చివరి రోజున శ్రీ సీతారామ అలంకార కల్యాణం
లోక సంక్షేమం కోసం, చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల వసంత మండపంలో జరుగుతున్న షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష సెప్టెంబరు 18వ తేదీన శనివారం ముగియనుంది. చివరిరోజు శ్రీ సీతారామ అలంకార సంగీత కల్యాణం నిర్వహిస్తారు.
లోక సంక్షేమం కోసం, కరోనా మూడవ వేవ్ ప్రత్యేకించి చిన్న పిల్లలపైన ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉన్నదని ప్రభుత్వాలు, వైద్య సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తలపెట్టిన షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష తిరుమలలోని వసంత మండపంలో ఈ నెల 3 శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.
బాలకాండలో ” బభౌరామఃసంప్రహృష్టఃసర్వదైవతైః ” అనే 16 అక్షరాల వాక్యం విశిష్టమైనది. ఇందులోని బీజాక్షరాల ప్రకారం బాలకాండలోని మొత్తం 77 సర్గల్లో గల 2,232 శ్లోకాలను పారాయణం చేస్తున్నారు. వసంత మండపంలో 16 మంది పండితులు శ్లోక పారాయణం చేస్తుండగా ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీ రామచంద్రమూర్తి మూల మంత్ర జప-తర్పణ- హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కాగా, చివరిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీ సీతారామ అలంకార సంగీత కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.