తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి ఎపుడు ప్రవేశిస్తారు? అనేది ఇపుడు పెద్ద చర్చల్లోని అంశం.అపుడుపుడు ఇది చర్చకువస్తూ ఉంటుంది. టివిల్లో పెద్దగా పెద్దగా డిబేట్లు నడుస్తుంటాయి. ఎంతగా నడుస్తుంటాయంటే, ఈ చర్చని కావాలనే సృష్టిస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే మరుసటి రోజే ఇది మాయమవుతుంది
ఒకటి మాత్రం నిజం ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయరాజకీయాలకల ఉంది. అయితే, జాతీయ నేత కళ ఉన్నవాడు కూడు. మూడుకోట్ల తెలంగాణ ప్రజలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి, తిరుగులే ని అధిక్యతతో ఆయన ఎన్నికల్లో గెలవడం, రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం, ఆయన చాణక్య నీతికి నిదర్శనం అని చెబుతుంటారు. తనకు జాతీయ రాజకీయాలు లక్ష్యం అని ఆయన చాలా సార్లు చెప్పకనే చెప్పారు. ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి తెలంగాణ జాతిపిత అనే పేరున్న తనను దేశమంతాతప్పక గౌరవిస్తుందని ఆయన నమ్మకం. అందుకే గత లోక్సభ ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను కూడగట్టేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఆయన ఫ్రంటులో చేరేందుకు ఎవరూ సుముఖంగా లేరు. ఆయన తమిళనాడు వెళ్లారు, కలకత్తా వెళ్లారు, ఒదిషా వెళ్లారు. బెంగుళూరు వెళ్లి జనతా దళ్ పెద్దాయన దేవేగౌడని, ఆయన కుమారుడు ,అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామిని డా కలిసి వచ్చారు. జార్ఖండ్ వెళ్ల లేదు గాని, జెఎంఎం నేతతో మాట్లాడరు. కాని ఫెడరల్ ఫ్రంటు బండి ముందుకు కదల్లేదు. వాళంతా కాంగ్రెస్ లేకుండా ఎలా ముందుకెళ్తాం అని విస్తుపోయారు. కెసిఆర్ కేమో కాంగ్రెస్ కూర్చున్న బోగీలో ఎక్కితే మోదీకి అనుమానమొస్తుందేమోనని భయం.
సరే, ఇక్కడ తెలంగాణలో ఆయన జాతీయరాజకీయాల్లోకి వెళ్లి, తెలంగాణను కుమారుడు కెటిఆర్ కు అప్పగిస్తారని అంతా భావించారు. కాని, ఎదురు దెబ్బల వల్ల ఈ ప్లాన్ అమలుకాలేదు. కేంద్రంలో మోదీ బలహీనడతాడు, ప్రతిపక్షంలో కాంగ్రెస్ లో మాయమవుతుంది అనుకుంటే, మోదీ ఇంకా బలపడ్డారు. ఇది కెసిఆర్ ను జడిపించినట్లుంది. దానికి తోడు ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖులంతా ప్రధాని పదవి మీద కన్నేశారు. ముమతాబెనర్జీ, శరద్ పవార్ లు ఆయా రాష్ట్రాల్లో కెసిఆర్ లాగే పలుకుబడి ఉన్నోళ్లు. అందువల్ల కెసిఆర్ ఫెడరల్ ఫ్రంటు అంటే వాళ్లు చూద్దాం లేండి అని చెప్పి పంపారు తప్ప ఎగిరి గంతేయలేదు. అందులో బెంగాల్ నుంచి బిజెపిని తరిమేస్తున్న మమతా బెనర్జీ కి ప్రధాని కలలు బాగా ఎక్కువయ్యాయి. ఆమె మోదీని ఢిల్లీనుంచి తరిమేయాలన్నంత కోపంగా ఉన్నారు.
ఇక తెలంగాణలో ‘కెసిఆర్ ప్ర్రైమ్ మినిస్టర్’ అనే నినాదమీయడం కూడా మానేశారు. దేవేగౌడ ప్రధాని అయినపుడు కెసిఆర్ ఎందుకు కాకూడదన్న వాళ్లుకూడా ఇపుడు కనుమరుగయ్యారు.
తెలంగాణలో టిఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్ బిజెపిలు చెబుతున్నాయి. బిజపి అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశాలకు విపరీతంగా వస్తున్న జనాన్ని వాళ్లు సాక్ష్యం చూపుడుతున్నారు. వీళ్లిద్దరి రాకతో, . కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకనే వాళ్లకి బిజెపి, కాంగ్రెస్ మీద మళ్లీ ఆశలు చిగురిస్తాయి. అపుడు ఈ రెండు పార్టీల నుంచి కెసిఆర్ కు గట్టి పోటీ ఉంటుంది. దీని గమనించే దళిత బంధు వంటి కాస్ట్లీ ఉచితాల మీద డిమాండు పెరుగుతూ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే కెసిఆర్ శక్తినంతా కూడదీసుకోవలసి వస్తుంది. అసలు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా అని కూడా కొందరంటున్నారు. అసలు కేసిఆర్ వ్యూహమేంటి?
ఈ నేపథ్యంలో కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వస్తుందా అనే అనుమానం వస్తుంది. కెసిఆర్ మకాం ఢిల్లీకి మారాలంటే, ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన సత్తా నిరూపించుకోవాలి. దీని మీద ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారో చదవండి.
“శరద్‌పవార్ కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం చాలా ఆతృతతో ఉన్నారు. కేజ్రీవాల్ విషయానికి వస్తే 2024 లోక్సభ ఎన్నికల తర్వాతే ఆయన అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది.
“కానీ కేసీఆర్ 2023 డిసెంబర్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేయాల్సి ఉంది. ఆ ఎన్నికల తర్వాత మాత్రమే తాను ఎక్కడ ఉంటాననే విషయం కేసీఆర్‌కు అర్థమవుతుంది.
“ఒకవేళ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమిపాలైతే.. ఆయనకు నేషనల్ పాలిటిక్స్‌పై అంతగా ఆశలు ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ కోరుకుంటే.. అది నరేంద్రమోడీకి వ్యతిరేకంగా వెళ్లడమే అవుతుంది. బీజేపీని వ్యతిరేకించి కేసీఆర్ సాధించేదేమిటి? అనేది ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న.
“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు ప్రధాన ప్రత్యర్థి కదా? అందువల్ల మమతాబెనర్జీ, శరద్‌పవార్, కేజ్రీవాల్ చేసినట్టుగా కేసీఆర్ చేస్తే అందులో ఎలాంటి లాజిక్ ఉండబోదు. అలాగే రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ఉమ్మడి నాయకుడిగా చూడాలని కూడా కేసీఆర్ కచ్చితంగా అనుకోకపోవచ్చు. అందువల్ల తన ప్రత్యర్థులతో ఆయన ఎందుకు కలుస్తారు? ఈ కారణాల వల్ల నేషనల్ పాలిటిక్స్‌లోకి కేసీఆర్ వెళ్లాల్సిన సరైన టైం ఇది కాదు. ఒకవేళ అలా చేస్తే మాత్రం నీళ్లు లేని స్విమ్మింగ్‌పూల్‌లోకి జంప్ చేసినట్టే భావించాలి.”