(బొజ్జా దశరథ రామి రెడ్డి)
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతం వివక్షకు గురి అవుతున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర సాధనకు బీజం పడింది. ఈ ఉద్యమంలో తొలి విజయం 1926 లో ఆంధ్రకు ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థానంతో కలిగింది.
రాయలసీమలోని అనంతపురంలో ఏర్పాటు చేయవలసిన విశ్వవిద్యాలయంను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంతో రాయలసీమ వారు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి దూరమయ్యారు.
రాయలసీమ జిల్లాల సహకారం లేనిదే ఆంధ్ర రాష్ట్ర సాధన జరిగదని భావించిన ఆంధ్ర మహాసభ పెద్దలు, నూతన తెలుగు రాష్ట్రంలో రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తామని “శ్రీబాగ్ ఒడంబడికను” నవంబర్ 17, 1937 న చేయడం జరిగింది. శ్రీబాగ్ ఒడంబడికలో కీలకమైన అంశాలు రాజధాని/ హైకోర్టు ను రాయలసీమ లో ఏర్పాటు చెయ్యడం, కృష్ణా తుంగభద్ర జలాలను రాయలసీమ సంపూర్ణ అవసరాల కోసం వినియోగించడం.
ప్రత్యేక తెలుగు రాష్ట్రంలో శ్రీబాగ్ ఒడంబడిక అమలు జరిగి రాయలసీమ అభివృద్ధి చెందుతుందని భావించి, రాయలసీమ వాసులు ఆంధ్ర నాయకులతో కలసి అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1, 1953 న సాధించుకున్నారు.
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 3 సంవత్సరాలు కొనసాగింది. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంతో జత కలవడంతో 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి జూన్ 2, 2014 లో విడిపోవడంతో అక్టోబర్ 1 1953 లో సాదించుకున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నది.
అసలైన అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం అక్టోబర్ 1. అయితే గత ప్రభుత్వం తెలంగాణా అంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన జూన్ 2 న అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించింది. ప్రస్థుత ప్రభుత్వం తెలంగాణా ఆంధ్ర రాష్ట్రంతో కలసిన నవంబర్ 1 న అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్విహిస్తున్నది.
ప్రభుత్వం శ్రీ బాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నామని శాసనసభ సాక్షిగా ప్రకటించినా, ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదు. అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న నిర్వహించక పోవడం, తద్వారా రాష్ట్ర అవతరణకు కీలకమైన శ్రీ బాగ్ ఒడంబడికను ప్రజల స్మృతి పధం నుండి తుడిచి వేసే చర్యగా రాయలసీమ వాసులు భావిస్తున్నారు.4
ఈ నేపధ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి దత్తమండలాలకు రాయలసీమ నామకరణం జరిగిన నంద్యాలలో అక్టోబర్ 1, 2021 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. నంద్యాల సంజీవనగర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర జరిగే కార్యక్రమంలో రాయలసీమ అభిమానులు, ప్రజాస్వామిక వాదులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నది.
ఈ సంధర్భంగా అక్టోబర్ 1 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. తెలుగు రాష్ట్ర సాధనకు కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలు అక్టోబర్ 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించేలాగా, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందటానికి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
బొజ్జా దశరథ రామి రెడ్డి
అధ్యక్షులు
రాయలసీమ సాగునీటి సాధన సమితి