సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం
(రాఘవ శర్మ)
వెండి మబ్బుల నుంచి జలపాతం జాలువారుతోంది! ఎత్తైన కొండ అంచుల నుంచి దుముకుతోంది! మెట్లు మెట్లుగా ఉన్న రాతి బండలపై నుంచి పడిలేస్తూ, నీటిగుండం నుంచి పొంగి పొర్లిపోతోంది!
రెండు కొండల నడుమ ఎన్ని మెలికలు, ఎన్ని సొగసులు, ఎన్ని గారాలు పోతోందో ఆ జలపాతపు సెలఏరు!
ఆ జలపాతపు సంగీతాన్ని వింటూ, ఆ సెల ఏటి రాగాలకు చెవులు రిక్కిస్తూ అడివంతా తన్మయమైపోతోంది!
‘ఎర్రొడ్ల మడుగు’లో ఆ జల ప్రవాహం తన హెయలను చూసి తానే మురిసిపోతోంది! శేషాచలం కొండల్లో ఎన్ని వింతలు! ఎన్ని అనుభూతులు !
ఆ అడవితల్లి చల్లని కనురెప్పల నీడల్లో ఎంత సేపైనా అలా సేదదీరిపోవాలనిపిస్తుంది.
ఎర్రొడ్లమడుగు, ఆరిమాను బండల అందాలను ఈ ఆదివారం ఇలా ఆస్వాదించాం.
చిత్తూరు – కడపజిల్లాల సరిహద్దున ఉన్న బాలపల్లికి పొద్దున్నే బయలుదేరాం. బాలపల్లి యానాది కాలనీలోంచి మా వాహనాలు ముందుకుసాగాయి.
రైలు వంతెన కిందనుంచి కొంత దూరం వెళితే అటవీశాఖ గేటు. ఆ గేటు దాటాక కుడి, ఎడమల వైపు రెండు పురాతన రహదారులు.
ఎడమవైపునున్న దహదారిలో కాస్త దూరం వెళ్ళగానే దట్టంగా ఉన్న ఎత్తైన చెట్ల మధ్య ఒంటరిగాబాలపల్లి అటవీ అతిథి గృహం.
(తిరుపతి జ్ఞాపకాలు – 45)
ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించింది. దానికి సమీపంలోనే ఒక నీటి మడుగు. “ఇక్కడే ఒక పురాతన దేవాలయం ఉండాలి. ఎప్పుడో ఏడాది క్రితం ఆలయ శిథిలాలను చూసినట్టు గుర్తు” అన్నారు భూమన్.
వాహనాలు దిగి అన్వేషించడం మొదలు పెట్టాం. దట్టమైన అడవిలో ఎక్కడని వెతుకుతాం! ? ఎటు చూసినా అడవి కరివేపాకు ఘుమఘుమలు! కరివేపాకు చెట్లు దట్టంగా మొలిచాయి.
రహదారికి ఎడమవైపున ముళ్ళ చెట్లను నరుక్కుంటూ వెళ్ళాం. రాతిలో చెక్కిన ఆలయ స్తంభాలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. మట్టిలో కూరుకుపోయిఉన్నాయి. గుప్త నిధుల కోసం లోతైన గుంతలు తవ్వేశారు.
“ఇదివరకు చూసిన రాతి స్తంభాలను కూడా ఎత్తుకుపోయినట్టున్నారు శర్మా !?” అంటూ భూమన్ బాధపడిపోయారు.
రహదారికి కుడివైపున, ఆ ఆలయానికి సమీపంలో ఒక పెద్ద పురాతన కోనేరు పూడిపోయి ఉంది.దాని ఆనవాళ్ళు కూడా సరిగా లేవు.
ఆ కోనేరు మధ్యలో జంతువుల కోసం రాతితో నీటిమడుగును అటవీ శాఖ వారు నిర్మించారు. దాని మధ్యలో మరొక బావిని తవ్వారు.
ఈ కోనేరు, ఆలయ శిథిలాలను గమనిస్తే, ఇప్పుడు దట్టంగా పెరిగిన ఈ అటవీ ప్రాంతం ఒకప్పుడు మానవ ఆవాసమై ఉండవచ్చు!
లేతపసుపు రంగు కాండంతో అక్కడే నిటారుగా పెరిగిన ఒక మహా వృక్షం.
నల్లని కాండంతో మరొక చెట్టు దాన్ని పెనవేసుకుని అల్లుకుపోయింది.
ఆ రెండూ భిన్న రంగుల్లో మొలిచి పెరిగి పెద్దవయ్యా యి. రంగులు వేరైనా జాతి ఒకటేగా!
ప్రేమతో పెనవేసుకుని ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆనందపుటంచులు చూస్తూ మనలో ఉన్న జాతి వివక్షను చూసి వెక్కిరిస్తున్నాయి.
అడవిలో ఎన్ని రకాల చెట్లు కలిసి జీవిస్తున్నాయో! అన్నీ కలిసి ఎలా సహజీవనం సాగిస్తున్నాయో! ఆ పక్కనే చిక్కగా ముళ్ళతో చిక్కులు పడిపోయి అల్లుకుపోయిన వెదురు పొదలు. ఈ చిక్కుముళ్ళను ఎలా విప్పుకుంటాయో తెలియదు! లేదు, అవి అలాగే జీవిస్తాయి. చిక్కు పడిపోయిన పొదలు మానవ జీవితంలోని సంక్లిష్టకు ప్రతీకలుగా దర్శనమిస్తున్నాయి.
మరొక చోట ఒక చెట్టుకు పెద్ద బుడిపె; పోరాటానికి పిడికిలి బిగించినట్టుంది. ఒకే చెట్టు నేల నుంచి రెండు చెట్లుగా విడిపోయి ఆకాశానికి ఎగబాగాయి. కవల పిల్లల్లాగా తల్లి కడుపులోనే ఊపిరి పోసున్న బిడ్డలు, బైటికి రాగానే విడివిడిగా ఉనికిని చాటుకున్నట్టున్నాయి.
తూర్పు నుంచి గాలి వీస్తున్నప్పుడు, అది మోసుకొచ్చే సందేశాన్ని చెట్లు తమ ఆకుల చెవులతో వింటున్నాయి. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై వాటి తలలూగిపోతున్నాయి.
ఎక్కడెక్కడి నుంచో మెల్లగా సాగి వచ్చే మేఘాలు ఏ సందేశాలను మోసుకొస్తున్నాయో! ఆ మేఘాలు అడవిని చూసి రాత్రంతో దానిపై ఆనందపు జల్లులు కురిపించాయి. అడవి తడిసి ముద్దెంది.
ఆ ఆనందంతో. రాత్రంతా కురిసిన వర్షానికి అడవి ఎంత స్వచ్ఛంగా ఉందో!
మానవ స్వభావానికి అడవి నిక్కచ్చైన రూపం. నిజమైన ప్రతిబింబం.
ఎర్రొడ్ల మడుగు వెళ్ళడానికి ముందు అటవీ శాఖ వాచ్‌టవర్ ఎక్కాం.
మా కంటికి రెండే రంగులు; నేలంతా పచ్చని అడవి, ఆకాశమంతా వెండి మబ్బులు.
చుట్టూ కొండలు. కొండల నిండా పచ్చని చెట్లు.
కనుచూపు మేరలో ఎటు చూసినా పచ్చదనమే.
అది దాటితే మేఘాలు కమ్మిన ఆకాశమే.
ఆ కొండల అంచుల్లో పచ్చదనం మధ్య దూరంగా ఎర్రటి కొండ అంచులు.
అక్కడే ఎర్రొడ్ల మడుగు. అక్కడి కెళ్ళాలి మనం.
అటవీ శాఖ గేటు నుంచి కుడి ఎడమలుగా చీలిన రహదారులు వృత్తాకారంలో సాగుతాయి.
ఎడమ వైపునుంచి అర్ధచంద్రాకారంలో వెళ్ళిన మేం, గుడివైపున అర్ధచంద్రాకారంలో వచ్చే రహదారిలో కలిశాం.
అటవీ శాఖ గేటు నుంచి ఏడు కిలోమీటర్లు దాటాక దూరం నుంచి, సన్నగా వినిపించే సెల ఏటి సూరు చెవులను తాకింది.
దట్టమైన చెట్ల మధ్య ఎడమ వైపు నుంచి లోయలోకి దిగడం మొదలు పెట్టాం.
మేం దిగుతున్న కొద్దీ సెల ఏటి హోరు చెవులకు మరింత సోకుతోంది.
లోయలోకి దిగేసరికి ఎదురుగా ఎర్రటి కొండ అంచులు.
అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాచ్డె టవర్ నుంచి కనిపించిన ఎర్రటి కొండ అంచులు ఇవే.
ఈ మడుగునకు ఉన్న ఒడ్డు ఎరుపు రంగులో ఉంది. అందుకే దీన్ని ఎర్రొడ్ల మడుగు అన్నారు. ప్రజల నాల్కల నుంచి పుట్టిన పదాలు ఎంత సహజంగా ఉంటాయో!
రెండు ఎర్రటి కొండల అంచుల మధ్య లోతైన లోయలో విశాలమైన రాతి బండ. కొండ అంచుల నుంచి ఆ సెల ఏరుఎన్ని మెలికలు తిరుగుతూ దూకుతోందో!
నేలంతా రాతి బండే. ఎక్కడా మట్టి కనిపించడం లేదు. కొండరాతి అంచుల్లో తిరిగి తిరిగి ఒక నీటి గుండంలో పడి, ముందుకు సాగిపోతోంది.
మెలికలు తిరుగుతోంది వయ్యారంగా. రాతి కొండ పై నుంచి లోతైన లోయలోకి పడిపోతోంది. లోయలో ఒక పెద్ద నీటి గుండం.
దాన్ని చుట్టుముట్టిన చెట్లు. నీటి గుండం నుంచి పొంగిపొరలి, ఆ చెట్ల మధ్య నుంచి కిందకు సాగిపోతోంది.
ఆ లోయలో, నీటి ప్రవాహం వచ్చే దిశగా, దాని అంచుల నుంచి నడిచాం. ఆ నీటి ప్రవాహానికి సహజసిద్ధంగా ఏర్పడిన రాతి చెక్ డ్యాం . ఒక బండపైన చిన్న చిన్న రాళ్ళు అర్ధ చంద్రాకారంలో పేర్చి ఉన్నాయి.
వాటికి ఎదురుగా కొండ అంచున కొయ్యలు పాతి, బోదతో చిన్న గుడిసెలా కప్పు. ఇంత దట్టమైన అడవిలో ఈ గుడిసె ఏమిటి?
షరబత్ తయారీకి ఉపయోగించే నన్నారు ఇక్కడే దొరుకుతుంది. బతుకు తెరువు కోసం యానాదులు ఆ నన్నారును కోసి, ఇక్కడ ఎండబెట్టి మోసుకెళతారు. వారు నిర్మించుకున్నదే ఈ గుడిసె లాంటి షెల్టర్.
ఎన్ని సెలే ఏళ్ళు! ఎన్ని మలుపులు!
ఆ సెల ఏళ్ళు ఎన్ని బండల పైనుంచి దొర్లు తున్న శబ్దాలో!
ముందుకు సాగిన కొద్దీ వింత వింతైన దాని రూపాలు. ఒకదాన్ని మించినదొకటి. ఆ బండలు అక్కడక్కడా తడిసి ఉన్నాయి.
పాకుడుపట్టిన చోట పొరపాటున కాలువేశామా జర్రున జారిపోవడమే. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ సాగుతున్నాం.
దూరంగా కొండ పైనుంచి రెండు పాయలుగా జాలువారుతున్న జలపాతం. నాలుగైదు మెట్లు మెట్లుగా ఉన్న కొండ అంచుల నుంచి శబ్దాలు చేస్తూ దుముకుతోంది.
ఆ ప్రవాహమంతా కొండ దిగువున ఉన్న చిన్న రాతి గుండంలో పడి, పొంగిపొరలి అంచుల నుంచి సాగిపోతోంది.
నాట్యం చేస్తున్నట్టు ఆ సెల ఏరు మెలికలు తిరుగుతూ సొగసులు పోతోందో! కొండ అంచులు, చెట్లు, పక్షులు తమను చూసేస్తున్నాయని ఆ సెల ఏరు బిడియపడి పోయి, ఎన్ని మెలికలు తిరిగిపోతోందో!
ఎర్రొడ్ల మడుగు ఎంత విచిత్రం! ఎంత మహాద్భుతం!
ఆరిమాను బండలు
ఎర్రొడ్ల మడుగులోనే మధ్యాహ్న భోజనాలు ముగించాం. ఈ మడుగు అసలు పుట్టుక ఆరిమాను బండలు. మధ్యాహ్నం రెండున్నర అవుతోంది.
“ఆరిమాను బండలను చూద్దాం పదండి” అన్నారు ఆచార్య కుసుమకుమారి. మళ్ళీ లోయలోంచి కొండ ఎక్కాం.
చీకటి పడేలోపు అడివి దాటిపోవాలి. శ్రీనివాస్ అడవి అందాలను అడుగడుగునా కెమెరాలో బంధిస్తున్నారు.
అంతా ఎనిమిది మందిమే. అరిమాను బండలు చూస్తే తొలుత ఏమీ లేదక్కడ అనిపించింది. నేలంతా పరుచుకున్న విశాలమైన బండలు.
అడవికి వచ్చినవాళ్ళు ఎంతమందైన ఈ ఆరిమాను బండల పైన రాత్రి పూట విశ్రమించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఇదొక విడిది.
ఆరిమాను బండలు అంటే ఇంతే అనుకున్నామా! ఆ బండల పైన జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగితే ఏటవాలుగా ఎన్ని రూపాలో!
వర్షం పడితే ఆ నీళ్ళన్నీ ఏటవాలుగా ఉన్న ఈ బండల పై నుంచి జలపాతంలా కిందకు దూకి, మెలికలు తిరుగుతూ, ఎర్రొడ్ల మడుగు కొండలపై నుంచి దుముకుతుంటాయి.
వర్షం వచ్చినప్పుడు ఈ ఆరిమాను బండలపైన నిలబడితే కొట్టుకుపోవడం ఖాయం. ఇక్కడ అంత ఉదృతంగా ప్రవహించిన ఆనవాళ్ళున్నాయి.
ఆ నీటి ఉదృతి ఈ బండలపై నుంచి అంత లోతైనలోయలోకి దూకుతున్నప్పుడు చూడాలి ఆ జలపాతపు అందాలు.
ఈ ఆరిమాను బండలను వర్తులాకారంలో చుట్టుముట్టినట్టు ఇప్పటికీ దాని చుట్టూ నీటి ప్రవాహమే. వినిపిస్తున్న ఆ ప్రవాహ గానమే. ఆ నీటి ప్రవాహం ఎటు నుంచి దూకినా ఎర్రొడ్ల మడుగుకే చేరతాయి.
పచ్చని కొండల మధ్య, దట్టమైన అడవిలో, పుట్టలను చూస్తూ, చెట్లను పలకరిస్తూ, సెల ఏటి సంగీతాన్ని వింటూ, జలపాతపు హోరులో తడిసి ముద్దవుతూ ఈ ఆదివారం ఎర్రొడ్ల మడుగు, ఆరిమాను బండల మధ్య ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాం.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)