(రాఘవ శర్మ)
ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, సినీ నటుడు కాకరాలను తిరుపతి సాహితీమిత్రులు శనివారం సాయంత్రం పరామర్శించి, ఆయనను ఘనంగా సన్మానించారు. తిరుపతిలో ప్రముఖ ఫిజియోతెరఫిస్టు, ఆక్యుపంచర్ వైద్యులు డాక్టర్ బాలాజీ వద్ద నెల రోజులుగా చికిత్స పొందుతున్న కాకరాల ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతున్న సందర్భంగా ఆయనతో తిరుపతి సాహితీ వేత్తల ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు కాకరాలతో అనేక విషయాలు ముచ్చటించారు. ఆయన సినీ, రంగస్థల అనుభవాలు, మార్కిస్టు ప్రాపంచిక దృక్ఫథం గురించి అడిగి తెలుసుకున్నారు. కాకరాల జీవితంలో ఆయనకు దారిదీపంలా ఉన్న ఆయన సహచరి సూర్యాకాంతం కొద్ది నెలల క్రితం మృతి చెందారు. అందరూ అమ్మా అని పిలిచే సూర్యాకాంతం మృతి చెందాక శనివారం ఆమె తొలి జయంతి కావడం యాదృశ్చికం. ఈ సందర్భంగా తన సహచరితో ఉన్న ఆలోచనానుబంధాలను కాకరాల మననం చేసుకున్నారు.
కాకరాల తన జీవన యానాన్ని సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మతో ఇటీవలే పంచుకున్నారు. ఈ నేపథ్యంలో కాకరాల తన ఆత్మకథను మరింత వివరంగా రాయడానికి ఉపక్రమించారు. తన జీవితానికి మార్గదర్శకులైన గరికపాటి రాజారావు జీవిత చరిత్రను కూడా తదనంతరం రాయాలన్న సంకల్పాన్ని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా అరసం అధ్యక్షవర్గ సభ్యులు సాకం నాగరాజ ఆధ్వర్యంలో కాకరాలను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు గంగ వరం శ్రీదేవి, శంకరంబాడి సాహితీ పీఠం అధ్యక్షులు డాక్టర్ డి.మస్తానమ్మ, ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ తమటం రామచంద్రారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ , సాహితీ మిత్రులు బొందు రామచంద్రారెడ్డి, వాకాప్రసాద్, పేరూరు బాలసుబ్రమణ్యం, డాక్టర్ నాగలూరు దయాకర్, జగన్, టెంకాయల దామోదరం,అక్కపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్లొన్నారు.