(బొజ్జా దశరథ రామి రెడ్డి)
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామల రావు గారు రాయలసీమ ప్రాజెక్టుల గురించి కేంద్ర జలవనురుల శాఖ కార్యదర్శికి ఉత్తరం వ్రాసినట్లుగా ఈ రోజు దినపత్రిక వార్తల ద్వారా తెలుస్తున్నది.
ఈ ఉత్తరం ద్వారా తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి , వెలిగొండ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో పేర్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళినట్లుగా తెలుస్తున్నది.
పై ప్రాజెక్టులే కాకుండా గురు రాఘవేంద్ర, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతించింది. కాని కృష్ణా నది యాజమాన్య బోర్డు లో అందుకు విరుద్ధంగా పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులను కూడా రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకోని పోవాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం లో అనుమతించిన పై ప్రాజెక్టులను అన్నింటిని అనుమతించిన ప్రాజెక్టులుగా నోటిఫికేషన్ లో సవరణలు చేయడానికి జలవనరుల శాఖ దృష్టికి తీసుకోని పోవాలని కోరుతున్నాం.
రాయలసీమకు సంబంధించిన పైన పేర్కొన్న ప్రాజెక్టులకు ఆరు నెలల కాలంలో అనుమతులు పొందాలని, అనుమతులు పొందకపోతే ఈ ప్రాజెక్టుల నిర్వహణకు అనుమతించమని కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో పేర్కనడం రాయలసీమ మనుగడకే తీవ్ర విఘాతం.
కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ అమలు ఇంకొక వారం రోజుల్లో అనగా అక్టోబర్ 14 నుండి అమలు జరగనున్న సందర్భంగా రాయలసీమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం క్రియాశీలంగా స్పందించాలి.
కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ అమలు జరిగితే రాయలసీమ తాగునీటి కోసం కూడా అలమటించే పరిస్థితులు రాబోతున్న సందర్భంలో, కార్యదర్శుల స్థాయిలో కాకుండా రాజకీయమైన దౌత్యం జరగాలి.
ఇందుకు మొదటగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి, కేంద్ర హోమ్ మరియు జలవనరుల శాఖ మంత్రులను కలిసి రాష్ట్ర విభజన చట్టం లో అనుమతించిన పై ప్రాజెక్టులను అన్నింటిని అనుమతించిన ప్రాజెక్టులుగా నోటిఫికేషన్ లో సవరణలు చేపట్టేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు బాసటగా నిలిచి పైన పేర్కొన్న సవరణలు నోటిఫికేషన్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలాగా కార్యాచరణ చేపట్టాలని కోరుకుంటున్నాం.
(బొజ్జా దశరథ రామి రెడ్డి, అధ్యక్షులు,
రాయలసీమ సాగునీటి సాధన సమితి)