తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరణకు గురవుతూ ఉంది
(వడ్డేపల్లి మల్లేశం)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నవాబు నిరంకుశత్వానికి, రజాకార్ల రాక్షసత్వానికి, పటేల్ పట్వారీ జమీందార్ల, జాగీర్దార్ల, దేశ్ ముఖ్ ల దురాగతాలకు అడ్డుకట్టవేసి ప్రజా ప్రభుత్వం కోసం సాగింది. భూమి, భుక్తి, విముక్తి ఈ పోరాట లక్ష్యం.
అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే 1946 జూలై 4న తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అమరత్వం తర్వాత ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో వీరవనితలు, వీర కిశోరాలు 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాము నుండి విముక్తి కోసం పోరాటం చేస్తే, 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ 21న తెలంగాణ పోరాటం విరమించే రోజు వరకు చేసిన పోరాటం అంతా పోలీసు మిలిటరీ కేంద్ర బలగాల అకృత్యాలను అడ్డుకోవడానికి జరిగింది.
సెప్టెంబర్ 17 విమోచన ఎలా అవుతుంది?
1930 లో జోగిపేట లో జరిగిన తొలి ఆంధ్ర మహాసభ సురవరం ప్రతాపరెడ్డి నాయకత్వంలో జరిగితే హైదరాబాద్ సంస్థానం లో పాఠశాలలు, విద్య, సంస్కృతి విచ్ఛిన్నమైన ప్రజా జీవనాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రమహాసభ నాయకత్వంలో నిరంతరం పోరాటం చేస్తూ వచ్చారు.
1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన 15వ ఆంధ్ర మహాసభ సమావేశంలో నిజాం నిరంకుశత్వం ,రజాకార్ల, జమీందారులు దేశ్ముఖ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా దున్నేవాడిదే భూమి కావాలని, వెట్టిచాకిరి రద్దు ,తెలుగులో విద్యాబోధన, గ్రంథాలయాలను స్థాపించాలి అనే డిమాండ్ల తో ప్రజలు ఆంధ్ర మహాసభ వైపు మొగ్గు చూపారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలలో ఉర్దూ మాతృభాషగా బోధించడం వల్ల భాషా సంస్కృతి నాశనమైపోయింది. ఒకవైపు ప్రభుత్వం పైన తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తూనే మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఇతర ప్రజా సంఘాలు కలిసి నాలుగు వేల పాఠశాలలు తెలుగులో ఏర్పాటు చేసి తెలుగు భాషా వికాసానికి కృషి చేసినారు.
నిజాం అద్వర్యం లో ఐదు కోట్ల 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే ఇందులో మూడు కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమిగా శిస్తు ఉండేది కాదు . కోటిన్నర ఎకరాల భూమి జాగిర్దారు వ్యవస్థ కింద, 10 శాతం భూమి నిజాం పేరు మీదుగా ఉండేది. ఈ భూమి మీద ప్రతియేటా వచ్చే రెండు కోట్ల ఆదాయాన్ని తన ఖర్చులకు వాడగా ఇది కాకుండా 70 లక్షలు ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసేవారు . అంటే నైజాం దోపిడి విధానం కొనసాగిన తీరును మనం గమనించవచ్చు.
ప్రభుత్వ నిరంకుశత్వానికి, పన్నులకు భూమిపై హక్కులకోసం బానిసత్వం వెట్టి చాకిరి, మహిళలపై అమానుషత్వం అత్యాచారాలు ఆగడాలు, పంటలను దోచుకోవడం వంటి చర్యలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాటం జరిగినది.
1940 నుండి 44 వరకు 60 గ్రామాలకు అధిపతి అయిన విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు స్థానిక ప్రజలు, వీరవనితలు, కార్మికులు ఎదురొడ్డి నిలిచినారు. పాలకుర్తి చాకలి ఐలమ్మ తను కౌలుకు తీసుకున్న 40 ఎకరాల భూముల్లో పండించిన పంటను రామచంద్రారెడ్డి గూండాలు దాడి చేసి దూసుకెళ్లడానికి ప్రయత్నిస్తే ఆంధ్ర మహాసభలో సభ్యులైన చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమల, రామచంద్రారెడ్డి ,యాదగిరి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, నాయకత్వంలో గూండాలను తరిమికొట్టి పంటను ఇంటికి చేర్చి వారి ఆగడాలను అడ్డుకోవడమే కాకుండా అడ్డువచ్చిన పాలకుర్తి పట్వారీ 90 ఎకరాల భూమిని కూడా ప్రజలకు పంచి పెట్టారు.
మరోవైపు కడివెండి లో రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ దొర అని పిలిపించుకుo టూ పండించిన పంటను అక్రమంగా దోచుకుంటే నల్ల నరసింహులు దొడ్డి కొమురయ్య మోహన్ రెడ్డి నాయకత్వంలో దోపిడిని వ్యతిరేకిస్తూ జరిపిన ఊరేగింపులో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్య భూస్వామి గుండాల తూటాలకు నేలకొరిగాడు.
అది 1946 జూలై 4వ తేదీ. దొడ్డి కొమురయ్య అమరత్వంతో ప్రజా పోరాటం సాయుధ రూపంగా మారింది. ఎక్కడికక్కడ గ్రామాలలో ప్రజలు, కూలీలు ,కార్మికులు ,ఆంధ్ర మహాసభ నాయకత్వంలో సంఘాలుగా ఏర్పడి
గుత్పలు, కారంపొడి ,బందూకులతో రజాకార్లు స్థానిక పటేల్ పట్వారి భూస్వాములు జమీందార్ల పైన దాడి చేసి ఎక్కడికక్కడ తరిమికొట్టారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు భూస్వాములు నిజాం రాజుకు చేరవేస్తే అనేక ప్రాంతాలలో పోలీసు శిబిరాలను ఏర్పరిచి రజాకార్లు పోలీసులు కలిసి గ్రామాలపై పడి అనేక అకృత్యాలకు పాల్పడే వారు.
నిజాం కాలంలోని కొన్ని దురాగతాలు
– కాటూరు ఎలమర్రు గ్రామాలలో మహిళలపై దాడి చేసి వివస్త్రగా మార్చి గాంధీ విగ్రహం చుట్టూ బతుకమ్మ ఆడించి అత్యాచారాలకు పాల్పడ్డారు.
– నాటి నల్లగొండ జిల్లా బైరాన్పల్లి, ప్రక్కనున్న కూటిగల్ గ్రామాలలో 118 మందిని పోలీసులు రజాకార్లు కలిసి పొట్టన పెట్టుకున్నారు. బైరాన్ పల్లి బురుజు ముందు మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించి అత్యాచారాలకు పాల్పడ్డారు.1948 ఆగస్టు 27 న.
– పాలకుర్తిలో చాకలి ఐలమ్మ కొడుకులను జైల్లో పెట్టి కూతురు పై అత్యాచారం చేసి అనేకసార్లు హత్యాప్రయత్నం చేశారు.
ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీలు గెరిల్లా పోరాటం ద్వారా నిజాం రాజు ని మినహాయించి భూస్వాములు జమీందార్లు పటేల్ పట్వారీలు రజాకార్లను తరిమి కొడితే భూస్వాముల భూములు ఆస్తులు వదిలి పట్టణాలకు తరలిపోతే తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా మూడు వేల గ్రామాలు విముక్తి చెంది గ్రామ స్వరాజ్య ఏర్పడితే ఆక్రమించుకున్న పది లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేశారు.
ఈ క్రమంలో ఆగస్టు 15 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తే నిజాం రాజు తనకుతానే స్వతంత్ర దేశం గా ప్రకటించుకుని కేంద్రంతో రాయబారాలు చేసి ప్రజా ఉద్యమాలను విచ్చిన్నం చేయడానికి చేసిన కుట్రను కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో
చేధించారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు నాటి నెహ్రూ ప్రభుత్వం తో ఇక్కడి భూస్వాములు జాగీర్దార్ల కు రక్షణ లేదని చేసిన ఫిర్యాదు మేరకు నిజామును గద్దె దించే నెపము తో 1948 సెప్టెంబర్ 13 వ తేదీన తెలంగాణ ప్రాంతానికి చేరుకున్న కేంద్ర బలగాలు ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించగా సెప్టెంబర్ 17 వ తేదీన నిజాం రాజు లొంగిపోయాడు.
లొంగిపోయిన నిజాం రాజు తన అధికారాన్ని ఆస్తులను ప్రజలకు కట్టబెట్ట కపోగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులు మిలటరీ ప్రభుత్వాన్ని1952 వరకు కొనసాగించడం రాజు లొంగిపోయిన తర్వాత కూడా మిలటరీ బలగాలు దురాగతాలు కొనసాగించిన ప్పుడు 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విమోచన ఎలా అవుతుంది?
నిజాం అనంతరం పరిస్థితి
నిజాం కాలంలో 46 నుండి 48 వరకు కొనసాగిన సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి ,బద్దం ఎల్లారెడ్డి , మొహియుద్దీన్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ల నాయకత్వంలో పోరాటం అనివార్యమైన పరిస్థితుల్లో నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు అనేకమంది వీరనారులు దళాలుగా ఏర్పడి నాయకులను వ్యవస్థను రక్షించుకున్నారు. అందులో కడివెండి గ్రామం లో ఏర్పడిన తొలి మహిళా దళం నల్ల వజ్రమ్మ ,ఎన్నెమ్మ ,గోపమ్మ, సుశీలతో కలిసి తమ నాయకులను రక్షించుకునే వారు. కాలుతున్న గడ్డివాములో కట్టి పడేయడం గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేయడం, వంటి అనేక దాష్టీకాలకు పాల్పడినవారిని ఎదుర్కోవడానికి ఎంతో మంది కార్యకర్తలను పార్టీ కోల్పోయింది.
అయితే నిరంకుశ ప్రభుత్వాల పీడ విరగడ కాలేదు సరికదా 1948 సెప్టెంబర్ 18 నుండి 1951 అక్టోబర్ 21 వరకు సాయుధ పోరాటాన్ని ముగించే దాకా పటేల్ సైన్యం నిజాం పాలనలోని క్రూరత్వం కంటే ఎక్కువగా రక్తపుటేరుల తో ముంచెత్తింది. మొత్తము నాలుగు వేల మంది కార్యకర్తలను కమ్యూనిస్టు పార్టీ కోల్పోతే అందులో సగానికంటే ఎక్కువ మందిని చంపింది పటేల్ సైన్యమే.
పదివేల మంది కార్యకర్తలు నిర్బంధాల పాలై జైల్ల చుట్టూ తిరిగితే రజాకార్లతోని ,పోలీసులు ,యూనియన్ సైన్యం చేతిలో 50 వేల మంది మహిళలు అత్యాచారాలు ,అవమానాలు, అమానుషత్వాన్ని కి బలైయ్యారు.
దొడ్డి కొమురయ్య అమరత్వము నుండి నిజాం రాజు లొంగిపోయే వరకు జరిగిన హత్యలు అమానుషాలు , అత్యాచారాలు దోపిడీలకంటే కేంద్ర సైన్యం చేతిలో పరిపాలన కొనసాగిన కాలంలోనే కార్యకర్తల ఊచకోత
హత్యలు కాల్పులు ఎక్కువగా జరిగినాయి. రజాకార్ల అణచివేత పేరుతో పటేల్ సైన్యం లక్షల మంది ముస్లింలను ఊచకోత కోసింది.
ఇప్పుడు ఆలోచించండి నిజాం లొంగిపోయిన సెప్టెంబర్ 17 తెలంగాణకు విమోచన దినమేనా? అదే విమోచన దినం అయితే తరువాత సాగిన మారణకాండ సంగతి ఏమిటి?
మరొక వాదన కూడా కొనసాగుతున్నది. నిజాం రాజు ముస్లిం కావచ్చు కానీ, ప్రైవేటు సైన్యం రజాకార్ల లో ఎక్కువ మంది, పటేల్ పట్వారీలు దొరలు భూస్వాములు అంతా కూడా అగ్రవర్ణాలకు చెందిన హిందువులే.
నిజాముకు వ్యతిరేకంగా పోరాడిన దళాల లోనూ ముస్లిం వాళ్ళు ఉన్న విషయాన్ని గుర్తించాలి. కమ్యూనిస్టు నాయకులు మగ్దూం మొహియుద్దీన్, ఇమ్రోజ్ పత్రిక సంపాదకులు షోయబుల్లాఖాన్ నిజాం రాజు దాష్టీకానికి బలైన వాల్లే.
కేంద్రం సైన్యాలు రావడమంటే ఏమిటో తెలుసా?
సెప్టెంబర్ 17 వ తేదీన నిజాం రాజు లొంగి పోయిన తరువాత ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కేంద్రం చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. దీనిని రెండు రకాలుగా చూడాలి.
1) నిజాం రాజు ను అణచి ప్రజల సంక్షేమం కోసమే కేంద్ర బలగాలు వస్తే నిజాము భూములను ఆస్తులను తిరిగి అతనికె కట్టబెట్టడం లోని ఆంతర్యం ఏమిటి? కాకుండా కేంద్ర ప్రభుత్వం రాజభరణాలు మంజూరు చేసి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడం వెనుక దాగిన రహస్యం ఏమిటి?
– లొంగిపోయిన తర్వాత కూడా నిజాం రాజు నే రాజప్రముఖ్ గకేంద్రం నియమించి 1956 నవంబరు 1 దాకా కొనసాగించడం ప్రజా పాలన పై కేంద్రానికి చిత్తశుద్ధి లేకపోవడమే కదా?
– అంతేకాకుండా డోలాయమాన స్థితిలో ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదనే తెలంగాణ పాలన యావత్తు 1950 జనవరి 26 దాకా కొనసాగించడం ప్రజాస్వామిక ప్రభుత్వానికి తగునా?
– మిలిటరీ ప్రభుత్వంలో కేంద్ర బలగాల కనుసన్నల్లో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న దురాగతాలను చూడలేక సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ జయసూర్య నాటి గవర్నర్ జె.ఎన్.చౌదరి ని కలిసి ఉద్యమకారులతో చర్చలు జరపాలని సూచించిన ఆ ప్రతిపాదనను నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించడం ప్రజలను పీల్చిపిప్పి చేయడానికేనా?
– వెంటనే ప్రజా ప్రభుత్వాన్ని తీసుకు రాకపోవడం లోని ఆంతర్యం ఏమిటి?
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది .కనుక ప్రజా ప్రభుత్వం తీసుకువస్తే కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ నాయకత్వంలోకి వస్తుందోనని కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భయమే కారణం కావచ్చు నా?
– నిజాం కాలంలో 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు దారాదత్తం చేస్తే, దొరలను తరిమి కొడితే కేంద్రం ఆధ్వర్యంలోని మిలిటరీ ప్రభుత్వం గ్రామాలపై బడి, భూములను తిరిగి ఆక్రమించుకొని ,ఊచకోత కోసి, దొరలకు, దేశ్ ముఖ్ లకు భూస్వాములకు అప్పగించి విప్లవాన్ని విచ్ఛిన్నం చేయడంలో ప్రజల వైపా ?దొరల వైపా ?తేలిపోయింది.
2) తక్షణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం లోని రెండవ కారణం. ఉద్యమం అంతా చేపట్టింది కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కొంత కొనసాగినప్పటికీ అది ప్రజలను ప్రభావితం చేయలేకపోయింది.
మరొక విషయం గ్రామాల నుండి దొరలు, పటేళ్లు, పట్వారీలు, భూస్వాములు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తరిమి వేయబడిన విషయాన్ని నాటి కాంగ్రెస్ నాయకులు కె.వి.రంగారెడ్డి ,బూర్గుల రామకృష్ణారావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వానికి తెలంగాణలో భూస్వాములు ,దొరలు, పటేల్లకు రక్షణ లేదనే విషయాన్ని తెలుపగా నెహ్రూ ప్రభుత్వం వీరికి ఇచ్చిన హామీ మేరకు 1952 వరకు ప్రజా ప్రభుత్వం లేకుండా నిలువరించ గలిగింది.
ఆంగ్లేయుల రాచరిక వ్యవస్థ నుండి విముక్తి చెందిన భారతదేశం ప్రజాస్వామిక దేశంగా రూపుదిద్దుకున్న ప్పటికీ తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తీసుకు రాకపోవడాన్ని విజ్ఞులు ఇప్పటికైనా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ హామీ లోని భాగమే నాటి హోం మంత్రి పటేల్ సైన్యాలను పంపించి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు.
పటేల్ పంపించిన సైన్యాలు కేవలం రాజు ను అణిచి వేయడానికి అయితే తిరిగి వెంటనే వెళ్లాలి కదా. వెళ్లకుండా 1951 అక్టోబర్ 21 వరకు కమ్యూనిస్టులపై ఊచకోత కోసి తన అక్కసు తీసుకున్నది.
ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేసిన, ప్రజలను ఊచకోత కోసిన కేంద్రం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుంది? విజ్ఞులు పై రెండు కారణాలను పరిశీలించి చరిత్రను వక్రీకరిస్తున్నారనే వారిని ప్రశ్నించ వలసిన అవసరం ఉంది.
వీర తెలంగాణ విప్లవ ఉద్యమం సాధించిన సామాజిక చైతన్యాన్ని సమానత్వాన్ని విచ్ఛిన్నం చేసిన కేంద్ర బలగాలతో కూడిన ప్రభుత్వంతో కమ్యూనిస్టు నాయకత్వం లో 47 సెప్టెంబర్ 11న ఇచ్చిన పిలుపుతో ప్రారంభమైన తెలంగాణ పోరాటము మరింత గెరిల్లా పద్ధతిలో కొనసాగడం వల్లనే ప్రజానీకాన్ని రక్షించుకో గలిగిన ప్పటికీ భూములు తిరిగి భూస్వాముల చేతికి చిక్కడం, పాలన నిరంకుశత్వం కిందికి రావడం ఆందోళన కలిగించే విషయం.
1948 సెప్టెంబర్ 17ను అర్థం చేసుకోవడం ఎలా?
1 948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాజ్యం, అందులో తెలంగాణ చిత్రపటం చెదిరిన రోజు. అంతేకాకుండా ఆంధ్రా వాళ్ళ నాయకత్వంలో 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏర్పడడానికి పునాది పడిన రోజుగా భావించవచ్చు.
1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం పంతులు నాయకత్వంలోని ప్రభుత్వం రైతు ఉద్యమాలను తిరుగుబాట్లను అణచి వేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసా గించడానికి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకోవడం అదే క్రమంలో కేంద్ర బలగాలు రావడంతో సాయుధ పోరాటం తీవ్రమైన ఒత్తిడికి ప్రభావానికి గురి అయింది.
ఈ విషయాన్ని నేటి సమాజం ,యువత అర్థం చేసుకోవడం ద్వారా చారిత్రక కోణం లో నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో అన్వయించుకోవడం మార్పులను బేరీజు వేసుకో వలసిన అవసరం ఉన్నది.
చారిత్రక కోణంలో ఆలోచించినప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైనా ఉన్నత వర్గాల వైపు అనేది సుస్పష్టం. ఆ పని నాటి కేంద్ర ప్రభుత్వమే కాదు నేటి రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా అదే వైఖరి కొనసాగించు చున్నవి. చారిత్రక వారసత్వ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నాటి స్ఫూర్తిని పాలకులు గాని ప్రజలు గాని గుర్తించకపోవడం ఆందోళన కలిగించే విషయం. హామీలతో ,ప్రలోభాలతో ప్రజలను మభ్యపెట్టడం నియంతృత్వ విధానాలతో ప్రజల పై అధికారాన్ని చెలాయించడం నాడు నిజాం రాజ్యము లోనూ, అనంతరం మిలిటరీ రాజ్యము లోనూ కొనసాగగా నేడు దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటిలో అదే విధానము కొనసాగుతున్నది.
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం భూమికోసం, నియంతృత్వ విధానాల నుండి విముక్తి కోసం ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరడం కోసం ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ చారిత్రక వారసత్వానికి నాయకత్వం వహించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఇతర వామపక్ష పార్టీలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజల సకల సమస్యల పరిష్కారంలో ప్రజలను కలుపుకొని మరో పోరాటానికి సిద్ధ పడడమే నేడు మనముందున్న కర్తవ్యం.
(ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత,
అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)