(రేపు గురజాడ జయంతి)
ఆధునిక తెలుగు సాహిత్య తొలి మహాకవి గురజాడ అప్పారావు (సెప్టెంబర్ 21, 1862-నవంర్ 30, 1915) ’దేశభక్తి‘ అనే గేయాన్ని రచించారు. ‘దేశభక్తి’ అనే మాటకు ఇంతవరకు సరైన నిర్వచనం లేదు.
దేశభక్తి ని ఇంగ్లీష్ లో పేట్రియాటిజమ్ (patriatism)అని అనుకుంటే, ఈ మాటకు Oxford online dictionary ప్రకారం అర్థం Love for your country and desire to defend it (మీ దేశం మీద మీకు ఉన్న అభిమానం, మీ దేశాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం). బాగుంది, మరి ఇందులో కూడా ఒక సమస్య ఉంది. ఇపుడు దేశమంటే ఏమిటో తెలుసుకోవాలి. దానికొక అర్థం కనుక్కోవాలి.
నిజానికి సోషియాలజీలో, హిస్టరీ పుస్తకాలలో కూడా దేశం,దేశభక్తికి అందరికి అర్థమయ్యే నిర్వచనం కనిపించదు. కాకపోతే భౌగోళిక శాస్త్రంలోనయితే, ఒక మ్యాపు చూపి ఇది ఫలానా దేశం చెబుతారు. మనం నమ్మాలి. ఆ మ్యాపు మీద ఉన్న అభిమానమే దేశభక్తి అని ఆక్స్ ఫోర్డ్ డిక్షనరీ ప్రకారం భావించుకోవాలి. అంతగా చదవు సందెలు లేని సాధారణ వ్యక్తులకు అర్థం కాని నిర్వచనం.
అలాంటి వాళ్లకి కూడ అర్థమయ్యే విధంగా దేశభక్తిని నిర్వించిన వాడు గురజాడ వేంకట అప్పారావు. ఆయన నిర్వచం నిత్యం మనం మాట్లాడుకునే మాటల్లోఉండటమే కాదు, పాడుకునేలా చక్కగా విశదీకరించాడు.
ఇటీవల దేశభక్తితో పాటు మరొక మాట బాగా పాపులర్ అయింది. నిజానికి ఎపుడో బ్రిటిష్ వాళ్ల కాలంలో ఎక్కడబడితే అక్కడ వినిపించిన మాట అది. అదే ‘దేశద్రోహం’ (Sedition).
ఇపుడు దేశంలో ప్రశ్నించిన ప్రతివాడి మీద దేశద్రోహిగా ముద్రపడుతూ ఉంది. ఒక వ్యంగ్య చిత్రం గీసినా, వ్యంగ్య వ్యాఖ్య చేసిన , ఇలాంటి గీతలాను రాతనుషేర్ చేసిన దేశద్రోహం కేసులు పడుతున్నాయి.
ఎపుడో బ్రిటిష్ వాడు తీసుకువచ్చిన ఈ సెడిషన్ చట్టాన్ని ఇపుడు దేశపౌరుల మీద ప్రయోగించడం ఏమిటి చాలా మంది మంది ప్రశ్నిస్తున్నారు కూడా?అసలు దేశద్రోహం అనే మాటనే రద్దు చేయాలనే అంశాన్ని సుప్రీంకోర్డు పరిశీలిస్తోంది. ఇది వేరే విషయం.
మళ్లీ ‘దేశభక్తి’ దగ్గరకువస్తే, గురజాడ చాలా సింపుల్ గా ఈ మాటని నిర్వచించారు. ఆయన చెప్పిన దేశభక్తి ని పాటిస్తే దేశం శాంతియుత వాతావరణంతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో విరాజిల్లు తుంది.
ఇపుడు సోషల్ మీడియాలో, కొన్ని రాజకీయపార్టీల దృష్టిలో ప్రచారమవుతున్న దేశభక్తి లో మనిషి, మానవత లేవు. అంతా వైషమ్యం, కక్ష, పగ సాధింపు, అబద్దాలు, వక్రీకరణ, హింస ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితి గురజాడ మహాకవి 1910లోనే వూహించారు. తన ‘దేశభక్తి’ నిర్వచనంలో ఆయన ఈ విషయం కూడా ప్రస్తావించారు. దేశానికి ఆనవాళ్లుఅయిన మ్యాపులు మారుతూ ఉంటాయి. భూభాగాలు కలిసినా, విడిపోయినా మ్యాప్ ఆకారం మారిపోతుంది. అందుకే ఒక దేశం మ్యాపు అధారంగా దేశభక్తి ని నిర్ధారించలేము. ఈ కన్ ఫ్యూజన్ లేకుండా చేసేందుకు గురజాడ అప్పారావు దేశానికి కొలబద్ద మట్లి (భూభాగం) కాదు మనుషులోయ్ అన్నాడు.
ఆ రోజుల్లోనే గురజాడ ‘దేశభక్తి ’ గేయం గొప్ప మానవతా వాదం ప్రచారం చేసింది. అది సరిహద్దులు మానవతా వాదం ప్రచారం చేసింది. మనిషికి, మనిషి ఆయురారోగ్యాలకు పెద్ద పీట వేసింది. ఆహారం గురించి మాట్టాడింది. దేశీయ ఉత్పత్తి గురించి మాట్లాడింది.
ఇపుడు ప్రచారం మవుతున్న వైషమ్యానికి గురజాడ ‘దేశభక్తి’ విరుగుడు ఈ గేయంలో ఉన్నందునే ఇది 110 సంవత్సరాల కిందటిదైనా ఇపుడు మనస్సాక్షి ఉన్నవాళ్లంతా ఈ గేయాన్ని మననం చేసుకుంటున్నారు.
అందుకే ఉన్నట్లుండి ఇపుడు ‘దేశభక్తి’ వైరలవుతున్నది. ఈ సందర్భంగా ఈ గేయాన్ని మరొక సారి చదువుకుందాం, పాడుకుందాం.
దేశభక్తి-గురజాడ
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా.
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !
పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువ్వు పాటుపడవోయ్,
తిండి కలిగితే కండకలదోయ్
కండగలవాడేను మనిషోయ్ !
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్ ?
బల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్ !
అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
దేశి సరుకులు నమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !
వెనుక చూచిన కార్యమేమోయ్
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుకపడితే వెనెకెనోయ్ !
పూను స్పర్ధను విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధకలహం పెంచబోకోయ్
కత్తివైరం కాల్చవోయ్ !
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కదోయ్
ఒకరిమేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !
సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్ !
చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్ !
మతం వేరైతేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే
జాత మన్నది లేచి పెరిగీ
లోకమున రాణీంచునోయ్ !
దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనంపంటలు పండవలెనోయ్ !
ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోయ్,
పలుకులను విని, దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్…