ఉంగుటూరు, అక్టోబర్, 16 : కలెక్టర్ గారూ నా సమస్యకు పరిష్కారం చూపండి అంటూ వేడుకొన్న వృద్ధురాలి సమస్యను ఆసాంతం విని వెంటనే పరిష్కరిస్తానని పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వృద్ధురాలికి హామీ ఇచ్చారు.
వై.ఎస్.ఆర్. ఆసరా పధకంలో డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణి కార్యక్రమం ఉంగుటూరు మండలం నారాయణపురంలో శనివారం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ని కలుసుకుని తన సమస్యని తెలుపుకుందామని వచ్చిన చేబ్రోలుకు చెందిన యర్రంశెట్టి సూరమ్మ జనసందోహంలో బిక్కుబిక్కు మంటూ జిల్లా కలెక్టర్ ని కలిసేందుకు ప్రయత్నించసాగింది. యధాలాపంగా అటు వైపు చూసిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆ వృద్ధురాలు తనతో ఎదో చెప్పాలనుకుంటుందని తెలుసుకుని తానే స్వయంగా ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్లి ఆమె సమస్యని అడిగారు.
జిల్లా కలెక్టర్ అంతటి వ్యక్తి తానే స్వయంగా వచ్చి తన సమస్యని అడిగేటప్పటికీ ముందుగా ఆ వృద్ధురాలికి నోట మాట రాలేదు. కొంత సమయం తరువాత తేరుకుని తన సమస్యని వివరించింది. తనకు చేబ్రోలులో ఎకరం పొలం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పెద్ద మనస్సుతో పేదలకు ఇళ్లను నిర్మించే మహత్కార్యానికి తన వంతు సహకారంగా జగనన్న ఇళ్ల నిర్మాణానికి తన పొలాన్ని అందించానని, తన భూమికి 35 లక్షల పరిహారంగా అందిస్తామని అప్పట్లో అధికారులు తనకు తెలిపారన్నారు. ఎన్నో సార్లు తమ కార్యాలయానికి వచ్చి విన్నవించుకున్ననై, కానీ తనకు ఇంతవరకూ నష్టపరిహారం అందలేదని, తన సమస్యని పరిష్కరించవలసిందిగా వృద్ధురాలు జిల్లా కలెక్టర్ దగ్గర వాపోయింది. ఆమె సమస్యను విన్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హృదయం ద్రవించిపోయింది. వెంటనే అక్కడే నుండి సంబంధిత రెవిన్యూ అధికారులకు ఫోన్ చేసి ఎర్రంశెట్టి సూరమ్మ సమస్యను వెంటనే పరిష్కరించి, తనకు వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
తన సమస్యను ఎంతో ఓపిగ్గా విని పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పట్ల తన కృతజ్ఞతలను యర్రంశెట్టి సూరమ్మ తెలుపుకుంది. తన సమస్యకు వెంటనే పరిష్కార మార్గం దొరికినందుకు యర్రంశెట్టి సూరమ్మ మహదానందంతో అక్కడ నుండి తన ఇంటికి చేరుకుంది.