రాయలసీమ మనుగడ కోసం అక్టోబరు 4 న నంద్యాలలో జరిగే ప్రజా నిరాహార దీక్ష లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అక్టోబరు14, 2021 నుండి అమలు చేయబోయే కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్లో ,రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఇచ్చిన తెలుగుగంగ, గాలేరు – నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు 6 నెలల కాలంలో అనుమతులు పొందాలని పేర్కొందని, 6 నెలల కాలంలో అనుమతులు పొందకపోతే ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినా ఈ ప్రాజెక్టుల నిర్వహణను అనుమతించమని నోటిఫికేషన్ లో పేర్కొన్నారని దశరథరామిరెడ్డి తెలిపారు. అదే జరిగితే రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు దేవుడెరుగు కనీసం త్రాగడానికి గుక్కెడు నీరు కోసం రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అన్నారు.
కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ అమలుతో రాయలసీమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతున్న దృశ్యం స్పష్టంగా కనబడుతోన్నదని, ఇదే జరిగితే రాయలసీమ పల్లెలు, పట్టణాలు త్రాగునీటికి విలవిలలాడే పరిస్థితులు రాకముందే ప్రజానీకం మేల్కొనాలని దశరథరామిరెడ్డి తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాల వలన భవిష్యత్తులో రాయలసీమకు రైల్వే ట్యాంకర్లతో త్రాగునీరు తోలుకునే పరిస్థితి రాకుండా మన రాయలసీమను కాపాడుకోవాలని అందులో భాగంగా అక్టోబర్ 4 సోమవారం నాడు నంద్యాలలో జరిగే రాయలసీమ ప్రజా నిరాహార దీక్షను,మేధావులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు Y.N.రెడ్డి,ఏర్వ రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర నాయుడు,గోపాల్ రెడ్డి, పట్నం రాముడు,నాగేశ్వర రెడ్డి,మహేశ్వర రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు,M.V.రమణారెడ్డి, కొమ్మా శ్రీహరి,రాఘవేంద్ర గౌడ్ పాల్గొన్నారు.