(వడ్డేపల్లి మల్లేశము)
ఎపుడో 150 ఏళ్ల కిందటే మనిషిని, మానవత ని కేంద్రం చేసుకుని ప్రజాస్వామ్య భావాలను విస్తృతం చేసిన వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు. ‘దేశభక్తి’ ని తొలి సారి ప్రజల పరంగా నిర్వచించి, దేశం అంటే మట్టి కాదు, మనుషులని చెప్పిన వాడు. ఈ ఒక్క మాట గురజాడని సర్వకాలిక మహా కవిని చేసింది. ఈ రోజు గురజాడ జయంతి. ఈ సందర్బంగా ఈ తరానికి ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్పడం కోసమే ఈ వ్యాసం.
ప్రజా సాహిత్య వైతాళికుడు
గురజాడ వెంకట అప్పారావు సెప్టెంబర్ 21 1862 లో విశాఖపట్నం లో జన్మించారు.
ఆయన 19వ శతాబ్దంలో జనించినా ఆయన రచనలు మాత్రం 20, 21వ శతాబ్దం లోని ప్రజల కోసం అని 1962 సెప్టెంబర్ 21 గురజాడ శతజయంతి సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో నాటి సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు రాసిన మాటలు ఆలోచించదగినవి.
గురజాడ రచనలలోని అర్థాన్ని ఆయన సమకాలికుల్లో కాదు అనంతర కాలంలో వచ్చిన సాహిత్యకారులు సామాజిక కార్యకర్తలు కూడా అంతగా గ్రహించలేదు. స్పందించలేదని విమర్శ ఉంది. తెలుగు సాహిత్య రంగం చాలాకాలం గురజాడను పూర్తిగా అర్థం చేసుకోలేక పోయింది . గురజాడను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ఆయన సృజనాత్మక నుంచి నేర్చుకోవడానికి నేటి తరాలు ముఖ్యంగా సాహిత్య రంగం కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ప్రతి కవికి ఉన్నట్లే ఆయనకు కూడా కొన్ని పరిమితులు లోపాలు ఉండవచ్చు. వాటిపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.గురజాడ రచనలు ఒక చిన్నమైనారిటీ వర్గానికి చెందిన సమస్యలచుట్టే తిరిగాయని కొందరు చెప్పినా, సాంఘిక దురాచారాలను నిరసించడమే కాదు, అపుడపుడే పెరుగుతున్న మధ్య తరగతి వచ్చే పరిణామాన్ని కూడా ఆయన చెప్పారు. గిరీశం అనే నాలుగు ముక్కలు ఇంగ్లీస్ మాట్లాడే వాడు ఎవరి ప్రతినిధో వాడి చెబుతున్నాడో ఇపుడు చదివినా అర్థమవుతుంది.
కన్యాశుల్కం ,సాహిత్య సృజన
నాటి సామాజిక అంశమైన కన్యాశుల్కం, వృద్ధులకు చిన్నపిల్లలను అమ్ముకునే దురాచారం బాల్య వివాహం నేపథ్యంగా ‘కన్యశుల్కం’ రాసినప్పటికీ అందులోని పాత్రలచర్చ జీవితము లోని అన్నికోణాలను స్పృశించింది.
రాజకీయాలను సామాజిక పరిస్థితులను విమర్శించడానికి, వ్యతిరేకించడానికి ఆయుధంగా సాగిన రచన కన్యాశుల్కం నాటకం.
ఆయన జీవిత కాలం నాటికే చరిత్ర రచనలో తొంగిచూస్తున్న మతతత్వ దురాచారాన్ని నిరసించిన ప్రజలు బుద్ధుడిని దేశం నుంచి తరిమివేసి దేశం చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే బౌద్ధమతము ప్రతిపాదించిన మానవులంతా సమానమే అనే భావనను గురజాడ అంగీకరించినట్లే కదా!
అంధ విశ్వాసాలను మతతత్వాన్ని నిరాకరించిన గురజాడ ఆధునిక స్త్రీ చరిత్రను తిరగ రాయాలని భార్యాభర్తలు స్నేహితులుగా కొనసాగాలని ఆకాంక్షించాడు.
” మతములన్నియు మాసిపోవును / జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అన్న తన గేయము ద్వారా శాస్త్రీయ విజ్ఞానమే భవిష్యత్తుకు సోపానం అని అంగీకరించాడు.
“మన కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఒక భాష గ్రంథ రచనకు మరో భాషా? అని ప్రశ్నించిన గురజాడ మాట్లాడుకునే భాషలోనే రచనలు ఉంటే ఎక్కువమందికి అర్థమవుతుందని వ్యవహారిక భాషలోనే రచనలు రావాలని గిడుగు రామమూర్తి తో చేతులు కలిపి ఆ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.
విద్యారంగము గురించి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ విద్య సార్వత్రికమైన అంశమని జనం మాట్లాడుకునే భాష లోనే బోధనాభ్యసన జరగాలని ఆకాంక్షించాడు.
సాహిత్యంలోనూ సమాజంలోనూ కొత్తపాతల కలయిక ద్వారా సమగ్ర చర్చ సంఘర్షణ జరగాలని కోరారు. కన్యాశుల్కం నాటకం ,దిద్దుబాటు కథ ద్వారా సాహిత్యరంగంలో కొనసాగిన అప్పారావు సాహిత్య రంగంలో చేసిన కృషి తక్కువేమీ కాదు.
వ్యాసాలు, చరిత్ర, కథలు, డైరీలు, నాటికలు, పుస్తకాల పై రాసుకున్న నోట్లు, పుస్తకాల కమిటీలో పాఠ్య భాషపై సమర్పించిన పత్రాలు సంక్షిప్తంగా వీరి సాహిత్యానికి ఆనవాళ్లు. దాదాపుగా 150 ఏళ్ల క్రితమే ఆయన సాహిత్యంలో సమాజాన్ని ప్రేమించే తత్వం, భావుకత దేశభక్తి సృజనాత్మకత కలిగి ఉండడం విశేషం.
గురజాడ ఒకొక్కరచన ఒక్కొక్క సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా ఒక సంస్కర్త సాగించిన క్యాంపెయిన్ అనవచ్చు. ఉదాహరణకు ఆయన రాసిన ‘లవణరాజు కల’ గురించి రెండు ముక్కలు చెప్పుకుందాం.కుల వివక్షని దేవుడి ఆజ్ఞలా భావించే రోజులవి. ఇప్పటిలాగా కుల సమాజిక చైతన్యం అప్పటింకా రాలేదు. ఈ కుల వ్యతిరేక చైతన్య భీజప్రాయంలోనే ఉంది. కులాంతర వివాహమే పెద్ద ఉల్లంఘన చూసే రోజులలో ఆయన కులాంతర వివాహాన్నిఎలా ప్రచారం చేసే ‘లవణరాజు కల’ లో కనిపిస్తుంది.
‘లవణ రాజు కల’ లో ఆయన కులాతీత సమాజం కోరుకున్న విషయాన్ని 21 వ శతాబ్దాపు రాజకీయరంగుటద్దాల్లోంచి చూస్తే సమస్య వస్తుంది. ‘లవణరాజు కల’ ని గురజాడ కాలం నాటి కళ్లతోన చూడాలి. అపుటికి ఇంకా కుల వ్యతిరేక పోరాటాలకు సైద్ధాంతిక స్వరూపంలేదు. మావనతావాదం నుంచే వచ్చాయి. వెనకబడిన కులాలు ఇపుడు రాజ్యాధికారం డిమాండ్ స్థాయికి అది పెరిగింది. ఇది వేరే చర్చ.మరోకసారి చూద్దాం.
లవణ రాజు కథలో … రాజు వేటకు వెళ్తాడు. అడవిలో ఆయనకు ఒక యువతి తారసపడుతుంది. వెంటనే ఇష్టపడతాడు. ఆమె దగ్గరకు వెళ్లి పెళ్ళి ప్రతిపాదన తెస్తాడు. అయితే, వచ్చింది మహారాజు అని కనిపిస్తూనే ఉంది. ఇదెలా సాధ్యం. అందుకే తాను ‘మాల యువతి’నని చెబుతుంది. మాలలంటే అస్పృశ్యులు కదా. ఈ గ్యాపుని ఆమె రాజుకు గుర్తు చేస్తుంది. రాజు కొద్ది సేపు ఆలోచించి, తర్కించుకుని తన అభిప్రాయం చెబుతాడు. ‘మలిన దేహుల మాలలనుచు మలిన చిత్తుల కథిక కులమ్ముల నేల ఒసంగిన వర్ణ ధర్మంబు అధర్మ ధర్మంబే’ అని తన ఫిలాసఫీ చెబుతాడు. అంతే, కాదు, ‘ మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్,’అని నిక్కచ్చిగా చెబుతాడు,, తనకు అలాంటి బేధభావం లేదని పెళ్లికి సిద్ధమవుతాడు. కులాంతర వివాహానికి గురజాడ్ చేసిన క్యాంపెయినే ‘లవణరాజు కల’.
గురజాడ- ఠాగూర్ జీవితాల సామ్యం:
ఒకే కాలంలో వేరు వేరు ప్రాంతాలలో జీవించిన ప్పటికీ వేర్వేరు కవుల ఆలోచనలు భిన్నంగా నూ అభ్యుదయం గానూ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆలోచనా ధోరణి ని బట్టి సాంప్రదాయంగా గిరి గీసుకున్న రచనలకే పరిమితమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
వీరిద్దరూ 1862 లోనే జన్మించారు. 2012లోనే 150వ జయంతి ఉత్సవాలు జరిగినవి. సమకాలికులు పరస్పరము తెలిసినవారు.
అయితే ఠాగూర్ అంత విస్తృతంగా గురజాడ రచనలు చేయక పోవచ్చు కానీ రాశిలో లేకున్నా వాసీలో ఉన్నదనే వాస్తవాన్ని మహాకవి శ్రీశ్రీ నే అంగీకరించాడు. జాతీయ ఉద్యమాలలో, సాహిత్య సాంస్కృతిక కృషిలో బెంగాలీలకు ప్రత్యేక స్థానం ఉన్నది. మానవతా వాదానికి ఊపిరిపోసిన గురజాడ 150వ ఉత్సవాల సందర్భంగా జరిగిన ఉత్సవాల స్థాయికన్నా ఠాగూర్ ఉత్సవాల స్థాయి ప్రధాని పాల్గొనడంతో గణనీయంగా పెరిగి పోయింది.
తెలుగునేలపై సాహిత్యానికి నాయకులకు అవినాభావ సంబంధం అంతగా లేని కారణంగా సాహిత్యం రాజకీయం దృష్టిలో తెలుగునేలపై కొంత తక్కువ ప్రభావాన్ని చూపిందని విమర్శకులు అంటున్నారు.
‘సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’ అన్న జాషువా మాటను నిజం చేయాలంటే తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని వినీలాకాశంలో నిలిపిన సాహితీవేత్తల జీవితాలకు సంబంధించిన స్మృతి విషయాలను జయంతి, వర్ధంతుల సందర్భంలో సామాజిక అంశంగా ప్రజల మధ్యనే ఉత్సవాలు జరగాల్సిన అవసరం ఉంది. వీటికి ప్రభుత్వాలు నాయకత్వం వహించిన ప్పుడే సాహిత్యం, పాలన పరస్పరం ప్రభావితమై నూతన వ్యవస్థ ఆవిష్కరణకు మార్గం సుగమమవుతుంది.
గురజాడ 30 నవంబర్ 1915 రోజున విజయనగరంలో మరణించారు.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, అధ్యక్షులు జాగృతి కళాసమితి, హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)