– కిమిడి కళా వెంకట్రావు
ముఖ్యమంత్రి అసమర్ధత, అవినీతితో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు. నాడు 22.5 మి.యూ విద్యుత్ లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధిస్తే.. నేడు చేతకానితనంతో పొరుగు రాష్ట్రాల నుండి యూనిట్ రూ.20 చొప్పున కొనుగోలు చేసే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. రైతు రాజ్యం తీసుకొస్తానని కోతల రాజ్యం తీసుకొచ్చారు. రేషన్, పెన్షన్ లబ్దిదారుల కోత కోస్తూ.. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని చీకటిమయం చేస్తున్నారు.
1. దక్షిణాధి రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్ లోనే అధికంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి.?
2. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా.. ఆ భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన వేసి వేధించడం అసమర్ధత కాదా.?3. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండా.. వినియోగదారుల నుండి కనీస వినియోగ ఛార్జీ ఏ విధంగా వసూల్ చేస్తారు.?
4. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను సుస్థిరంగా ప్రగతి బాటలో నడిపేందుకు దోహదపడే విద్యుత్ రంగాన్ని రెండున్నరేళ్లలో విచ్ఛిన్నం చేయంతో సాధించిందేంటి.
5. సంప్రదాయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సోలార్, విండ్ వ్యవస్థలను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తే.. అధికారంలోకి వచ్చీ రాగానే ఆ ఒప్పందాలు రద్దు చేసిన ఫలితమే నేటి విద్యుత్ కోతలు కాదంటారా.?
6. ప్రతి ఇంట్లో నాలుగు బల్బులు, రెండు ఫ్యాన్లు, అవసరమైతే ఏసీ కూడా ఆన్ చేసుకునేలా విద్యుత్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి.. ఇప్పుడు కనీసం విద్యుత్ సరఫరానే లేకుండా చేయడం చేతకానితనం కాదా.?
7. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసివేత దిశగా తీసుకెళ్లి.. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ లో బినామీ పేర్లతో నడుపుతున్న జగన్ రెడ్డి విద్యుత్ కేంద్రాల నుండి కొనుగోలు చేయాలనుకోవడం వాస్తవం కాదా.?
8. హిందూజా, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి 6 నెలలుగా విద్యుత్ కొనుగోలు చేయకుండా నిలుపుదల చేయడం వెనుక ఆంతర్యమేంటి.?
9. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.2.45కి యూనిట్ సోలార్ విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందాలు అవినీతిమయం అన్న మీరు.. ఈ రోజు రూ.20కి కొనుగోలు చేయడం వెనుక అవినీతి లేదా.?
10. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల నుండి కాకుండా.. ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక తాడేపల్లి చీకటి వ్యాపారం లేదంటారా.?
11. 2020 ఫిబ్రవరిలో యూనిట్ పై 90పైసలు పెంచి రూ.1300 కోట్లు, ఏప్రిల్-మే నెలల్లో స్లాబులు మార్చి రూ.1500 కోట్లు, 2021లో కొత్త టారిఫ్ ద్వారా 20శాతం పెంచి రూ.2600 కోట్లు, జులై నుండి కాస్ట్ అడ్జెస్ట్ మెంట్ పేరుతో రూ.700 కోట్లు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.6211 కోట్లు (రూ.2542 కోట్లు+రూ.3669 కోట్లు) పవర్ ఫైనాన్స్ కార్పేషన్ ద్వారా రూ.24,491 కోట్లు మొత్తంగా రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం వాస్తవం కాదా.?
12. అప్పుల కోసం ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్న వైసీపీ పెద్దలు.. కేంద్రం నుండి రావాల్సిన గ్యాస్ ఎందుకు రాబట్టలేకపోతున్నారు.
13. విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని చంద్రబాబు నాయుడు ప్రకటించి అమలు చేశారు. కానీ.. మీరు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని ప్రమాణ స్వీకారం రోజు హామీ ఇచ్చి.. లైట్ వేయాలన్నా, ఫ్యాన్ ఆన్ చేయాలన్నా ప్రజలు భయపడేలా విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్నారు.
14. పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు, కర్నూలు సోలార్ పార్క్, అనంతపురం విండ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రశ్నార్ధకం చేసి.. ప్రైవేటు విద్యుత్ కోసం వెంపర్లాడడం పాలనా వైఫల్యానికి నిదర్శనం.
15. వరదల్లో కూడా ఇసుక అక్రమ తవ్వకాలు, మందుబాబుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడంపై ఉన్న శ్రద్ధలో 10% విద్యుత్ వ్యవస్థ పటిష్టతపై పెట్టినా.. నేడు ఈ కోతలు ఉండేవి కాదు.
జే-ట్యాక్స్, అవినీతి, దుబారా కోసం ప్రజలను బలి చేస్తున్నారు. ప్రజలు విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని, ఫ్యాన్లు, ఏసీల వినియోగం ఆపాలని అధికారికంగా ప్రకటించే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. చివరికి పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రగతిని ప్రశ్నార్ధకం చేస్తున్నారు.
ఇదేనా రెండున్నరేళ్లలో సాధించిన ప్రగతి. ఇదేనా విద్యుత్ రంగంలో తీసుకొస్తానన్న సంస్కరణలు. ఉద్దరిస్తానని అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని సాంతం ఊడ్చేసి జేబులు నింపుకోవడం అత్యంత హేయం. జగన్ రెడ్డి ఇకనైనా సొంత ప్రయోజనాలు వీడి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి.
(కిమిడి కళావెంకట్రావు, పొలిట్ బ్యూరో సభ్యులు)