తెలంగాణ సర్పంచుల దయనీయ పరిస్థితి

(వడ్డేపల్లి మల్లేశము)

సర్పంచ్ వ్యవస్థ ఏర్పడిన నుండి గ్రామపంచాయతీ వనరులు ఆదాయ మార్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విషయంలో అప్పటికీ ఇప్పటికీ ఎంతో పరిస్థితులు మెరుగు పడినాయని చెప్పుకుంటూ ఉంటాము. ఒకప్పుడు సర్పంచు లకు వేతనాలు కూడా లేవు. స్వచ్ఛందంగానే పని చేయవలసి ఉండేది. అప్పుడు నిధులు కూడా తక్కువే. ప్రజలు చెల్లించే వివిధ రకాల పనులతోనే అరకొరగా కార్యక్రమాలు నిర్వహించబడినా మర్యాదకు లోటుండేది కాదు.

అయితే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులకు వేతనాలు కూడా అందిస్తున్నప్పటికీ చాలాచోట్ల అసంతృప్తితో ఉన్నారు.

సర్పంచుల సమస్యలు ఏమిటి?

గ్రామపంచాయతీ అవసరాల నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ గ్రామ స్థాయిలో చేసే పనులు హరిత వనాలు, వేతనాలు, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు, తదితర పనులకు ఆ నిధులు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్గాంధీ దేశ ప్రధానిగా ఉన్న కాలంలో గ్రామపంచాయతీ సర్పంచులకు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా లేఖలు రాస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారం పై భరోసా ఇచ్చారు. సుమారుగా అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు పెద్ద మొత్తంలో రావడం ఖరార్ ఐ పోయింది. ఇక గ్రామ స్థాయిలో కొనసాగుతున్న టువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యంగా ఉపాధి హామీ పనులు, స్మశాన వాటికలు వంటి అనేక పనులు ప్రభుత్వ అధికారుల ఒత్తిడి మేరకు చాలామంది సర్పంచులు సకాలంలో పూర్తి చేశారు. అయితే ఎలాంటి నిధులు మంజూరు కాకుండానే అధికారుల ఒత్తిడి మేరకు అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి బిల్లులు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచులు గా పనిచేస్తున్న వారిలో మెజారిటీ సంఖ్యలో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ బాధ్యతల రీత్యా వడ్డీలకు తీసుకువచ్చి పనిచేయడంతో అనేకమంది అప్పులపాలు అయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో నేటి సర్పంచుల పరిస్థితి

ఇటీవల పత్రికల్లో ప్రసార మాధ్యమాలలో వస్తున్న సమాచారం ప్రకారం మెదక్ ,సిద్దిపేట ,ఆదిలాబాద్,సంగారెడ్డి, ఆసిఫాబాద్, నిర్మల్ మంచిరాల, వరంగల్, ఖమ్మం వంటి అనేక జిల్లాలలో చాలా మంది సర్పంచులు బిల్లులు సకాలంలో మంజూరు కాక చేసిన అప్పులు చెల్లించే స్థోమత లేక కొందరు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. చాలామంది బ్రతుకుదెరువు కోసం ప్రత్యామ్నాయ మార్గం లేని కారణంగా చాలీచాలని పరిస్థితుల్లో దినసరి కూలీలుగా మారిపోయినట్లు కన్నీరు పెట్టి బాధలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చాలా మంది సర్పంచులు వాళ్లు కొనసాగుతున్న టువంటి రాజకీయ పార్టీకి సర్పంచ్ పదవులకు కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. అనేక మంది సర్పంచులు టిఆర్ఎస్ అధికార పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహకారం ఇప్పటికీ కూడా అందకపోవడంతో సర్పంచులు, గ్రామ ప్రజలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిల్లుల మంజూరులో సమస్య ఒకే విధంగా ఉన్న కారణంగా సర్పంచులు నిరసన కార్యక్రమాలు రాజీనామాల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బిల్లుల కోసం సర్పంచ్ కంటతడి

ఒకవైపు సర్పంచులు తమ ఉనికి కోసం ఆరాటపడుతూనే బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా నిరసనగా పార్టీ, సర్పంచ్ పదవులకు రాజీనామా చేస్తుంటే ఏకంగా మండల సర్వసభ్య సమావేశంలో కంటతడి పెట్టిన సర్పంచ్ సంఘటన మనతో కూడా కంటతడి పెట్టిస్తుంది.
సంగారెడ్డి జిల్లా వాట్పల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో దరఖాస్తు పల్లి గ్రామ సర్పంచ్ మహమ్మద్ వైకుంఠధామం నిర్మాణానికి చేసిన అప్పులు చెల్లించడానికి కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసినట్లు నేటి ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురించబడింది.

పనులు చేయించుకోవడం తెలిసిన అధికారులు బిల్లులు మంజూరు కోసం మాత్రం నెలల తరబడిగా కార్యాలయాల చుట్టూ తిప్పుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన తీరు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇక్కట్లలో ఉన్న సర్పంచుల పరిస్థితికి దర్పణం పడుతుంది.

ప్రభుత్వం స్పందించాలి

రైతుబంధు తో సహా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల ద్వారా లబ్ది పొందేది కే వలం ఉన్నత వర్గాలవారే. రిజర్వు బ్యాంకు నుండి అప్పులు తెచ్చి పంతాలు నెగ్గించుకుంటున్న ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న సర్పంచులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం దేనికి సంకేతం ఆలోచించుకోవాలి?

నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి లక్షల్లో వేతనాలను వాహన సౌకర్యాలను అనుమతిస్తూ ప్రభుత్వ నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో పనిచేసే స్కావెంజర్ లను, పార్ట్ టైం స్వీపర్లను చిన్నచూపు చూసినట్లే సర్పంచుల పట్ల వివక్షత కనబరచడం హేయమైన చర్య.

గ్రామ ప్రథమ పౌరుడు అనే గౌరవం పూర్వకాలంలో గొప్పగా ఉండేది. ఆదాయ మార్గాలు పెరిగినా ప్రభుత్వ అధికారుల ఒత్తిడి, ప్రజల సమస్యలు వెంటాడుతున్నా చిత్తశుద్ధితో పనిచేసే సర్పంచులకు బిల్లులు మంజూరు చేయక అప్పులపాలు చేయడం మానుకొని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. మహమ్మద్ వలే ఏ సర్పంచ్ కూడా భవిష్యత్తులో కన్నీరు పెట్టకుండా ప్రజాసేవలో పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్పంచుల పై కక్షపూరిత చర్యలకు పాల్పడకుండా వారి ఆర్థిక పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకొని బిల్లు మంజూరు చేసి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి. సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి.

 

ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు,  సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత, హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *