కులాల వారీగా ఎన్నికల కోసం జనసమీకరణ జరుగుతున్న ఈ కాలంలో కులాల కతీతంగా బతుకమ్మ పండుగ మానవ సంబంధాలను బలోపేతం చేసే దిశగా జరుపుకోవాలని బతుకమ్మ పండుగ తాత్వికత దెబ్బతినకుండా కొనసాగాలి. సామూహికంగా ప్రజలు పాల్గొనే జాతరలు, ఉత్సవాలు, గ్రామ, పట్టణ స్థాయి సంబరాలు కూడా కులాలకు అతీతంగా పండుగలు జరుపుకునే ఉన్నత సాంప్రదాయం వైపుగా తీసుకెళుతున్నాయి.
“కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము” అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాటలను రానున్న కాలంలో నిజం చేయడానికి అన్ని వర్గాలు సమస్థాయిలో చిత్తశుద్ధిగా అమలు చేస్తే కుల నిర్మూలన అనే సుదూర లక్ష్యాన్ని సాధించడానికి కూడా మార్గం సుగమమవుతుంది.
సహజత్వాన్ని కోల్పోతున్న బతుకమ్మ పండుగ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతానికి మాత్రమే చెందినది ప్రకృతి పూల పండుగ బతుకమ్మ పండుగ .ఈ ప్రాంతానికి ఎంతో వన్నె తెచ్చింది. కాయ కష్టం మీద ఆధారపడి పాడి, పంట, పెంట అనే అంశాలలో పరస్పర సహకారంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచడానికి ప్రకృతి పూల పాటల తో ఏర్పడిన పండుగ బతుకమ్మ పండుగ.
ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ పాట గురించి పాట పుట్టుక గురించి రాసిన పాటలో కష్టాన్ని మరిచి పోయి, అలసట అని కర్తవ్యాన్ని విస్మరించకుండా, చేసే పనిలో పునరుత్తేజం పొందడానికి పాట ఒక సాధనమని తెలియజేశారు. ప్రకృతిలో ఉన్న చెట్లు, పూలు, జంతువులు, పచ్చిక బయలు, సెలయేళ్ళు మెచ్చిన మనస్తత్వము ద్వారా నచ్చిన వారితో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం కి అలసటను దూరం తరమడానికి ప్రకృతిలో పాటలు పాడినట్లుగా తెలుస్తున్నది.
బతుకమ్మ పాటల్లో ప్రధానంగా శ్రమజీవులు మధ్యతరగతి వ్యక్తులు వ్యవసాయ కార్మిక రంగాలకు చెందినవారు కుల వృత్తులకు చెందినవారు బతుకు భారంగా భరిస్తున్న వారు కూడా తమ ఆయాసాన్ని మరిచిపోయి ప్రకృతి ఒడిలో సేద తీరాలని తమ బతుకులు మారాలని బతుకులను మెరుగుపరచుకోవడం కోసం పాడిన పాటలు “బతుకమ్మ పాటలు” గాస్థిరపడినాయి. 50 సంవత్సరాలకు పూర్వం గ్రామీణ ప్రాంతాలలో అంటరాని వారికి బతుకమ్మ ఆటపాటల్లో ప్రవేశం ఉండేది కాదు. బతుకమ్మ ఆట పాట నిమజ్జన ప్రాంతానికి వచ్చి తిను బండారాలను అడుక్కొని ఆడుకునే అవకాశాన్ని తాము కోల్పోయినట్లు మిగతా సామాజికవర్గాలు దూరంగా ఉంచడాన్ని బాధపడుతూ క్రమంగా చేసిన కృషి ఫలితమే ఈనాడు కులాలకు అతీతంగా అందరూ కలిసి ఆటపాటల్లో భాగస్వాములవుతున్నారు. ఏటా ఆశ్వయుజ మాసంలో పెత్రమాస నుండి మొదలుకొని బొడ్డెమ్మ చిన్న బతుకమ్మ ఎంగిలి పూలు పెద్ద బతుకమ్మ తో సుదీర్ఘంగా సాగే బతుకమ్మ పండుగ తంతు ముగుస్తుంది. ప్రధానంగా స్త్రీల పండుగ అయినా బతుకమ్మ పండుగ ఇంటి ఆడపడుచులకు, పిల్లలకు, వృద్ధులకు ఎంతో ఊరటనిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే ప్రకృతి సహజంగా సాగాల్సిన బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను ప్రభుత్వ పండుగగా ప్రకటించిన నేపథ్యంలో పాటల తీరు, నిర్వహణ విధానంలో ప్రభుత్వ జోక్యం, గత కొన్ని సంవత్సరాలుగా కల్వకుంట్ల కవిత రంగ ప్రవేశం ,ప్రభుత్వం నిధుల కేటాయింపులతో చేస్తున్న నియంత్రణ వలన కూడా బతుకమ్మ పండుగ తన రూపాన్ని, స్వచ్ఛతను కోల్పోయిందనిపిస్తుంది.
రాజకీయ పార్టీలు ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోకండి. ముందే ప్రజల జీవన క్రమంలో భాగంగా వచ్చినటువంటి బతుకమ్మ ఈ ప్రాంత సంస్కృతికి, చైతన్యానికి, సమగ్రతకు ,భావ సారూప్యత కు ప్రతీక. ప్రభుత్వ జోక్యం తో అనాదిగా ప్రజలకు చెందుతున్న గౌరవం కీర్తిప్రతిష్టలు సార్థకత ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం తో కార్యక్రమాల నిర్వహణ విధానమే మారిపోయింది.
పాట, ఆటల తీరులో ఎన్నో మార్పులు:-
ప్రజల నాలుకల పైన ఆశువుగా పుట్టిన చరిత్రలో జరిగిన కొన్ని కథలకు సంబంధించిన కుటుంబ బంధాలకు సంబంధించిన కథను కేంద్రంగా చేసుకొని పాటలను అల్లేవారు. పాడేవారు. కన్నీరు కార్చే వారు. పరివర్తన చెందేవారు. సంబంధాలను పదిలంగా కాపాడుకునే వారు. కొంతకాలం తర్వాత అంటరాని వారు కూడా బతుకమ్మ ఆడటం ప్రారంభమైనప్పటి నుండి కులాల వారీగా ను కులాలకు అతీతంగా నూ గుంపులుగుంపులుగా బతుకమ్మలను మధ్యలో పెట్టి ప్రత్యేక విన్యాసం తో కూడిన దరువు లో పాడే పాటలు ఇప్పటికీ ఎంతో అలరింప చేస్తాయి.
అయితే సహజత్వానికి భిన్నంగా మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఉండడం కోసం కవులు కళాకారులు రచయితలు మూలాన్ని గ్రహించకుండా పాటలు రాయడం తో పాటు రికార్డింగ్ చేసి డీజే ల ద్వారా ప్రదర్శించడంతో చప్పట్లతో ఆడే బతుకమ్మ యొక్క ఆట పాట క్రమంగా రికార్డింగ్ పాటలకే పరిమితమై పోవడంతో ప్రజల నాలుకల మీద ఆడవలసిన బతుకమ్మ పాటలు క్రమంగా కనుమరుగవుతున్న వి అయినప్పటికీ మధ్యవయస్కులు, వృద్ధులు ఇప్పటికీ ప్రాచీన కాలపు పాటలను వారసత్వంగా ఇప్పటి తరానికి అందిస్తూనే ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అమలులో ఉన్న పాటలు దాదాపుగా 200 పైగా ఉన్నట్లు కొందరి పరిశోధనల వల్ల తెలుస్తున్నది. ఈ పాటల పైన పరిశోధన చేసేవారు గ్రామీణ ప్రాంత మూలాల్లోకి వెళ్లి నాటి తరం వృద్ధులను కదిలిస్తే ప్రజా బతుకమ్మ పాటలను నిలబెట్టుకో వచ్చు .భావి తరాలకు అందించడానికి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు కూడా చేయవచ్చు.
బతుకునిచ్చే బతుకమ్మ పండుగ
పేదరికము, నిరుద్యోగ ము, ఆకలిచావులు, అంతరాలు, వివక్షత, అసమానతలతో కునారిల్లుతున్న సమాజం తమ బతుకులు మారినప్పుడే నిజమైన పండుగని దానికి వేదికగా బతుకమ్మ పండుగను విశ్వసించి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆశువుగా పాడడంతో బతుకమ్మ పాటలు తొలినాళ్ళలో పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లోకి ప్రవేశించినవి. కులమతాలకు ఆర్థిక అంతరాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకోవడం ప్రారంభమైన తర్వాత కృత్రిమ గీతాలు ఎక్కువగా రంగప్రవేశం చేయడంతో కూడా ఈ బతుకమ్మ పండుగ యొక్క ఆశయం పాటల అంతరార్థం పల్చబడుతుంది వచ్చింది.
బహుజనుల బతుకమ్మ పండుగ
ప్రస్తుత ఎమ్మెల్సీ తెరాస కార్యకర్త కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ విషయంలో జోక్యం చేసుకున్న తర్వాత అది బహుజన తత్వాన్ని కోల్పోయిందని పేద అట్టడుగు ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే విధంగా లేదని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. మొక్కుబడిగా కొనసాగుతున్న బతుకమ్మ పండుగకు భిన్నంగా బహుజనుల బతుకమ్మ పేరుతో ప్రముఖ విప్లవ గాయని విమలక్క ఆధ్వర్యంలో వీలైనన్ని ప్రాంతాలలో బహుజనులలో ఆత్మ స్థైర్యాన్ని పెంచి పోషించడానికి పాలనా ప్రభుత్వ పరంగా కూడా వివక్షకు గురవుతున్న బహుజనులకు భరోసా ఇవ్వడానికి ఆమె బహుజన బతుకమ్మ ను ప్రవేశపెట్టి జనంలోకి తీసుకెళ్ళింది.
ఏది ఏమైనా ఆడంబరాలకు ,ఆర్థిక పరిపుష్టికి, పెట్టుబడిదారీ, భూస్వామ్య విధానానికి అతీతంగా శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించేవారి పండుగ గా ఉన్న బతుకమ్మ పండుగ కాలానుగుణంగా కల్తీ అవుతున్నదని మసకబారుతున్నధని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ సహజత్వంతో కూడిన పూర్వవైభవం కోసం బతుకమ్మ పండుగను ప్రజా కోణంలో తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉన్నది. ప్రజల సంస్కృతి సాంప్రదాయాలలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం కూడా ప్రజా సంస్కృతిని చిన్నబుచ్చుతుంది. ప్రభుత్వ ఆధిపత్యం ఎక్కువైనప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు గండ్లు పడతాయి. అలాంటి పరిస్థితి రాకుండా పరిపాలన వేరు ప్రజా సంస్కృతి సంప్రదాయాలు వేరు అనే కోణంలో ఆలోచించి నప్పుడే పండుగలు పబ్బాలు జాతరలు ఊరేగింపులు ప్రజల ఆశలు ఆకాంక్షలు ఆశయాలు సంతోష సంబరాలు చిరకాలం నిలిచి ఉంటాయని బతుకమ్మ పండుగ జరుగుతున్న విధానం ద్వారా మనం ముగింపుకు రావాల్సిన అవసరం ఉన్నది.
అన్ని సామాజిక వర్గాలకు స్వేచ్ఛగా పాల్గొనే సమానత్వ అవకాశం ప్రతి పండుగలో ను ఉండాలి. బతుకమ్మ పండుగలో ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు మెండుగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఎక్కడైనా మనసులో గూడు కట్టుకున్న టువంటి దురభిప్రాయాలను తొలగించుకొని తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగితే బతుకమ్మ పండుగ నిజంగా తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఆచరించడానికి అర్హత సాధిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ప్రేమానురాగాలు, ఆత్మీయ అనుబంధాలు, విచ్ఛిన్నమవుతున్న మానవసంబంధాలను సజీవ సంబంధాలు గా కొనసాగించడానికి బతుకమ్మ పండుగ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది. దాని లక్ష్యాన్ని సాధించడానికి అన్ని వర్గాల ప్రజలుగా మరింత కృషి చేస్తే భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంత ప్రాతిపదికన ఉన్న భారతదేశంలో మానసిక సమానత్వం సాధ్యపడుతుంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)