యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి 6 కేజీల బంగారాన్ని ప్రఖ్యాత మేఘా ఇంజనీరింగ్ సంస్థ (MEIL)బహూకరించనుంది. యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు.దానిని తెలంగాణ తిరుమలగా మార్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తిరుమల ఆలయానికి చెందిన జీయర్ స్వామీజే యాదాద్రికి కూడా సలహాదారు. ఆయనే ఆలయ పున: ప్రారంభానికి ముహూర్తం పెట్టారు. మార్చి 28న ఆలయ ప్రారంభం ఉంటుంది.
యాదాద్రి ఆలయ బంగారు తాపడం
తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనుల పరిశీలన సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దాతలకు బంగారు పూతపూయడం గురించి పిలుపు నిచ్చారు. ఆ పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఆరు కేజీల బంగారం సమర్పిస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించింది.
ఈ సందర్భంగా MEIL డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో మేం పాలుపంచుకోవడం తమకు ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు.
దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, పుణ్యస్థలమైన యాదాద్రి ముఖ్యమంత్రి గారి ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, క్రిష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మేఘా సంస్థ నిర్మించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని దర్శనీయ పుణ్య క్షేత్రాల్లో ఒకటి ప్రఖ్యాతి పొందింది.