నాకిప్పుడు ఎక్కడ చూసినా మూగవాళ్లే తారసపడుతున్నారు ఏమీ మాట్లాడకుండా తాము చేయకూడని పనేదో చేసుకుంటూ నిశ్శబ్దంగా సాగిపోతున్న మూగవాళ్లే కనిపిస్తున్నారు అయితే వీరంతా నోరుండీ మాట్లాడలేని మూగవాళ్లే
నాకిప్పుడు గుడ్డివాళ్లే కనిపిస్తున్నారు తమ కళ్లముందు వాస్తవాలు రూపుకడుతున్నా గ్రహించి కూడా ఏమీ చూడనట్టు తప్పుకు పోతున్న గుడ్డివాళ్లే వీళ్లంతా
నాకిప్పుడు మతిస్థిమితంలేని మనుషులు కనిపిస్తున్నారు ఏమీ పట్టనట్టు ఏదీ తమది కాదన్నట్టు కళ్లముందు జరిగే దృశ్యాలలో కనీసం ఎండుటాకుల్లా కూడా ఎగరలేని నిస్సహాయులైన కదల్లేని ప్లాస్టికి చర్మసంచుల రూపాలై కనిపిస్తున్నారు జీవముండీ చలనం లేని రాతిబొమ్మల్లా వీళ్లు వీధులు చుట్టేస్తున్నారు
నాకిప్పుడు మనుషులు మాయమై కొట్టిపడేసిన తుమ్మ మొద్దుల్లాంటి బతుకు గుమ్మం మీద పేరుకుపోయిన దుమ్మూ ధూళిలాంటి నిర్జీవకణాలవంటి మనుషులు కనిపిస్తున్నారు
నోరుండీ మాట్లాడలేని కళ్లుండీ చూడలేని జీవముండీ చలించలేని మనుషులున్న సమాజం కన్నా నిర్జీవ శకలాల మృత్యులోకమే నయం
ఆకులు రాలిపోయి ఇసుకు పేరుకుపోయిన నిర్జన ఎడారి ప్రదేశాలే కొంతన్నా నయం నయం