ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతోపాటు, పరిసరాలన్నింటినీ పరిశీలించారు.
బాలాలయంలో ప్రత్యేక అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అక్కడి నుంచి ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం కేసీఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు.