బండి సంజయ్ కు ‘హిస్టరీ ట్రీట్ మెంట్’

వక్రీకరణలతో ,అసత్యాలతో చరిత్రను మార్చలేరు

 

(డాక్టర్. యస్. జతిన్ కుమార్)

తెలంగాణ విలీనం /విముక్తి /విమోచనం/ విద్రోహం అంటూ ప్రతి సెప్టెంబర్ లోనూ కొంతకాలంగా ఈ ప్రాంతంలో చర్చలు జరుగుతున్నాయి. అధికారం లో వున్నవాళ్ళు ఒకరకంగాను. ప్రతిపక్షంగా వున్నవాళ్ళు ఒకరకంగాను వ్యాఖ్యానిస్తూ, ”ఎప్పటి కేయది అప్పటి కయ్యది అన్నట్లు” కొందరు వ్యవహరిస్తున్నారు. వాస్తవాలను బలిపెట్టి, అరకొర సత్యాలను ప్రచారం చేస్తూ. తమ ఇప్పటి రాజకీయాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరిస్తున్నారు కొందరు. 

 17 సెప్టెంబర్ 1948 న నిజాం నిరంకుశ పాలన నుండి  సంస్థానం విముక్త మయ్యిందని చెప్పేవారు కొందరు. అప్పుడే విముక్తి సాధిస్తే 1951 వరకు ప్రజలు సాయుధ పోరాటం ఎందుకు చేశారు అని అడిగే వారు కొందరు. నిరంకుశుడైతే నిజాం ను 1956 వరకు రాజ్ ప్రముఖ్ గా ఎందుకు కొనసాగించారని అడిగేవారు కొందరు, 1956 నుండి ఆంధ్రా వలస పాలకుల చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది, 2 జూన్ 2014 న  ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తోనే విముక్తి సాధించామని అనేవారు కొందరు . ఏర్పడింది భౌగోళిక తెలంగాణే కానీ ఇప్పుడున్నది  ప్రజా తెలంగాణా కాదనే వారు ఇంకొందరు. ఎవరి “అభిప్రాయం “ “అన్వయం” ఎలా వున్నా జరిగిన వాస్తవాలను అందరూ గుర్తించాలి కదా, వాటిని అంగీకరించ వలసిందే కదా.   

  17-09-2021 నాటి సాక్షి దినపత్రికలో  “విమోచనకు వద్దా ఉత్సవం “ అన్న  శీర్షికతో వచ్చిన వ్యాసం లో శ్రీ బండి సంజయ్ కుమార్ గారు [భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు] చరిత్ర పట్ల, వాస్తవాల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా తనకు అవసరమైనట్లు రాశారు. ముఖ్యంగా కమ్యూనిస్టుల గురించి. ఆ పార్టీ ప్రముఖ నాయకు లిద్దరి పేరును ఉదహరిస్తూ వారు ఏకీభవించని, ఖండించిన ప్రకటనను వారికి అంటగట్టి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారు.

నిరంకుశ నిజాం రాజరికాన్ని, తెలంగాణ లో భూస్వామిక వ్యవస్థను కూకటి వేళ్ళతో  సహా పెకలించటానికి ఎనలేని త్యాగాలు చేసిన, సాయుధ పోరాటం తో నైజాం పాలనకు అంతిమ ఘడియలు లిఖించిన ఆనాటి  ప్రజలపట్ల, వారి ఉద్యమాల పట్ల. ఆ నాయకుల పట్ల కనీస సద్భావన లేకపోగా చరిత్రను పాక్షిక సత్యంతో  ప్రచారం చేసి వాస్తవ స్థితిని  మరుగు పరచటం ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి తగినదేనా? 

తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 1948 వరకు  స్వతంత్య్రం రాకపోవటానికి కమ్యునిస్టులు కారణమట. అంతర్జాతీయ పార్టీ ఆదేశాలకు లోబడి ఇక్కడి  కమ్యూనిస్టులు తమ వైఖరిని మార్చుకున్నారట.

హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారట. ఇలాఎన్నో కథలు చెప్పారాయన. కమ్యూనిస్టులు ఏమైనా ద్రోహాలు, దోషాలు చేసివుంటే అది చర్చించవలసిందే, కానీ బ్రిటిష్ నుండి భారత స్వతంత్రం అన్న ప్రక్రియ వేగవంతమై, నిజాం నుండి  హైదరాబాద్ స్వాతంత్య్రం అన్న సమస్య తారస్థాయికి వచ్చి ప్రజలు తీవ్రంగా కదిలి  ఉద్యమించిన కాలంలో  కమ్యూనిస్తులు నీళ్ళలో చేపల్లా ప్రజా ఉద్యమాలలో కలసి వున్నది నిజం కాదా ?

1946-51 వరకు వేలాది ప్రాణాలు తర్పణ జేసి పోరాడిన దెవరు?  బ్రిటీష్ వారి అడుగులకు మడుగులు వత్తుతూ అధికార మార్పిడి జరిగిన  తరువాత కూడా ,ఆ తెల్లదొరల అభీష్టానుసారమే, వారి ఎత్తుగడలతోనే రాజకీయం చేసింది ఎవరు? నిజాం తో యధాతధ ఒప్పందం చేసుకున్నది ఎవరు?

కేంద్ర ప్రభుత్వం తరఫునా, నిజాం తరఫున తెల్లదొరలు, సైనిక అధికారులు చక్రం తిప్పుతుంటే వారితోనే మంతనాలాడిన స్వాతంత్ర్య భారత పాలకులు, ఉక్కు మనుషులు ఎవరు? మౌంట్ బాటెన్ ను కాదని తమ స్వంత నిర్ణయాలు చేశారా నాటి ప్రధాని, ఉపప్రధాని? ఇదంతా జరుగుతున్నప్పుడు నిజాం వ్యతిరేక పోరాటం సాగించింది ఎవరు?

రాచరికానికి కోరలు పీకి, భారత్ యూనియన్ లో చేరకపోతే తన అధికారమూ, అపారమైన ధనరాసులు తనను కాపాడలేవనే భీతిని నిజాం ప్రభువులో కలిగించినదెవరు.? నిజాం ఐదు రోజుల్లో చేతులెత్తేసినా ఎవరి ప్రయోజనం కోసం ఎవరిని రక్షించడానికి 50 వేల భారత సైన్యం మూడు సంవత్సరాలకు పైగా నరమేధం సాగించింది?

ఎవరి భూముల రక్షణ కోసం. ఎవరి అధికారాల రక్షణ కోసం, నెహ్రూ-పటేల్ సైన్యం నాలుగు వేలమంది ప్రజలను కాల్చి చంపింది? మూడువేల గ్రామ రాజ్యాలను మట్టిలో కలిపివేసింది? ఈ వీరోచిత చరిత్రలో ప్రజలతో నిలిచివున్నదెవరు?   

“హైదరాబాదును భారత దేశంలో కలిపేసుకునే ప్రయత్నాలను వ్యతిరేకించాలి” అని ఆంధ్ర  కమ్యూనిస్టు నాయకులైన పుచ్చలపల్లి సుందరయ్య ,దేవులపల్లి వేంక టేశ్వరరావులు ప్రకటించినట్లు సంజయ్ కుమార్ రాస్తున్నారు. “తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర” [మొదటిభాగం] లో శ్రీ దేవులపల్లి వేంకటేశ్వర రావు గారు స్పష్టంగా ఈ విషయం గురించి  రాశారు.

1988 నాటి ముద్రణలో 594 పేజీ లో  ‘నిజాం నవాబు ఇచ్చిన ఆజాద్ హైదరాబాద్ నినాదం-ఫ్యూడలిజం, బడా బూర్జువా వర్గాల మిలాఖతులో ఒక భాగమే” అని వివరించారు. అదే పుస్తకం 400-407 పేజీలలో  “నిజాం సంస్థానం భారత్ యూనియన్ లో చేరాలి “ నిజాం సంస్థానం లో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలి” అనే కాంగ్రేస్ నినాదాలను వివరిస్తూ “వీటిని పార్టీ బలపరచటమే కాక తన నినాదాలుగా కూడా ముందు పెట్టింది“ అని వివరించారు.

 భారత ప్రభుత్వ వర్గ  స్వభావం గురించి, కేంద్ర ప్రభుత్వ నామ మాత్రపు  ప్రజాతంత్ర స్వభావం గురించి భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ  “భారత యూనియన్లో చేరటం  ప్రజాతంత్ర  కోరిక” అని  పార్టీ పరిగణించింది. అయితే దానికి వున్న పరిమితులను, ఈ పాలక స్వభావం గురించిన వాస్తవాలను ప్రజలకు పార్టీ   సరిగా వివరించ లేదు, అందువల్ల భారత ప్రభుత్వం పట్ల అది ప్రజాస్వామిక మైనదనే భ్రమలు ప్రజలలోను ,కొందరు నాయకులలోను  ఏర్పడ్డాయని ఆయన రాశారు. ఇది పార్టీ చైతన్యంలోనే వున్న పరిమితిగా ఆయన రాశారు.  అంతేగాని భారత దేశంలో ఐచ్చికంగా చేరడాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఏనాడూ వ్యతిరేకించలేదు. 

అలాగే “భారత దేశం లో ఏర్పడింది బూర్జువా ప్రభుత్వమే కద, ఇప్పటికే భూస్వామ్య అరాచక ధౌష్ట్యానికి గురవుతూ దాన్ని ఎదిరించి పోరాడుతున్న తెలంగాణ  ప్రజలకు బలమైన భారత దోపిడి వర్గాన్నిఎదిరించే బరువు కూడా ఇప్పుడే మీద పడాలా, భారత దోపిడీ దారులను దూరం వుంచి నిజాం బూజును తొలగిద్దాము “ అనే లాజిక్ తో కొందరు హైదరాబాదు సిటీ  నాయకులు  స్వాతంత్ర్య హైదరబాదు నినాదాన్ని ఎత్తుకున్న మాట నిజమే, ప్రజా ఉద్యమాలలో అనేక భావాలు, ధోరణులు వస్తూవుంటాయి . వాటిని తొలగించి సరి అయిన మార్గం నిర్దేశించటంలోనే నాయకత్వ విజ్ఞత వుంటుంది. ఆజాదీ హైదరాబాద్ అనేది  కొందరి అభిప్రాయం మాత్రమే. రాజబహదూర్  గౌర్  లాటి నాయకులు దానికి సమర్ధనగా మాట్లాడినదీ నిజమే. కానీ “ఈ విషయం తెలిసిన వెంటనే బొంబాయి లేదా  కలకత్తా నుండి కేంద్ర నాయకులు ఈ వైఖరిని ఖండించారు. రాష్ట్ర కేంద్రం కూడా దీన్ని ఖండిస్తూ ప్రకటన జారీ చేసింది. పార్టీ విధానాలకు దీనికి ఎలాంటి సంబంధమూ లేదని, ఈ నినాదం తప్పనీ  ప్రకటించారు. [540,541 పే జీలు చూడండి ] దేవులపల్లి వేంకటేశ్వర రావు గారు ఈ విషయాలు రాసి 40 సంవత్సరాలు దాటిపోయింది. 

ఈ సంఘటనలు జరిగినప్పుడు కమ్యూనిస్టులు, వారి నాయకత్వం తమ వైఖరిని అధికారికంగా ప్రకటించినా దాన్ని పట్టించుకోకుండా, అటు నిజాం ప్రభుత్వం -కమ్యూనిస్టుల వైఖరి తమకు అనుకూలమనీ, మరో వైపు కాంగ్రెస్  -కమ్యూనిస్టుల వైఖరి దేశ విద్రోహ కరమైనదనీ వారి వారి ప్రయోజనాలకు అనుకూలంగా విపరీతంగా ప్రచారంచేశారు .కమ్యూనిస్టులు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని నిందలు వేసి విష ప్రచారం చేశారు. అయితే ప్రజలు మాత్రం  వాస్తవం గ్రహించి కమ్యూనిస్టుల తోనే నిలిచి నిజాం  సైన్యం మీదనే కాక, నెహ్రూ- పటేల్ సైన్యాల మీద కూడా తమ సాయుధపోరాటాన్ని కొనసాగించారు. పోరాటం లో తాము సాధించుకున్న విజయాలను ఎవరు తిరిగి దొరల పాలు చేస్తున్నదీ  ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.  మళ్ళీ అవే అసత్యాలను, అర్ధ సత్యాలను  కొత్త తరానికి వినిపించి, మభ్య పెట్టి, ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం తప్ప జాతీయ పార్టీలకు కూడా కనీస చారిత్రక అవగాహన లేదని, ఈ సత్యానంతర కాలంలో ఏ అబద్ధమైన చెప్పి నెగ్గుకు రాగలమని భావిస్తున్నారు .రాంజీ గోండు ఉద్యమాన్ని, ఆ తరువాత ఎప్పుడో వచ్చిన రజాకారు అకృత్యాలను కలగాపులగం చేసి ముస్లిం వ్యతిరేకతను ప్రోత్సహించే నాయకులు, తెలంగాణ విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే వారి అజ్ఞానమే బయట పడుతుంది తప్ప వీర తెలంగాణ ప్రజల ముందు ఈ కుప్పిగంతులు సాగవు. తెలంగాణ విమోచన పొందిందా? విద్రోహానికి గురిఅయ్యిందా అనేది ప్రజలకు నిస్సంశయంగా తెలుసు. 

 

(డాక్టర్. యస్. జతిన్ కుమార్. ఆర్ధోపేడిక్ సర్జన్, హైదరాబాద్, మొబైల్: 9849806281 )

                                                                                                                                        

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *