మంగళగిరి ప్రాంతంలో విద్యారంగంలో విశేష కృషి చేసిన ప్రెగడ ఆది సత్యనారాయణ సోమవారం రాత్రి కన్ను మూశారు. ఆదిసత్యనారాయణకు మంగళవారం ఆత్మీయులు ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు.
అంతకుముందు మంగళగిరి ఇందిరాలవారి వీధిలోని స్వగృహంలో ఆది సత్యనారాయణ పార్ధివ దేహాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, సీకే విద్యాసంస్థల పాలకవర్గాల ప్రతినిధులు, సిబ్బంది సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఆయనతో గల తమ అనుబంధాన్ని మననం చేసుకున్నారు.
మంగళగిరిలో ప్రఖ్యాతిగాంచిన చింతక్రింది కనకయ్య విద్యాసంస్థలకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా రెండు దశాబ్దాలపాటు విశేష సేవలందించారు. సీకే విద్యాసంస్థల వ్యవస్థాపక సభ్యుల ఆశయాలకు అనుగుణంగా పేద విద్యార్థులకు విద్యనందించాలనే సదాశయంతో ప్రెగడ ఆది సత్యనారాయణ పనిచేశారు. అప్పటి సీకే హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఇంజమూరి భావన్నారాయణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా ఆది సత్యనారాయణ జోడీ విద్యాసంస్థల పురోగతికి విశేష కృషి చేసింది. విషయ పరిజ్ఞానం మెండుగా గల ఆది సత్యనారాయణ ఏదేనీ అంశంపై భవిష్యత్తులోనూ ఏ విధమైన సమస్యలు, ఇబ్బందులు రాకుండా లోతుగా అధ్యయనం చేసి గాని తుది నిర్ణయం తీసుకునేవారు కాదు. పాలకవర్గ కమిటీలోనూ ఆయనదే నిర్ణయాత్మక పాత్ర . వీరి హయాంలోనే సీకే జూనియర్ కళాశాల ఏర్పాటయింది. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా సీకే గరల్స్ హైస్కూల్ స్థాపనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. వదాన్యుల సహకారంతో గ్రంథాలయం, ఆటస్థలం చుట్టూ ప్రహరీ వంటి నిర్మాణాలు చేపట్టారు. అలాగే, ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించారాయన.
మంగళగిరిలోని వివిధ రంగాల ప్రముఖులతోపాటు నాటి రాజకీయ ప్రముఖులు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు, నిమ్మగడ్డ రామ్మోహనరావులతో ఆది సత్యనారాయణకు సన్నిహిత సంబంధాలు ఉండేవి.
ప్రెగడ ఆది సత్యనారాయణ బాలనాగు, మహాలక్ష్మి పుణ్య దంపతుల ప్రథమ పుత్రుడు. 1935 జనవరి 29న జన్మించారు. తండ్రి బాలనాగు స్ఫూర్తితో వారి వారసత్వంగా చింతక్రింది కనకయ్య విద్యాసంస్థలకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా సేవలందించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. వీరు 1966 నుంచి దశాబ్దకాలం మంగళగిరి పద్మశాలీయ సంఘానికి అధ్యక్షులుగా సేవలందించి సంఘం పురోభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు. చేనేత వ్యాపారంలోనూ విజయవాడ, మంగళగిరి కేంద్రాలుగా రాణించారాయన.
ఆది సత్యనారాయణ భార్య సరోజిని 12 ఏళ్ల క్రితం కాలం చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, బాలభారతి, డాక్టర్ లక్ష్మీబాల, కుమారుడు నరసింహమూర్తి ఉన్నారు.
తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుదిరగని ఆది సత్యనారాయణ సేవే పరమావధిగా విద్యారంగంలో విశేష సేవలందించిన మానవతామూర్తి, సహృదయులు. ప్రెగడ ఆది సత్యనారాయణ నేడు భౌతికంగా నిష్క్రమించినా మంగళగిరి గడ్డపై చెరగని ముద్ర వేశారు.