ఇది 28 ఏళ్ళ క్రితం సంగతి. అది 21-7-1993నాటి సంగతి. ఆరోజు ఉదయం సుమారు ఏడు గంటల సమయమది. స్థలం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల లోని జూట్ మిల్ గేటు సమీప ప్రాంతం. అప్పుడు ఆ ప్రాంతంలో ఇద్దరు ఆగంతకులు రైతుకూలీల వేషధారణలో అమాయకుల్లా నటిస్తూ వున్నారు. గడ్డి కోసుకునే కూలీగా ఒకరు, గడ్డి మేపుకునే పశువుల కాపరిగా మరొకరు. తలపాగాలతో ఉన్న వారి పట్ల పోలీసులకు అనుమానం రాలేదు. వారు బయటకు ఏ వృత్తిపరులుగా ఉన్నప్పటికీ, మానసికంగా రహస్య వేటగాళ్ల వృత్తిదారులే. చేపలు పట్టే వేటగాడి దృష్టి చేపల మీద కేంద్రీకృతమై ఉన్నట్లే, వారి కళ్ళు అపరాధ పరిశోధనలో మునిగివున్నాయి. ఇంతలో హఠాత్తుగా వారి “వల” వైపుకు చేప సమీపిస్తున్నట్లు అలికిడి సోకింది. కళ్ళల్లో ఆశ. చూపుల్లో ఆనందం. అక్కడ ఆ క్షణాలలో ఏమి జరిగిందో చెప్పే ముందు మరో మాట విందాం.
చైతన్యవంతులవుతోన్న నెల్లిమర్ల జూట్ కార్మికవర్గాన్ని లొంగదీసుకునేందుకు ఆ జూట్ మిల్లు మిల్లు యాజమాన్యం ప్రభుత్వ అండతో ఆకలిని ఆయుధంగా ఎంచుకుంది.
5-7-1993న మరోసారి అక్రమ లాకౌట్ ప్రకటించింది. రెండు వారాలుగా అక్రమ లాకౌటులో ఆ మిల్లు వుంది. ఐదువేల జూట్ కార్మిక కుటుంబాలు లాకౌట్ ఎత్తివేత డిమాండ్ తో ఆందోళన బాట పట్టి ఉన్నాయి. జూన్ నెలలో పని చేసిన కాలానికి జులై 10న జీతాలు చెల్లించాల్సి ఉంది. ఐనా చెల్లించలేదు. ఆరోజు జీతాల బకాయిల చెల్లింపు డిమాండ్ తో భారీ ఆందోళన జరిగింది. ఆకలిని తీర్చడం చేతగాని ప్రభుత్వ యంత్రాంగం ఆకలి ఆందోళన అణచివేత కోసం సిద్ధపడింది. అందుకే జూట్ మిల్లు ప్రాంతం పోలీస్ కాపలా మధ్య ఉంది.
ఇంటిలిజెన్స్ నిఘా పరిధిలో కూడా ఉంది. అటువైపు జూట్ కార్మికుల కదలికలపై ఆంక్షలున్నాయి. అట్టి స్థితిలో ఇఫ్టూ అనుబంధ నెల్లిమర్ల జూట్ మిల్ కార్మిక కార్మిక సంఘం (NJMKS) నాయకత్వ వ్యూహాత్మక కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ఇద్దరు జూట్ కార్మికులే పైన పేర్కొన్న ఆగంతకులు!
జూట్ మిల్లుకు ఒకింత ఉత్తర దిక్కున మేనేజ్మెంట్ క్వార్టర్స్ వైపు నుంచి మిల్లు వైపు ఓ కారు దూసుకొస్తోంది. అది మిల్లు గేటు గుండా మిల్లు లోపలకు వెళ్ళిపోయింది. ఇక అంతే! వేటగాడి వలలో చేప పడింది. మిల్లు యాజమాన్య ప్రతినిధులు RC నాయర్, నడిపిన వెంకట్రావు మరో ఇద్దరు ఆ కారులో వున్నారు. వారిని ఘెరావో చేయాలనే ఇఫ్టూ అనుబంధ నెల్లిమర్ల జూట్ మిల్ కార్మిక సంఘం రహస్య వ్యూహం ఫలించింది.
ఆ ఆగంతకులు వెంటనే తమకి ఇఫ్టూ నాయకత్వం అప్పగించిన విధంగా సైగలు చేశారు. మరికొంత దూరంలో ఓ చెట్టుమీద కూర్చొని పొంచి చూస్తున్న మరో ఆగంతకుడకి సిగ్నల్ పంపించారు. ఆ మూడో వ్యక్తి మరో వ్యక్తికి సిగ్నల్ పంపాడు.
ఇక అంతే! నెల్లిమర్ల జూటుమిల్లు కార్మిక సంఘం నాయకత్వం పన్నిన ముందస్తు వ్యూహం ప్రకారం అప్పటికే వేచి చూస్తోన్న సుమారు డజను మంది విశ్వసనీయ కార్యకర్తలు హుటాహుటిన కార్యరంగంలోకి దూకారు. ఇఫ్టూ యూనియన్ ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర రావు నేతృత్వంలో కొందరు జూట్ మిల్ గేటు వద్దకు చాలా వేగంగా చేరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సురేష్ నేతృత్వంలో ఓ కార్యకర్తల బృందం నెల్లిమర్లలో వీధుల వెంట ప్రచారం చేస్తోంది. ఓ కార్యకర్త సాయంతో ఓ బండి మీద నేను కార్మిక గ్రామాలకు వెళ్ళాను. ఇదంతా వాయువేగం తో సాగే ప్రచారం.
జూట్ మిల్లు గేటు వద్దకు చేరిన కార్యకర్తలను ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ పోలీస్ హడావుడిగా ప్రశ్నిస్తోంది. ఓ చర్చ ప్రారంభమై క్రమంగా వేడి అందుకుంటోంది. ముఖ్యంగా మిల్లుకు సమీపంలోని కార్మిక పేటలు, వీధులలో వాయువేగం తో ప్రచారకుల కృషి ఫలితంగా కార్మికజనం జూట్ మిల్లు వైపు రాసాగింది. మిల్లు గేటు వద్ద బృందాన్ని పోలీసులు అదుపు లోకి తీసుకునే ప్రయత్నం చేసే లోపే వారు అదుపుచేయలేని సంఖ్యకి మిల్లు గేటు వద్దకు కార్మికులు చేరారు. అరగంటలో ఐదువందల మందికి చేరారు. గంటలో వెయ్యిమంది దాటారు.
ఒకవైపు విజయనగరం నుండి అదనపు పోలీస్ బలగాలు వస్తున్న కొద్దీ, మరోవైపు కార్మిక గ్రామాల నుండి అదనపు శ్రామిక బలగాలు వస్తున్నాయి. ఆ మధ్యాహ్నానికి కార్మికులు, వారి కుటుంబాల స్త్రీలు కలిసి సుమారు మూడువేల మందికి చేరారు. ఈ మిల్లు ముట్టడి వార్త తెలియక ముందే రోజు కూలీలుగా విజయనగరం వెళ్లిపోయిన కార్మికులు తప్ప మిగిలిపోయిన కార్మికులు చేరారు. సాయంత్రానికి మిల్లు ప్రాంతం జనసముద్రమైనది. అందులో మహిళల పాత్ర విశేషం.
వందలాది సాయుధ పోలీసు బలగాలు గంటగంటకీ మిల్లు వద్ద మోహరిస్తూ వచ్చాయి. ఆ సాయంత్రం నుండే ఇఫ్టూ యూనియన్ మైకులు కట్టింది. మిల్లు ప్రాంతం సభావరణగా మారింది. కార్మికుల పొట్టలు కొట్టిన లాకౌట్ కుట్రపై నిరసన ప్రసంగాలతో హోరెత్తుతోంది. సంఘీభావ సందేశ పరంపరలు ముంచెత్తుతున్నాయి. ఐనా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన లేదు. పైగా పోలీసు బలగాల్ని మరింత పెంచే పనిలో మునిగింది. ఆ రాత్రికి కార్మికజనాన్ని చెదరగొట్టే వార్తలు రావడంతో అధిక సంఖ్యలో మిల్లు ముట్టడిలో భాగస్వామ్యం కావాలని కార్మికవర్గానికి నాయకత్వం పిలుపు ఇచ్చింది. ఆ రాత్రి ఇంచుమించు ఐదువేల మంది మిల్లు గేటు వద్ద జాగరణ చేశారు. అందులు రెండు వేల మంది మహిళలే. పాటలు, ప్రసంగాలు, ఇతర కళారూపాల తో రాత్రి గడిచింది.
తెల్లారింది. “నెల్లిమర్ల జూట్ మిల్ ముట్టడి” వార్తల్ని భారీ స్థాయి ఉత్కంఠ భరితంగా పత్రికలు ప్రచురించాయి. అవి చదివి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి అసంఖ్యాక జనం ఆసక్తితో తరలి వస్తోంది. పరిసర గ్రామీణ ప్రాంతాల నుండి రైతు కూలీలు వరదలా ముంచెత్తుతున్నారు. ఆ రెండో రోజు అనగా 22-7-1993వ తేదీ సాయంత్రం పరిస్థితి హఠాత్తుగా వేడెక్కి పోయింది. దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేయాల్సి ఉంది.
విజయనగరం నుండి ప్రత్యేక సాయుధ బలగాలు డజన్ల వాహనాలలో భారీగా రాసాగాయి. బాష్ప వాయు గోళాల్ని సిద్ధం చేస్తున్నాయి. అప్పుడు సుమారు 1500 మంది మహిళతో పాటు ఐదు వేలమంది వుంటారు. మధ్యలో జనం.. వారి చుట్టూ పన్నుతోన్న పోలీసు వలయం. అటు పోలీసు ఉన్నతాదికారుల సమాలోచనలు సాగుతూ ఉన్నాయి. మరోవైపు ఇఫ్టూ యూనియన్ కార్యకర్తలు ముందుచూపుతో సిద్ధం చేసి ఉంచుకున్న రెండు బస్తాల ఉల్లిపాయలను తలకొక్కటి చొప్పున శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేస్తే, దానికి విరుగుడుగా వెంటనే ఉల్లిపాయలు నలిపి వాసన పీల్చవల్సిందిగా కార్మిక జన సముద్రానికి సంకేతాలు వెళ్తున్నాయి.
ఇంకోవైపు ఈ వార్త దవానలంలా కార్మిక గ్రామాలలోకి వెళ్లి ఆబాల గోపాలం కదిలి పోయింది. మిల్లు వైపుకి జనం తుఫాను వేగంతో దూసుకొస్తోంది. (అదే లాకౌట్ కాలంలో ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన పోలీస్ కాల్పుల్లో అమరత్వం పొందిన “తుఫాను” -కాళ్ళ అప్పల సత్యనారాయణ- ఆరోజు తుఫాను వేగంతో ప్రచారక పాత్రని పోషించడం గమనార్హం) అలావేగంగా దూసుకొచ్చే జనం పోలీస్ పటిష్ట వలయాన్ని ఛేదించుకొని మిల్లు గేటు వద్ద ముట్టడి సాగిస్తోన్న జనంలోకి వచ్చేస్తోంది. చూస్తూ వుండగానే చీకటిపడే వేళకు జనం ఇంచుమించు ఎనిమిది వేలకు చేరింది. అందులో దాదాపు నలబై శాతం మంది మహిళలే కావడం విశేషం.
పై నేపథ్య స్థితిలో తుదకు పోలీస్ వర్గాలు వెనక్కి తగ్గక తప్పలేదు. అప్పటివరకు దాన్ని శాంతిభద్రతల సమస్యగా చూసిన పోలీస్ ఉన్నతాధికార్లు రాజకీయ పరిస్కారం కోసం కొత్త అవతారం ఎత్తారు. వారు దౌత్య ప్రక్రియను ప్రారంభించిన ఫలితంగా ఆ రాత్రి 10 గంటల సమయంలో ఓ అనూహ్య సంఘటన జరిగింది.
ఆనాటి అక్రమ లాకౌట్ కి కారకులని కార్మిక వర్గంలో తీవ్ర విమర్శలకు గురవుతోన్న ఆనాటి రాష్ట్ర మంత్రికి చెందిన ప్రతినిధి జూట్ మిల్లు వద్దకు చేరారు. కార్మిక సంఘం ప్రతినిధివర్గంతో సంప్రదింపులు ప్రారంభం అయ్యాయి. అర్ధరాత్రి వరకూ ఉభయపక్షాల మధ్య వేడిగా, వాడిగా చర్చలు.. తుదకు ఓ అంగీకారం.. పది రోజుల్లో జూన్ నెల జీతాల బకాయిల చెల్లింపు కి ఓ హామీ. మిల్లుని తెరిపించే దిశలో కలకత్తాలోని ఉన్నత స్థాయి మిల్లు యాజమాన్య ప్రతినిధుల్ని రప్పించి కార్మిక మంత్రి సమక్షంలో చర్చల ఏర్పాటుకు మరో హామీ… మంత్రి దూత నుండి లభించిన ఈ రెండు హామీలతో కొలిక్కి వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత వేలాదిమంది జనం ఎదుట మైకుల్లో మంత్రి దూత స్వయంగా బహిరంగ హామీ ఇచ్చారు. ఒకవేళ మున్ముందు ఆచరణలో హామీలు అమలు కాకపోతే, ఇంతకంటే రెట్టింపు దీక్షతో పోరాడదామని ఇఫ్టూ నాయకత్వం ముగింపు పిలుపు ఇచ్చింది. ఆ అర్ధరాత్రి మిల్లు ముట్టడి ముగిసింది. నలుగురు యాజమాన్య ప్రతినిధులకు ఎట్టకేలకు ముట్టడి నుండి విముక్తి లభించింది.
అది మొత్తం ’42 గంటల మిల్లు ముట్టడి’! అదే వీరోచిత నెల్లిమర్ల జూటు కార్మికోద్యమ చరిత్రలో పేరొందిన సాహసిక పోరాట ఘట్టాలలో ఒకటి. అదే ‘ఉల్లిపాయల పోరాటం’ గా ఆ ప్రాంత ప్రజల్లో ప్రసిద్ది కెక్కింది. ఆ కాలంలో ఎవరి నోట విన్నా ఆ పోరాటాన్ని ఆ పేరుతో పిలవడం జరిగింది.
ఆనాడు ఇఫ్టూ అనుబంధ నెల్లిమర్ల జూటుమిల్లు కార్మిక సంఘం పన్నిన వ్యూహంలో కీలక బాధ్యతల్ని నిర్వహించిన యిద్దరు ఆగంతకులలో మజ్జి సూర్యనారాయణ ఒకరు. (మరోకరి పేరు భీముడు. అతడు చాలా ఏళ్ళ క్రితం మృతి చెందాడు) ఆ మజ్జి సూర్యనారాయణ తన 73వ ఏట మొన్న అనగా 5-9-2021 వ తేదీన మృతి చెందాడు. ఆయనకు నిండు మనస్సుతో జోహార్లు తెలియజేస్తున్నాను.
మజ్జి సూర్యనారాయణ మిల్లు బ్యాచింగ్ డిపార్టుమెంటు లో కార్మికుడు. నెల్లిమర్ల గాంధీ కాలనీ నివాసి. వారితో పాటు ఆయన భార్య సత్యవతి, ఇద్దరు కొడుకులు పైడిరాజు, ఆదినారాయణ, ఇద్దరు కూతుళ్లు సన్యాసమ్మ, రమణమ్మ ఆనాటి నెల్లిమర్ల వుద్యమాలలో పాల్గొన్నారు. చిన్న కొడుకు భార్య అన్నపూర్ణ W/O ఆదినారాయణ ప్రస్తుతం వార్డు కౌన్సిలర్ కూడా!
సూర్యనారాయణ గారి మృతికి ఇఫ్టూ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా.
సకల సంపదలకు మూలం ‘శ్రమశక్తి’! సకల దుఃఖాలకు కారణం “పెట్టుబడి”! ప్రజల ఆకలి, దారిద్య్రం, కష్టాలు, కన్నీళ్లకు కారణమైన “పెట్టుబడి” పై శ్రమశక్తి రేపు సాగించాల్సిన అనివార్యమైన విప్లవ యుద్ధంలో శ్రామికవర్గ పాత్ర మహోన్నతమైనది. ఆ విప్లవ పోరాటంలో మట్టిలో మాణిక్యకాల వంటి వాళ్ళు శ్రామికవర్గంలో ఉద్భవిస్తారు. అది ఆధునిక ప్రపంచ విప్లవాల చరిత్ర నిరూపించిన సత్యం. మజ్జి సూర్యనారాయణ ఒక సాధారణ కార్మికుడు మాత్రమే. ఆయన బడిలో చదివింది లేదు. ఆధునిక విద్యా విజ్ఞానాలు అభ్యసించలేదు. అయితేనేమి, ఒక వీరోచిత కార్మికోద్యమ ఘట్టంలో చాలా కీలకపాత్రను పోషించాడు. నేడు కార్పొరేట్ సంస్థలకు సర్వసంపదల్ని అప్పగించే వేళ, సంపద వ్యత్యాసాల్ని మరింత పెంచే వేళ, దోపిడీ ఆర్ధిక, సామాజిక వ్యవస్థ నానాటికీ బలపడే వేళ. ఈ దుస్థితి “పెట్టుబడి” మీద అనివార్యమైన శ్రామికవర్గ విప్లవ యుద్దాన్ని సూచిస్తుంది. అట్టి రేపటి విప్లవ యుద్ధంలో మట్టి మనుషుల నుండే విప్లవ రత్నాలు ఉద్భవిస్తారనే పెను రాజకీయ విశ్వాసం ఉండాలి. ఆ రాజకీయ విశ్వాసం పొందే దిశలో మజ్జి సూర్యనారాయణ పోషించిన పాత్ర సంస్మరణ ఉపకరిస్తుంది. అందుకే ఆరోజు చరిత్రాత్మక ఉల్లిపాయల పోరాటంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకుందాం.
–ఇఫ్టూ ప్రసాదు (పిపి), పూర్వ అధ్యక్షులు, ‘నెల్లిమర్ల జూటుమిల్లు కార్మిక సంఘం. (IFTU అనుబంధం)