దేశంలో సినిమా హాళ్లకు మళ్లీ రోజులొస్తున్నాయా? నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, వచ్చే నాలుగు నెలల్లో దాదాపు హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో 100 చిత్రాలు విడుదలవుతున్నాయి. మరొక విధంగా చెప్పుకుంటే, కరోనాతో మూలన పడిన ఈ చిత్రాలకు అక్టోబర్ నెలలో మోక్షం లభిస్తుందనాలి.
హిందీ చిత్రరంగానికి కీలకమయిన మహారాష్ట్రంలో ఈ నెల 22 న సినిమా హాళ్లు తెరుకుంటున్నాయి. దేశంలోని మల్టీ ప్లెక్స్ లలో, సింగిల్ స్క్రీన్ లలో మహారాష్ట్ర లో ఆరోవంతు ఉంటాయి. మహారాష్ట్ర సినిమా హాళ్లు ప్రారంభయ్యేనాటికి దేశమంతా సినిమా హాళ్లు ఏదో విధంగా తెరుచుకుంటాయి. వీటిలో కొన్ని చోట్ల ఇంకా 50 శాతం సీట్లకే అనుమతి ఉన్నా, మొత్తానికి సినిమా హాళ్లన్నీ ప్రదర్శనలకు సిద్ధమవుతాయి. కర్నాటక, తెలంగాణలలో సినిమా హాళ్లను 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కర్నాటక అక్టోబర్ 1 నుంచి పూర్తి హాళ్లను అనుమతిస్తూ ఉంది.అక్కడ కోవిడ్ రేటు 1 శాతం కంటే తక్కువకు చేరింది. ఇండియాలో దాదాపు 10,000 స్క్రీన్ లు ఉన్నాయి.కోవిడ్ కారణంగా ఇవి పూర్తిగా మూత పడటమో లేక తక్కువ సీట్లతో నడవడమో జరుగుతూ ఉంది.దీనితో మొత్తం సినిమా పరిశ్రమ ప్రొడక్షన్ దగ్గిర నుంచి టికెట్ సేల్స్ దాకా కుప్పకూలింది.
వచ్చే మూడు నెలల్లో హిందీకి సంబంధించి బిగ్ బడ్జెట్ చిత్రాలు ‘83’( రణ్ వీర్ సింగ్ స్పోర్ట్స్ చిత్రం), ‘సూర్యవంశీ’ (అక్షయ కుమార్ పోలీస్ సినిమా), అంతర్జాతీయ చిత్రాలు‘ ఎటర్నల్ ’, ‘స్పైడర్ మాన్ నో వే హోమ్, ‘ ది మాట్రిక్స్ రెజరెక్షన్స్’ విడుదలకోసంఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. భారతదేశ చిత్ర సీమ దీపావళి చాలాముఖ్యమయింది. ఈ సారి దీపావళికి సినిమా హాళ్లన్నీ తెచుకుంటూ ఉండటం మరొక విశేషం. మల్టిప్లెక్స్ ల వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాది మార్చి నాటి తో పోలిస్తే, పివిఆర్ లిమిటెడ్ వసూళ్లు 10 శాతం, ఐనాక్స్ వసూళ్లు 18.43 శాతం పెరిగాయి.
మంచి రోజులొస్తున్నాయనే సంతోషాన్ని పివిఆర్ పిక్చర్స్ సిఇవొ, మల్టిప్లెక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ గ్యాన్ చందాని వ్యక్తం చేశారు. హిందీతో పాటు ఇతర భాషలలో సినిమాలు విడుదల కావడం మొదలవుతుంది. వచ్చే నాలుగు నెలలలో ప్రతినెల 25 శాతం దాకా విడుదలలు పెరుగుతూ పోతాయి. బ్లాక్ బస్టర్ అయ్యే లక్షణాలున్న హిందీ సినిమా దాదాపు రెండువారాలకొకటి విడుదలవుతుందని ఆయన చెప్పారు. దేశంలో వారానికి అయిదారు సినిమాలు విడుదలవుతాయి. కోవిడ్ ముందురోజుల కంటే ఇది 25శాతం ఎక్కువ. 2019 నాటి కలెక్షన్ల స్థాయికి చేరుకోలేకపోయినా, అందులో 50 శాతం దాకా కలెక్షన్లు ఈ ఏడాది ఉండవచ్చని గ్యాన్ చందాని అన్నారు.
2020 మార్చినుంచి సినిమా హాళ్లు మూత పడడటంతో భారత దేశంలో బాక్సాఫీస్ కలెక్షన్ బాగా పడిపోయి రు. 2000 కోట్లకు చేరాయని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసింది .2021లో కూడా సినిమాహాళ్లు అయిదారు నెలలు మూత పడ్డాయి. అయితే, ఇపుడు విడుదలకు చాలా చిత్రాలు సిద్ధంగా ఉండటంతో బాక్సాఫీస్ కలెక్షన్లు రు. 6000 కోట్లకు చేరుకుని ఈ నష్టం భర్తీ చేస్తాయని పరిశీలకులు చెబుతున్నారు.
దేశంలో చాలాచిత్రాలు నిర్మాణంపూర్తి చేసుకుని 18 నుంచి 24 నెలలుగా విడుదల ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాయి. విడుదల ముహూర్తం అంటే సినిమాహాళ్లు పూర్తిగా తెర్చుకోవడం. వచ్చే నాలుగు నెలలలో ఈ వాతావరణం నెలకొంటున్నది. దానికి పండుగలుకూడ వస్తున్నాయి. 2019లో బాక్సాఫీస్ కలెక్షన్లు రు. 10వేల ట్లు ఉండేవి.ఆ స్థాయికి కలెక్షన్లు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని హాంకాంగ్ నుంచి పనిచేసే మీడియా పార్ట్నర్స ఏసియా (Media Partners Asia : MPA) ఉపాధ్యక్షుడు మిహిర్ షా చెప్పారు.
అయితే,మల్టిప్లెక్స వోనర్లు టికెట్ రేట్స్ పెంచాలనుకుంటున్నారు. ద్రవ్యోల్బణం(Inflation)భారాన్ని తగ్గించుకునేందుకు ఇది అవసరమని ఈ అసోసియేషన్ భావిస్తూ ఉంది.
సాధారణంగా చిత్రాలను ముందు ధియోటర్లకు విడుదల చేసి తర్వత OTTలలో విడుదలచేస్తారు. కోవిడ్ వల్ల సినిమాహాళ్లు మూతపడటంతో ఒటిటిలు ముందుకు వచ్చాయి. ఇపుడు మళ్లీ ధియోటర్లు తెరుచుకుంటున్నందున ధియోటర్లల్ విడుదల కే ప్రాముఖ్యం ఇస్తారని గ్యాన్ చందాని ఆశిస్తున్నారు. అయితే, ఇపుడున్న పరిస్థితే కొనసాగుతుందని, నిర్మాతలు వారికి ఎది ప్రయోజనం కరమే దానినే చేస్తారని ఒటిటి ప్రతినిధులు చెబుతున్నారు.
ఒక వైపు సినిమా హాళ్లు తెరుకుంటున్న సంతోషం ఉన్నా మరొక వైపు మల్లిప్లెక్స్, ఒటిటి ల మధ్య ఉద్రిక్తత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.