(టి.లక్ష్మీనారాయణ)
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగిస్తున్న మహోద్యమంపై శ్రీ గోలి మధు కవితా హృదయం స్పందించి వ్రాసిన 113 కవితలను “రైతు సమరభేరీ” కవితా సంపుటిని మానవ వికాస మండలి – మంగళగిరి సంస్థ ప్రచురించింది. 2021 సెప్టంబరు 19న ఆ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించడం సంతోషం కలిగించింది. ఆవిష్కరణ సభకు శ్రీ రేఖా కృష్ణార్జునరావు అధ్యక్షతవహించారు. రైతులు, కవులు, కళాకారులు, మధ్యతరగతి ఉద్యోగులు, చేనేత మరియు ఇతర రంగాలకు చెందిన వారు, మహిళలు, ప్రత్యేకించి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న మహిళా నాయకులు పాల్గొన్నారు.
ఈనెల 27న “భారత్ బంద్”కు “సంయుక్త్ కిసాన్ మోర్చా” పిలుపిచ్చిన పూర్వరంగంలో ఈ కార్యక్రమం జరిగింది. పుస్తకావిష్కరణ అనంతరం నేను చేసిన ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు:
1. మంగళగిరి అనగానే “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా!” గేయంతో యావత్తు తెలుగు జాతిని ఉర్రూతలూగించిన అమరజీవి కా.వేములపల్లి శ్రీకృష్ణ గారు గుర్తొస్తారు. కమ్యూనిస్టు ఉద్యమం ప్రముఖ నేత, మంగళగిరి మాజీ శాసనసభ్యుడు శ్రీకృష్ణ గారు శ్రామిక ప్రజలకు ఎనలేని సేవలందించారు. ఆయన నడిచిన గడ్డపై పుట్టిన గోలి మధు రైతాంగ ఉద్యమంపై స్పందించి తన కాలాన్ని ఎక్కుపెట్టి, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పదునైన చిన్నచిన్న పదాలతో 113 కవితలను వ్రాసి చైతన్యాన్ని రగుల్కొల్పే కృషి చేసినందుకు హృదయపూర్వక అభినందనలు.
2. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం 10 నెలలుగా అవిశ్రాంతంగా చారిత్రాత్మకమైన ఉద్యమాన్ని సాగిస్తున్నారు. మన దేశంలో రైతాంగ ఉద్యమాలకు 150 సం.ల సుధీర్ఘ చరిత్ర ఉన్నది. వాటిలో కొన్నింటిని మననం చేసుకోవడం సముచితం. 1870 దశకం నుండే రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు జరిగాయి. బ్రిటిష్ ఇండియాలో వలస దోపిడీకి – అధిక పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.
తెలుగు నాట ఆంధ్ర రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమరజీవులు కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుల నాయకత్వంలో జమిందారీ వ్యవస్థ రద్దుకు శంఖారావం పూరించిన మహత్తర ఆంధ్ర రైతు రక్షణ యాత్ర 1937లో ఒరిస్సా సరిహద్దు ఇచ్ఛాపురం నుండి నాటి ఉమ్మడి మద్రాసు రాజధాని మద్రాసుకు 1512 మైళ్ళు సుధీర్ఘ పాదయాత్ర జరిగింది. హైదరాబాదు సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని, నికృష్టమైన నిజాం రాచరిక పాలనకు సమాధి కట్టాలని సాగిన వీరోచిత రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. 1954లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు రైతు – కూలీల ఆకలి యాత్ర నిర్వహించబడింది. 1980లో శరద్ జోషీ నేతృత్వంలోని సెత్కారీ సంఘటన, ఉల్లిపాయలు, చెరకు ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన,1981లో నారాయణస్వామి నాయకత్వంలో తమిళనాడులో జరిగిన ఆందోళన, 1986లో మహేంద్ర సింగ్ తికాయత్ నాయకత్వంలో విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం ఆందోళనలు జరిగాయి. దున్నే వానికి భూమి, భూసంస్కరణల చట్టం, చల్లపల్లి జమిందార్ మిగులు భూముల ఆక్రమణ ఉద్యమం లాంటి అనేక చారిత్రాత్మకమైన ఉద్యమాలు జరిగాయి.
ఈ ఉద్యమాలు, పోరాటాలు జమీందారి వ్యవస్థ నిర్మూలనకు, దోపిడీకి వ్యతిరేకంగా, రైతాంగం హక్కుల కోసం సాగిన ఉద్యమాలే. డిల్లీ, ముంబాయ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, రెండు తెలుగు రాష్టాలలో రైతాంగ ఆందోళనలు గతంలో పెద్ద ఎత్తున నిర్వహించబడ్డాయి. నేడు రైతాంగం సాగిస్తున్న ఉద్యమం ఆ కోవకు చెందినదే.
3. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు, సాగునీరు, పంట రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు రైతాంగానికి హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని పరిరక్షించి, దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన కర్తవ్యం ప్రభుత్వాలపై ఉన్నది.
4. మోడీ ప్రభుత్వం మూడు చట్టాలు తీసుకొచ్చింది. i) రైతు ఉత్ఫత్తుల వ్యాపారం & వాణిజ్యం (ప్రోత్సాహం & సహకార) చట్టం -2020, ii) ధరల హామీ & సాగు సేవలకు సంబంధించి వ్యవసాయదారుల (శక్తీకరణ & రక్షణ) ఒప్పందాల చట్టం-2020, iii) నిత్యావసర వస్తువుల సవరణ చట్టం-2020. ఈ మూడు చట్టాలను కలిపి చూడాలి, అధ్యయనం చేయాలి. అప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది, ఈ చట్టాలు రైతాంగ వ్యతిరేకమైనవి మాత్రమేకావు, 135 కోట్ల మంది దేశ ప్రజల ఆహార భద్రతకు ముప్పుతెచ్చిపెట్టేవన్న సంగతి బోధపడుతుంది. ఆ నిశితంగా పరిశీలిస్తే మొత్తం సమాజంపై పడే దుష్పలితాలను పసిగట్టవచ్చు.
5. ఈ ప్రమాదం ముంచుకొస్తున్నదని గుర్తించిన రైతాంగం మోడీ ప్రభుత్వంతో తాడవపేడో తెల్చుకోవడానికి సిద్ధమై పోరుబాట పట్టింది. కార్పోరేట్ – వ్యాపార – వాణిజ్య సంస్థలకు అనుకూలమైన, ఆహార భద్రతకు గొడ్డలి పెట్టుగా పరిణమించే మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం సంకల్పబలంతో సాగిస్తున్న ఉద్యమంలో అన్ని తరగతుల ప్రజలు భాగస్వాములు కావాలి.
6. 2020 నవంబరు 23 నుంచి మొదలైన ఈ ఉద్యమం ఎముకలు కొరికే చలిలో లక్షాలాది మంది రైతులు దేశ రాజధాని డిల్లీ మహానగరాన్ని చుట్టుముట్టి, సింగూ, టిక్రీ సరిహద్దుల్లో రోజుల తరబడి జాతీయ రహదారులను దిగ్భందన చేశారు. నాటి నుంచి వివిధ రూపాలలో సాగిస్తున్న ఉద్యమంలో 600 మందికిపైగా మరణించినా స్పందించని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తున్న ప్రభుత్వమేనా? కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 జూన్ లో ఆర్డినెన్సులు జారీ చేసి, సెప్టంబరు మధ్యలో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టారు. రైతాంగం యొక్క భవిష్యత్తుతో ముడిపడిన మూడు బిల్లులపై లోతైన అధ్యయనం, పరిశీలన చేయాల్సి ఉన్నది, సెలెక్ట్ కమిటీకి పంపమని ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండును పెడచెవినపెట్టి, ఉభయ సభలు ఆమోదించాయంటూ, రాష్ట్రపతి ఆమోద ముద్రతో వాటిని చట్టాలుగా దేశంపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నది. అసలు మోడీ ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నదా!
7. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్ధతు ధర అంశాన్ని చట్టబద్ధం చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తుంటే, వందలాది వ్యవసాయ ఉత్ఫత్తులలో కేవలం 23 ఉత్ఫత్తులకే కనీస మద్ధతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందంటూ దగా కోరు మాటలతో ఆ డిమాండుకు అంతా ప్రాధాన్యత లేదన్నట్లు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
8. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఆందోళన అంటూ దుష్ప్రచారం చేస్తూ, ఉద్యమాన్ని అణచి వేయడానికి కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ, పోలీసుల దామనకాండతో అణచివేయాలని విఫలప్రయత్నం చేస్తున్నది.
9. 1990 దశకం నుండి ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక సంస్మరణల పర్యవసానంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. అప్పుల ఊబిలో కూరుకపోయి, అవమానభారం – మనోవేదనతో దేశ వ్యాపితంగా లక్షలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వారిలో అత్యధికులు మెట్ట మరియు కరవు పీడిత ప్రాంతాల రైతులు, అందులోనూ సన్న, చిన్న, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులే ఎక్కువ మంది ఉన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి.
10. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడానికి, రైతుల ఆత్మహత్యల నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేస్తూ డా.ఎం.ఎస్.స్వామినాధన్ కమీషన్ 2006లో నివేదిక సమర్పించింది. 15 సం.లు గడచి పోయినా స్వామినాధన్ కమీషన్ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. ఉత్పత్తి వ్యయానికి అదనంగా కనీసం 50% కలిపి కనీస మద్ధతు ధరలను నిర్ణయించాలన్న అత్యంత కీలకమైన సిఫార్సును కమీషన్ చేసింది. తాను అధికారంలోకి వస్తే స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తానని వాగ్ధానం చేసిన మోడీ ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. పైపెచ్చు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ కబుర్లు చెప్పి, వ్యాపార – వాణిజ్య వర్గాలు – బడా కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లోకి రైతాంగం భవిష్యత్తును, ఆహార భద్రతను నెట్టివేస్తున్నారు.
11. ఒకే దేశం – ఒకే మార్కెట్, రైతు పండించే పంటలను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చంటూ మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. రైతాంగంలో చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులే 86% పైగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 70% పైగా కౌలురైతులున్నారు. రైతులకు స్వేచ్ఛ కల్పిస్తున్నామంటున్నారు. ఉత్ఫత్తులకు లాభసాటి మార్కెట్ దేశంలో ఎక్కడుందో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని, రవాణా చేసి లాభసాటి ధరలకు అమ్ముకోగలరా? పంట చేతికి రాగానే అమ్మి అప్పులు చెల్లించాల్సిన ఒత్తిడిలో ఉండే రైతులకు ఇది సాధ్యమా! అనుభవాలేమి చెబుతున్నాయి, తమ ఉత్ఫత్తులకు గిట్టుబాటు ధరలు కాదు కదా కడకు రవాణా ఖర్చులు కూడా లభించక టమోటాలు, ఉల్లిపాయలు రోడ్లపై పారబోసిన ఉదంతాలెన్నో చూశాం.
12. రైతులు, వ్యాపార – వాణిజ్య సంస్థలు, వ్యక్తుల మధ్య కుదుర్చుకొనే ఒప్పందాలను న్యాయ వ్యవస్థ పరిథి నుండి తప్పించి, కార్యనిర్వాహక వ్యవస్థలో భాగమైన సబ్ డివిజినల్ అధికారి, కలెక్టర్ల పరిథిలో వివాదాలను పరిష్కరించుకోవాలని నూతన చట్టాల్లో పొందుపరచారు. న్యాయస్థానాలను ఆశ్రయించి, న్యాయం పొందే రాజ్యాంగబద్ధమైన హక్కును కూడా కాలరాస్తూ పార్లమెంటు చట్టం చేయడం గర్హనీయం.
13. నిత్యావసర సరుకుల నిల్వపై ఉన్న నియంత్రణలను తొలగిస్తే అక్రమ నిల్వలు చేసి, కృత్రిమ కొరత సృష్టించి, ధరలను పెంచి, వినియోగదారులను దోపిడీ చేయడానికి మార్కెట్ శక్తులకు స్వేచ్చా కల్పించడం ద్వారా బడా వ్యాపారులు, కార్పోరేట్ సంస్థలు, రీటేల్ రంగంలో రాజ్యమేలుతున్న సూపర్ మార్కెట్ యాజమాన్యాలకు చట్టబద్ధంగా అవకాశం కల్పించడమే అవుతుంది. గడచిన ఏడాది కాలంలో 20 నుండి 48% పెరిగిన వేరుశెనగ, సోయాబీన్, సన్ ప్లవర్ మరియు పామ్ ఆయిల్, తదితర వంట నూనెలు ధరల పెరుగుదలే దీనికి ప్రబల నిదర్శనం. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం-2020 ద్వారా ఆహార భద్రతకు మోడీ ప్రభుత్వం ప్రమాదం తెచ్చిపెడుతున్నది.
ఇది రైతుల పోరాటం మాత్రమే కాదు – దేశ ప్రజలందరి పోరాటం.