(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
MV రమణారెడ్డి గారి “రాయలసీమ కన్నీటి గాధ” ను భుజానికెత్తుకొనే రాజకీయ వేదిక సీమకు కావాలి.
బహుముఖ ప్రజ్ఞాశాలి , రాయలసీమ ఉద్యమ నేత డా.. యం వి రమణారెడ్డి సంస్మరణ సభ శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీలో విద్యా పరిరక్షణ వేదిక సారథ్యంలో జరిగింది.
చరిత్రలో కొన్ని పుస్తకాలు విప్లవాలకు , పెను మార్పులకు కారణంగా నిలిచాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను తనదిగా ప్రపంచంలోని రాజకీయ వేదికలు భుజానికెత్తుకొని పోరాడిన ఫలితంగా పలు దేశాలలో విప్లవాలు విజయవంతం అయ్యాయి. సరిగ్గా రమణారెడ్డి గారు రచించిన రాయలసీమ కన్నీటి గాధ కూడా అలాంటిదే. కానీ సీమ పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. పాలకులు మారుతున్నా సీమ స్థితిగతులలో మార్పు రాలేదు. కారణం రాయలసీమ కన్నీటి గాధను తమదిగా భావించి భుజానికెత్తుకొన్న రాజకీయ వేదిక రాయలసీమలో లేకపోవడం.
మద్రాసు నుండి తెలుగు వారిగా విడిపోదాం అన్న చర్చకు ముందే మదురై కేంద్రంగా తమిళనాడు కావాలని ఎప్పటికైనా చెన్నై తెలుగువారిదే అన్న భావన తమిళ పెద్దలది. ఆలాంటి సందర్భంలో కోస్తా పెద్దలతో కలిసి తెలుగు రాష్ట్రం అని కాకుండా పప్పూరి మాటలు విని రాయలసీమ రాష్ట్రంగా ఉండి ఉంటే నేడు చెన్నై రాజధానిగా రాయలసీమ , బళ్లారితో ఒంగోలు వరకు రాష్ట్రం ఉండేది. కృష్ణా పెన్నారు , టిబి డ్యామ్ మనదిగా ఉండి వందల టీఎంసీల నికరజలాలతో దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉండేది. 1956 , 2014 లో విశాలాంధ్ర , విభజన సందర్భంగా మన రాయలసీమకు ఏమి కావాలని కాకుండా నాయకులు సృష్టించిన భావోద్వేగాలతో కూడిన రాజకీయాలలో కొట్టుకుపోయాము. కోస్తా పెద్దలతో కలిసి ఆంధ్రరాష్టం కావాలన్న సమయంలో పప్పూరి మాటలు , 2014 విభజన సమయంలో రమణారెడ్డి గారి మాటలను సీమ నేతలు రాయలసీమ సమాజం పరిగణనలోకి తీసుకుని ఉంటే నేడు రాయలసీమ పరిస్థితి విషమంగా ఉండేది కాదు. రాయలసీమ కష్టాలు మాత్రమే చూస్తున్న నేటి తరానికి రమణారెడ్డి గారు తన రచనలు , ఉద్యమాల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపారు. వారి నుంచి అనేక అనుభవాలు దగ్గరగా పరిశీలించిన మనం రాయలసీమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడమే రమణారెడ్డి గారికి నిజమైన నివాళి కాగలదు.
విద్యాపరిరక్షణ వేదిక నేతలు కృష్ణా రెడ్డి , భాస్కర్ రెడ్డి , భూమన్ , సీనియర్ పాత్రికేయులు రాఘవశర్మ , ఆచార్య నరేంద్ర , రంగారెడ్డి , పలువురు పరిశోధక విద్యార్థులు పాల్గొని రమణారెడ్డి గారితో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకొని నివాళులు అర్పించారు.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త)