(టి.లక్ష్మీనారాయణ)
గోదావరి నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్ ఏర్పాటుకు 2020 అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు అంగీకరించారు. తక్షణం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలి. ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే కొత్త ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన సమర్ధనీయం. జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరానికి చేరవలసిన నికరజలాలకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్.ఎల్.సి.)కు సమాంతరంగా వరద కాలువ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంగీకరించడం లేదు. మరొకవైపు, తుంగభద్ర జలాశయంలో పూడిక పర్యవసానంగా నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు పడిపోయిందని, తుంగభద్ర జలాశయానికి ఎగువన నావలి ఆనకట్ట నిర్మాణానికి అనుమతించాలని తుంగభద్ర బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నావలి ఆనకట్ట నిర్మాణ ప్రతిపాదనను తిరస్కరించి, ముందుగా హెచ్.ఎల్.సి. సమాంతర కాలువ నిర్మాణానికి కర్ణాటక అంగీకరించి, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా తుంగభద్ర నీటిని వినియోగించుకునే హక్కుకు రక్షణ కల్పించాలన్న డిమాండ్ చేసింది. ఈ వైఖరి అత్యంత సమర్ధనీయం. నిత్యకరవు పీడిత అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర నదీ జలాల్లో హక్కుగా రావాల్సిన నీటి వాటా అప్పుడే లభిస్తుంది.
(టి.లక్ష్మీనారాయణ కన్వీనర్, ఆ.ప్ర.సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)