ప్రపంచ సుస్థిరతకు అమెరికానే అతి పెద్ద ముప్పు

-జోంగ్ షెంగ్

అనువాదం : రాఘ‌వ శ‌ర్మ‌

కాబూల్ ఎయిర్ పోర్ట్ పై అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఒక్క టెర్రరిస్టు కూడా మరణించలేదు. ఆగస్టు చివరన జరిగిన ఈ దాడిలో పదిమంది పౌరులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

ఒక పథకం ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగానే అమెరికా ఈ దాడి చేసిందని పలు అమెరికా మీడియా సంస్థలు విస్తృతంగా చేసిన పరిశోధనతో ఈ నిజాన్ని వెల్లడించాయి.

ఇరవై ఏళ్ళక్రితం అఫ్ఘన్ల పైన అమెరికా ప్రారంభించిన యుద్ధం వల్ల వేలాది మంది అమాయక పౌరులు మరణించడమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా చితికిపోయింది.

అమెరికా వెళ్ళిపోతూపోతూ తనకున్న సైనిక శక్తిని ఇలా దుర్వినియోగం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక చర్యలు ప్రపంచ శాంతికి ఒక పెద్ద ఆటంకమని, ప్రపంచంలో అస్తవ్యస్త పరిస్థితికి అదే కారణమని మరొక సారి రుజువైంది. ఒక దేశంగా అమెరికాకు చెప్పుకోద‌గ్గ‌ సుదీర్ఘ చరిత్ర లేదు.

ఒక్క‌ పదహారేళ్ళు మినహాయిస్తే, అమెరికాను కనుగొన్నప్పటి నుంచి గడిచిన 240 సంవత్సరాల పైగా దానికున్నచ‌రిత్ర అంతా యుద్ధాల చరిత్రే.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, 1945 నుంచి 2001 మధ్య వరకు లభించిన లెక్కల ప్రకారం, 153 ప్రాంతాలలో జరిగిన 280 సైనిక ఘర్షణలలో 201; అంటే 80 శాతం సైనిక ఘర్షణలు అమెరికా పుణ్యమే.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా 70 దేశాల్లో 800 సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అమెరికా చేసిన అన్ని యుద్ధాలకూ ఆ దేశాధ్యక్షుల చొరవే కారణం.

అమెరికా చరిత్ర అంతా “స్థిరమైన దురాక్రమణ, సామ్రాజ్య విస్తరణ” తోనే నిండి ఉందని ప్రముఖ అమెరికా చరిత్రకారుడు పౌల్ అట్ ఉడ్ అంటారు.

అమెరికా తన ఆలోచనా విధానాన్ని ఇతర దేశాలకు వ్యాపింప చేయడానికి యుద్ధాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకుంటోంది. ఆ యుద్ధాలు ‘అమెరికా శాంతి’ కి దోహదపడతాయని నమ్మబలుకుతోంది.

అమెరికా రచయిత విలియం హెన్రీ ‘అమెరికాస్ డెడ్ లీస్ట్ ఎక్స్పర్ట్’ అన్న తన పుస్తకంలో ఇలా రాస్తూ, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 దేశాలలో ప్రభుత్వాలను కూల్చడానికి అమెరికా ప్రయత్నం చేసిందని, వాటిలో చాలా మటుకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనవేనని పేర్కొన్నారు. ముప్ఫై దేశాల్లో జరిగిన ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో అమెరికా జ్యోం చేసుకుందని, 50 మందికి పైగా దేశాధినేతలను హత్య చేయడానికి ప్రయత్నించిందని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనేక సమస్యలను సృష్టించింది.అమెరికా ప్రారంభించిన యుద్ధాల వల్లనే ‘ఇస్లామిక్ రాజ్య’ స్థాపన , అఫ్ఘనిస్తాన్ లో అనేక టెర్రరిస్టు ముఠాలు పెరగడానికి దారితీసింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ వరకు, సిరియానుంచి లిబియా వరకు అస్తవ్యస్థపరిస్థితులు అమెరికా భస్మాసుర హస్తం వల్లనే ఏర్పడ్డాయని రుజువైంది.

“ప్రజాస్వామ్యానికి ఒక నీతివంతమైన దేశం” అని అమెరికా తనకు తాను భావిస్తోంది. కానీ, అది ప్రారంభించిన యుద్ధాలు మాత్రం మానవాళిని అనేక సంక్షోభాలలోకి నెట్టివేసింది. గడచిన ఇరవై ఏళ్ళలో అమెరికా చొరవతో జరిగిన యుద్ధాల వల్ల 3 లక్షల 35 వేల మంది పౌరులు మరణించారు.

గడిచిన రెండు దశాబ్దాలుగా సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో 90 వేల వైమానికి దాడులను నిర్వహించి, 48 వేల మంది పౌరుల ప్రాణాలను బలిగొంది.

అమెరికా మాజీ సైనికుడు ఒకరు అమెరికా డ్రోన్ దాడి గురించి ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీతో మాట్లాడుతూ ‘మనుషులను చంపడం కోసమే చంపుతున్నాం’ అని అన్నాడు.

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇరాక్ నగరం హదిథ‌లో 2005లో ఒకే ఒక్క అమెరికా సైనికుడిని చంపారన్న కారణం చూపించి అమెరికా సైన్యం 24 మంది ఇరాకీ పౌరులను విచక్షణారహితంగా కాల్చిచంపింది.

ఆఫ్ఘనిస్తాన్ లో నేడు ఏర్పడిన అతిపెద్ద మానవాళి సంక్షోభానికి, ఆహారాన్ని ఎగుమతి చేసే సిరియా దుర్భిక్షంలో కొట్టుమిట్టాడడానికి అమెరికానే కారణమని ఆరోపించక తప్పదు.

అంతర్జాతీయ నియమాలను తాను రక్షిస్తున్నానని ప్రపంచానికి అమెరికా చెపుతోంది. నిజానికి అంతర్జాతీయ నియమాలకు, నిబంధనలకు ఉల్లంఘించే అతి పెద్ద విధ్వంస కారి అమెరికానే. ప్రపంచంలో తానేమి చేయాలనుకున్నదో అది చేయడానికి తన మిలటరీని అనుమతిస్తున్నానని అమెరికా చాలా కాలంగా నమ్ముతోంది.

ప్రపంచంలో తన ఆధిపత్యం ఎంత కాలం కొనసాగుతుందో, అంతకాలం సైనిక సంబంధాలు పెట్టుకుని, సైనిక ఘర్షణలను రెచ్చగొడుతూ, ఆయుధ నియంత్రణ ఒప్పందాలను ఉపసంహరించుకుంటుంది.

ఐక్యరాజ్యసమితితో అంతర్జాతీయ విధానాలు, అంతర్జాతీయ చట్టాల ప్రాతిపదికగా అంతర్జాతీయ పద్ధతులను అమెరికా ఎంపికచేసుకుని, తనకు ప్రయోజనకరమైనంతవరకు మాత్రమే వాటిని ఉపయోగించుకుంటుంది.

అమెరికా తన సైనిక శక్తిని నమ్ముకుని సమస్యలను రెచ్చగొడుతూ, ఏకపక్షంగా ఎక్కడపడితే అక్కడ బెదిరింపులకు పాల్పడుతోంది. శాంతి, అభివృద్ధి, సహకారం, పరస్పరప్రయోజనాలు అనేవి నేటి విధానాలు.నేటి కాలానికి  ప్రజాస్వామికీకరణ, అంతర్జాతీయ సంబంధాలు అనివార్యం. అమెరికా ఆధిపత్యం, అధికార రాజకీయాలను చరిత్ర చివరకు తిరస్కరించకతప్పదు.

( పీపుల్స్ డెయిలీ సౌజన్యంతో)

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు,తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *