శక్తులే తప్ప నిజమైన అభ్యుదయ వాదులు, మానవీయత ను నిజంగా జీర్ణించు కున్న వారు ఆ తప్పు చేయలేరు.
–కొండలరావు,
న్యాయ వాది, సామాజిక న్యాయవాది