(అవ్వారు శ్రీనివాసరావు)
మంగళగిరి వామపక్ష భావజాల గడ్డ. ఈ నేలపై రాజకీయాలతోపాటు ఆధ్యాత్మిక, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, కళా, క్రీడా రంగాల్లోనూ గుర్తింపు పొందినవారెందరో ఉన్నారు. ఏ ప్రాంతమైనా సాంస్కృతిక వికాసంతోనే ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంటుంది.
ఈ మధ్య కాలంలో మంగళగిరిలో సాహిత్య పరమైన కార్యక్రమాలు ఇతోధికంగా జరుగుతున్నాయి. కవులు, రచయితలకు ప్రోత్సాహం మెండుగా లభిస్తోంది. అలా ప్రోత్సహించేవారిలో మంగళగిరి నగరానికి చెందిన దామర్ల కుబేరస్వామి ముందుంటున్నారు. వారి గురించి క్లుప్తంగా …
మంగళగిరిలో ‘దామర్ల రమాకాంతారావు చేనేత కాలనీ’ (వీవర్స్ కాలనీ) అంటే తెలియని వారుండరు. ఎంతోమంది చేనేత కుటుంబాల ఆశ్రయ ప్రదాతగా దామర్ల రమాకాంతారావు నిలుస్తారు. వీరి తనయుడు దామర్ల ఉమామహేశ్వరరావు, పద్మావతి దంపతులకు 1967 అక్టోబరు 14న జన్మించిన ప్రథమ పుత్రుడే కుబేరస్వామి.
*విద్యార్థి దశలోనే…*
వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో బీకామ్ చదివిన కుబేరస్వామి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికై విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తన తండ్రి స్థాపించిన శ్రీ పద్మావతి వెంకటేశ్వర రైస్ అండ్ ఫ్లోర్ మిల్లును వ్యాపారాన్ని కొనసాగిస్తూ ‘దామర్ల కన్ స్ట్రక్షన్స్’ పేరిట నిర్మాణ రంగంలోనూ రాణించారు.
*సామాజికసేవలో…*
మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం ప్రధాన కార్యదర్శిగా, శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా, పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేట్ మెంబరుగా, తిరుచానూరులోని అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలీయ అన్నసత్రం సభ్యుడిగా, మంగళగిరి పట్టణ పద్మశాలీయ యువజనసంఘం ఉపాధ్యక్షుడిగా బహుముఖ సేవలు అందిస్తున్నారు.
దామర్ల కుబేరస్వామి వివిధ రంగాల్లో రాణించడమే కాకుండా సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. మంగళగిరి ప్రాంతంలోని కవులు, రచయితలను ప్రోత్సహించడంలో ముందుంటున్నారు. తాజాగా ప్రజాకవి గోలి మధు రచించిన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి ముద్రణ బాధ్యతను కుబేరస్వామి తీసుకుని తన సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు.
*కుటుంబనేపథ్యం…*
కుబేరస్వామి భార్య లక్ష్మీనారాయణి గృహిణి. కుమారులు రాజీవ్, రవికాంత్ లిద్దరూ బీటెక్ చేశారు. కుబేరస్వామి తాత రమాకాంతరావు అప్పట్లోనే ఎంఏ ఆనర్స్ చేశారు. చేనేత ఉద్యమ రథసారథిగా, చేనేత పత్రిక సంపాదకులుగా, తొలి శాసనమండలి సభ్యుడిగా సేవలందించారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలో సీకే విద్యాసంస్థల స్థాపనలోనూ, చేనేత కుటుంబాలకు కాలనీ ఏర్పాటులోనూ ఆయనది గణనీయ పాత్ర.
కుబేరస్వామి తండ్రి ఉమామహేశ్వరరావు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా రెండు పర్యాయలు సేవలందించారు.
ఆ విధంగా దామర్ల కుబేరస్వామి కుటుంబం రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలతో మమేకమైంది.