జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ లేఖ

తేది :26-02021
బహిరంగ లేఖ
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,
ఏపీ ముఖ్యమంత్రి.

(అనగాని సత్యప్రసాద్, టీడీపీ శాసనసభ్యులు)

ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిది. సీఎంఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందడంతో సకాలంలో వైద్యం చేయించుకుని ఏటా వందలమంది ప్రాణాలు దక్కించుకున్నారు. సీఎంఆర్ ఎఫ్ అంటే ఆపత్కాలంలో ఆదుకునే నిధి. దీని ద్వారా టీడీపీ హయాంలో ఇతోదికంగా సాయం చేశాం. పార్టీలు, కులాలకు అతీతంగా సాయం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజానీకానికి సంజీవనిగా ఉపయోగపడింది.

ఇప్పుడా పరిస్థితి లేదు. సాయాన్ని పూర్తిగా నిలిపేశారు. పేద, బలహీన వర్గాలకు ఆపన్న హస్తంలా ఉపయోగపడిన సీఎమ్ ఆర్ఎఫ్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరం. ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలే కాచేలా ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు సాయం చేసేందుకు శాసనసభ్యులు ఇస్తున్న లేఖలను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు.

గడిచిన ఐదేళ్లలో సీ.ఎం.ఆర్.ఎఫ్ కింద రెండున్నర లక్షలమంది రోగులకు రూ. 1600 కోట్లు చెల్లించి వైద్య సదుపాయాలు అందించడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు 1500 వ్యాధులకు పైగా చికిత్స అందించడంతోపాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా వేలాది మంది పేదలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. దీనివల్ల అప్పటివరకూ మెరుగైన వైద్యం కోసం అప్పులు చేసి, ఆస్తులమ్ముకుని అవస్థలు పడుతున్న పేదలకు సీఎంఆర్ ఎఫ్ ఆసరాగా నిలిచింది. అలాగే బాధిత కుటుంబాలకు, ఆస్పుత్రులకు చెల్లించాల్సిన బిల్లులను కూడా గత ప్రభుత్వం వేగంగా క్లియర్ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ లో ఉన్న బిల్లులను పరిగణలోకి తీసుకోకపోగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేయడం సరికాదు.

Anagani Satya Prasad TDP MLA Repalle

సీఎంవో నిర్లక్ష్యం కారణంగా 40 వేలకు పైగా దరఖాస్తులు, వందల కోట్ల రూపాయిల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కరోనా కారణంగా ఓ వైపు ఉపాధి లేక మరోవైపు వైరస్ సోకి వైద్యం చేయించుకోలేక ఎంతోమంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వంటి విపత్తులో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందుంటే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కరోనా సమయంలో సీఎంఆర్ ఎఫ్ కు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చిన నేపథ్యంలో ఆ నిధులను నిరుపేదల వైద్యానికి కేటాయిస్తే కొండంత ఆసరాగా ఉంటుంది.

అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చాము కనుక సీఎంఆర్ ఎఫ్ అవసరం లేదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ పేరుతో సీఎంఆర్ ఎఫ్ ను కనుమరుగు చేయడం సరికాదు. దారిద్ర్యరేఖకు దిగువన ఉండీ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? టీడీపీ ప్రభుత్వంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారికి సీఎం సహాయనిధి ద్వారా ఒక్కోరికి రూ. 10 లక్షల సాయం అందించడం జరిగింది. అలాగే డెలివరీ సమయంలోనూ సాయం అందించాం.

వైసీపీ ప్రభుత్వం గుండె మార్పిడి చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చలేదు. మరి వారికి వైద్య సాయం ఎలా అందుతుంది? ముఖ్యమంత్రి సహాయనిధి లేకుండా సొంతంగా లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోవడం పేదల వల్ల అయ్యే పనేనా?పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామంటున్న మీరు వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. నిరుపేదలకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయనిధిని వెంటనే పునరుద్దరించాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *