(వడ్డేపల్లి మల్లేశము)
తెలంగాణలో కొంతమంది శాసనసభ్యులు కొందరు మంత్రులు మాత్రం యువకులను మహిళలను సమాజంలోని భిన్న వర్గాల ను అవమానపరిచే రీతిలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ “ఈ రాష్ట్రంలో మద్యపానం చట్టబద్ధమైన ది. మద్యపానాన్ని ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నది. అంతటా ఆకృత్యాలు అరాచకాలు అత్యాచారాలతో రాష్ట్రమంతా ఉడికిపోతున్నది. ఈ సందర్భంలో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యమంత్రి మహిళలందరికీ భర్త అని మాట్లాడిన మాట మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే తాగి మాట్లాడినాడా” అని మహిళలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వం నుండి ఇప్పటికీ జవాబు లేదు
పరిపాలన మీద, ప్రజల సమస్యల మీద మంత్రులు శాసనసభ్యులు అక్కడక్కడా ప్రజలను అవమానపరిస్తే అలాంటి సమస్యలపైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడడం, ప్రచారం చేయడం, వాగ్దానాలు ఇవ్వడం కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిపాటి అయిపోయింది.
అందుకే మహిళా సంఘాల నాయకులు ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడిన మాటల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేయాలని మహిళలకు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ పక్షాన వెంటనే వివరణ ఇచ్చి తప్పులు అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్ వినబడడం లేదా
రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకు సంబంధించి మంత్రులు తమ మంత్రిత్వశాఖ విషయాలపైన మాట్లాడినప్పుడు స్వతంత్ర ఆలోచన గాని స్వతంత్ర విధానం గాని ప్రకటించిన దాఖలాలు లేనేలేవు. తన మంత్రిత్వ శాఖకు సంబంధించి తాను తీసుకోవలసిన నిర్ణయాలను కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పడంలో మంత్రి మొక్కుబడిగా ఉన్నట్లే కదా!
“ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఈ పథకం అమలవుతుంది. దేశంలో ఎక్కడా లేని పథకాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు”. అని మంత్రులు ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తడం వలన ఇక మంత్రుల స్వయంప్రతిపత్తి పైన ప్రజలకు సందేహం రాక మానదు. ఈ విషయంలోనే విభేదించిన ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం కోసమే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కనుక మంత్రులకు ఆత్మ గౌరవం ఉంటే తమ మంత్రిత్వశాఖ పైన చిత్తశుద్ధిగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి కానీ ముఖ్యమంత్రిని పొగడడం కోసం కాదు.
బతుకమ్మ చీరల సంగతేమిటి?
ఎవరూ అడగని బతుకమ్మ చీరలను మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ల ఆత్మగౌరవాన్ని తగ్గించడమే అవుతుందని బతుకమ్మ పండుగ పూట పట్టుచీరలు కట్టుకోలేమా? అని అనేక మంది మహిళలు మహిళా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మహిళలకు కుటుంబ సభ్యులకు కావాల్సింది చీరలు కాదని బతుకునిచ్చే ఉద్యోగాలు కావాలని ఇంటికో ఉద్యోగం అని మాట తప్పిన ప్రభుత్వం అనేక మంది నిరుద్యోగులు కళ్ళముందు తిరుగుతూ ఉంటే బ్రతుకు తెరువు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ఆలోచింప చేస్తున్నారు.
” బతుకమ్మ చీరలు కాదని బతుకునిచ్చే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని” ప్రభుత్వం దగ్గర సూటిగా జవాబు ఎందుకు లేదని 100, 200 రూపాయల చీరలు మాత్రమే మేము కట్టాలా? మీ ఇళ్లల్లో ఆడవాళ్ళు ఇవే చీరలతో బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జవాబు చెప్పాలి. “మూడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ మహిళను సంతృప్తి చేయని బతుకమ్మ చీరలను వెంటనే ఆపివేయాలని అంతకంటే మెరుగైన చీరలు కొనుక్కొని పండుగ నిర్వహించుకుంటున్నాం” .అని ప్రభుత్వానికి మహిళలు సవాల్ విసురుతున్నారు.
ప్రలోభాలు వాగ్దానాలతో పూట గడపడం కంటే తాగుడుకు బానిసై యువత నిర్వీర్యమై పోతుంటే ఉపాధి ఉద్యోగాలు బతుకుతెరువు కానరాక సమాజానికి భారంగా పరిణమించిన నిరుద్యోగుల పట్ల వెంటనే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి.
మంత్రులు శాసన సభ్యుల పైన చర్యలేవి
అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము హమాలీ పని చేసుకొని బతకాలని ఒక మంత్రి అంటే, మహిళా అధికారుల తో అసభ్యంగా మాట్లాడి కలెక్టర్లను కూడా అగౌరవపరిచిన మరొక మంత్రి వైనం, జిల్లా కలెక్టర్లు అఖిల భారత స్థాయి అధికారులు గా కొనసాగాల్సి ఉంది పోయి కాళ్లు మొక్కి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే రాజయ్య మరొక్కమారు నోరు జారడం, అనేక మంది మంత్రుల పైన అవినీతి ఆరోపణలు రావడం ఇవాళ ప్రజల మధ్యన చర్చనీయాంశం అయిపోయింది.
కానీ మంత్రివర్గంకాని, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అవినీతి ఆరోపణల పైన మంత్రులు శాసనసభ్యులు అసభ్య పదజాలం పైన, నోరుజారిన విధానం పైన ,మహిళల ఆగ్రహం పైన, నిరుద్యోగ యువత నిర్వీర్యం పైన స్పందించిన దాఖలాలు అసలే లేవు. దానికి బదులుగా హుజరాబాద్ ఉప ఎన్నికను తాము చిన్నగా చూస్తున్నామని, అది మాకు పెద్ద లెక్క కాదని చెబుతూనే నాలుగు నెలల నుండి మంత్రులు శాసనసభ్యులు రాష్ట్రాన్ని మర్చిపోయి హుజురాబాద్ ని పట్టుకొని ఉండడంలో అర్థం ఏమిటి?
శాసనసభ్యుల ఎంపికకు ప్రచార హోరు కంటే విలువలే ముఖ్యం
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అనేకమంది ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంలో సామాన్య ప్రజానీకం నుండి రాజకీయ కార్యకర్తల వరకు కష్టసుఖాలలో ప్రజలను వెన్నంటి ఉన్న నాయకుడు ప్రజల అభిమానం చూరగొన్న వాడే శాసనసభ్యుడు అవుతాడని ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు చేసినా ప్రజలు దాన్ని పరిగణనలోకి తీసుకోరని తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా వ్యక్తం చేస్తున్నారు.
అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఉండడమే కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన మంత్రి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం ఎన్నికల వేళ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు కాదా? హుజరాబాద్ ఉప ఎన్నికకు కారణమైన టువంటి ఈటెల రాజేందర్ యొక్క అవినీతి, ఆయన కోరుకున్న టువంటి ఆత్మ గౌరవం, ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నది?, ఎందుకు అవినీతిని రుజువు చేయలేకపోయింది,? అలాంటి అవినీతి ఆరోపణలు వచ్చిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే అంశాలు మాత్రమే ప్రధాన ఎజెండాగా ప్రచారం జరగాల్సింది పోయి ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి పార్టీలు ప్రభుత్వం పూనుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే.
అంతకు మించి ఒక వర్గానికి మాత్రమే దగ్గర కావడానికి వారి ఓట్లను రాబట్టుకోవడానికి దళిత బంధు పేరున కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ప్రకటిస్తే సమాజంలోని వివిధ వర్గాల వారు కూడా తమ వాటా తమకు దక్కాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం యొక్క జవాబు ఏమిటి?
మిగతా అన్ని వర్గాల డిమాండ్‌ను ఆమోదించినట్లు గాని, వ్యతిరేకించినట్లు గాని ,పట్టించుకున్నట్లు గాని మనకు ఎక్కడా కూడా కనపడదు. దానికి బదులుగా దళితులు ఎంతటి ధనవంతులైన ఉద్యోగులైన అందరికీ దళిత బందును వర్తింప చేస్తామని మాట ఇవ్వడం మరీ విడ్డూరం. ఇప్పటికే అమలవుతున్న రైతుబంధు వలన పేదవారికి లాభం జరగకపోగా పదుల కొద్దీ వందలకొద్దీ ఎకరాలు ఉన్నటువంటి వారికి మాత్రమే పంటలు పండించ కుండా బీడు భూములకు ప్రభుత్వం డబ్బు చెల్లించడం ఎలా చూడాలి?
అందుకే ఏ రకమైన భూములు లేని వారు పేదలు రైతుబంధు తో మాకు ఏమి లాభం అని మాకు ఉపయోగపడే పథకాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇంత సంక్లిష్ట సమయంలో ఒక ఎన్నిక కోసం మాత్రమే ప్రకటించిన టువంటి పథకాన్ని ప్రభుత్వం పునరాలోచన చేసుకొని అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా పాలనను ప్రక్షాళన చేయకుంటే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదు. అది ఎన్నికల్లో కావచ్చు తమ హక్కులను సాధించుకునే క్రమంలో కావచ్చు. ప్రభుత్వాలు ప్రజలకు జరుగుతున్న అవమానాలు ఇబ్బందులపై మాత్రమే తక్షణం చర్చించాలి. కానీ ఎన్నికల మీద మనస్సు పెట్టడం నిజమైన ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వానికి తగని పని.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)