ఈ సారి మహిళా ట్రెక్కర్లతో బ్రహ్మగుండానికి యాత్ర

 

(రాఘవశర్మ)

‘అడవికెళ్ళడం.. ప్రకృతితో మమేకమవ్వడం.. అద్భుతమైన ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడం ఒక్క మగవాళ్ళకే పరిమితమా!?” ‘కొండలు ఎక్కడం, దిగడం, నీటి గుండాలలో ఈదులాడడం మాకు చేతకాదా!?”

‘మీకంటే మేం ఎందులో తీసిపోయాం !’ అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏళ్ళతరబడి వినిపిస్తున్న ఇంటిపోరు పడలేక తిరుపతి ట్రెక్కర్లు ఒక సుదినాన ‘సరే’ అన్నారు.

‘కుటుంబాలతో ఒక ట్రెక్ వేయండి’ అని ఆచార్య కుసుమకుమారి(శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్ ) చాలాకాలంగా భూమన్‌ను అడుగుతూనే ఉన్నారు.

ఇన్నాల్టికి అది కార్యరూపం దాల్చింది.

శేషాచలం కొండలలోని బ్రహ్మగుండానికి ఆదివారం కుటుంబాలతో బయలుదేరాం. తిరుపతి నుంచి మామండూరుకు, మామండూరుకు ఈవల ఉండే ప్రకృతి బాట నుంచి అడవిలోకి సాగాం.

దట్టమైన అడవి

దట్టమైన అడవి. చుట్టూ పచ్చని అడవి. రకరకాల ఎత్తైన చెట్లు.  చెట్లకు అల్లుకున్న తీగలు. అడవి తల్లి నెత్తిన పాపిటలాగా మధ్యలో మట్టి రోడ్డు.

గుర్రపు బగ్గీల్లో వెళ్ళడానికి బ్రిటిష్ వారు ఎప్పుడో శతాబ్దం క్రితం వేసిన రహదారి అది. ఎగుడు దిగుడుగా, మెలికలు తిరుగుతూ, రాళ్ళురప్పలతో నిండి ఉంది.  రాత్రి పడిన వర్షానికి అడవిలో మాగిన ఒక వింతైన వాసన.


తిరుపతి జ్ఞాపకాలు – 44


మా వాహనాలు వెళుతుంటే రకరకాల పక్షుల పలకరింపులు.  మధ్యలో కీచురాళ్ళ అరుపులు. మా కళ్ళ ముందే ఎగురుతున్న రంగురంగుల సీతాకోక చిలుకలు. వాటిని చూసి పిల్లల కేరింతలు. మధ్యలో పెద్ద వాళ్ళ ముచ్చట్లు. ‘మధ్యాహ్న భోజనం ఎట్లా?’ ఒక ఇల్లాలి సందేహం.  ‘అడవిలోనే వంటలు’ మరొకరి సమాధానం. ‘అక్కడ కూడా మనమే వంట చేయాలా?” ఇంకొక ఇల్లాలి ధర్మసందేహం. ‘లేదులే. బైట చెప్పినారు’ మరొకరి ఓదార్పు.

ఉద్యోగం చేస్తున్నా, రోజూ వంట చేయటం వారికి జీవిత కాలపు సమస్య.

బ్రహ్మగుండం సమీపంలో రేకుల షెడ్డు

అడవిమధ్య నుంచి వెళుతుంటే కుడివైపున పుల్లుట్ల దారి. తిరుమలకు వెళ్ళే పురాతనమైన రహదారి అది.

ఎడమ వైపునకు వెళితే అన్నమయ్యమార్గం. అది కూడా పురాతనమైనదే.  ఎదురుగా బ్రహ్మగుండం దారి. ఆరు కిలో మీటర్లు వెళ్ళాక మా వాహనాలను ఆపేశాం. దట్టమైన అడవిలోకి ఎడమ వైపున నడుచుకుంటూ వెళ్ళాం.

చుట్టూ మెష్ అల్లిన ఒక పురాతనమైన పెద్ద రేకుల షెడ్డు. వర్షం నుంచి, జంతువుల నుంచి కాపాడుకోడానికి అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆవాసం. ఆ షెడ్ లో నుంచి ముందుకు సాగితే, ఎదురుగా కొండపై నుంచి ఒక నీటి గుండంలోకి పడుతున్న జల ధార.

ఆ నీటి గుండమే బ్రహ్మగుండం. ఆ జలధార పడుతున్న కుడివైపునుంచి కొండ ఎక్కాం. ఆ సెల ఏరు ఎన్ని కొండలపై నుంచి జాలువారుతోందో! ఎన్ని గుండాలలో పడి ముందుకు సాగుతోందో!  ఎంత స్వచ్ఛమైన నీళ్ళు! ఆ జలపాతం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాగం వినిపిస్తున్నట్టుంది.  ఆ జలపాతం ఎక్కినట్టల్లా ఎక్కాం, దిగినట్టల్లా దిగాం, దుమికినట్టల్లా దుమికాం. కొండ పైనుంచి గుండంలో పడే ఆ జలపాతం ఎన్ని మెలికలు తిరిగిందో!  ఎంత హొయలు పోయిందో! దానితో పోటీపడలేకపోయాం .

బ్రహ్మాగుండం లో ఈదులాట

ఆ సెలేటితో పాటు బ్రహ్మగుండంలోకి దూకాం. అప్పటికే కొందరు పిల్లలు నీటి గుండంలో ఈదుతూ కేరింతలు కొడుతున్నారు.  మరి కొందరు ట్యూబులు కట్టుకుని నీళ్ళలోకి దిగారు.

ఈత రాని కొందరు పెద్ద వాళ్ళూ కూడా ట్యూబులతో అదే పని! మగవాళ్ళంతా బైటికొచ్చాక, కొందరు మహిళలు గుండంలో దిగి ఈదులాడారు. హెూదాలన్నీ మర్చిపోయారు.   ప్రకృతిలో లీనమయ్యారు.

పచ్చని అడవి, ఎత్తైన కొండలు, వింతైన రాళ్ళు, సెల ఏళ్ళు తప్ప ఇంటి ఆలోచనలన్నీ వదిలేశారు. పక్కన మరో దారినుంచి కొంతదూరం నడిచాం.  బ్రహ్మగుండంలోకి వచ్చిపడే నీటి ప్రవాహం పెరిగితే, పొంగి పొర్లి పక్క నున్న ఏరు నుంచి సాగుతుంది.

చెట్టును భుజాలమీదకి ఎత్తుక్కున్నట్లు భూమన్!

ఆ ఏరు దగ్గర వింత వింత చెట్లు. ఆ ఏటి ప్రవాహానికి ఒక మహావృక్షం వేళ్ళు బైటపడ్డాయి.

నాలుగు కాళ్ళ పైన నిలబడినట్టు నలుదిక్కులకు పాకిన దాని బలమైన వేళ్ళ పైనే ఆ చెట్టు నిలబడింది.  ఆ నాలుగు వేళ్ళ మధ్యలో ఖాళీ జాగా!  భూమన్ ఆ ఖాళీ జాగాలో దూరి ఆ చెట్టును భుజాలపై మోస్తున్నట్టుగా భ్రమింపచేశారు.

మహావృక్షంలో బొమ్మల కొలువు

మరొక మహావృక్షం మొదలు పైన అనేక మానవ ఆకారాలు! దాని మొదలు బొమ్మల కొలువు తీర్చినట్టుంది.  నిజానికి అవ్వన్నీ దాని బుడిపెలే.ఆ బొడిపెలతో ఆ చెట్టు వింతపోకడలు పోతోంది.

అక్కడ కొట్టుకుపోయిన రహదారిని చూస్తే ఆ ఏరు ఎంత ఉదృతంగా ప్రవహించిందో!  బ్రహ్మగుండం సమీపంలో కూర్చున్న మహిళల ముచ్చట్లు సాగుతున్నాయి.  “ఆదివారం అంటే చాలు, ఎనిమిది అయినా పిల్లలు నిద్రలేవరక్కా. ట్రెక్కింగ్ అనగానే టక్కున లేచేశారు” అంటూ ఒక ఇల్లాలి ఆశ్చర్యం.

పుస్తకాలు, హోం వర్కులు, క్లాసువర్కులు, ఆన్లైన్ క్లాసులు; ఒకటేమిటి బాల్యాన్ని చిదిమేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, అన్నిటినీ ప్రయోగిస్తున్నారు.

పిల్లలకు విశ్రాంతి లేదు, బాల్యమూ లేదు.ఇలా ఆమ్మానాన్నలతో అడవిలోకి రావడం ఎంత ఆనందం! బాల్యాన్ని ఎంత బాగా అనుభవిస్తున్నారు! నిజమే, వారికి ఇదొక జీవితకాలపు జ్ఞాపకం.

అడవిలో ఇలా ఆనందంగా

‘ట్రెక్కింగ్ కు రావడం వల్ల ఒత్తిడి నుంచి దూరమవుతాం. ప్రతివారం ట్రెక్కింగ్ కు రావాలనే ఉంటుంది. పని వత్తిడి వల్ల రాలేకపోతున్నాం’ అంటున్నారు మైక్రోబయాలజిస్టు డాక్టర్ నిబంధన.

‘మా ఆయన అటవీ శాఖలో చేస్తున్నా, ఎన్ని సార్లు అడిగినా ట్రెక్కింగ్ కు తీసుకెళ్ళరు. ఆయన మాత్రం వెళతారు. ఆయన వెళితే డ్యూటీటా?మేం వెళితే ట్రెక్కింగట!?” అని నిష్టురపోయారు సుకన్య.

“పాతికేళ్ళుగా తిరుమలలోని తీర్థాలన్నీ తిరిగాను. ఎంత బాగుంటాయో! ఎంత ఆనందంగా ఉంటుందో! మాపిల్లలికి కూడా ట్రెక్కింగ్ అలవాటుచేశారు మా వారు. మనవలతో ఉండడం వల్ల ఇప్పుడు పెద్దగా రాలేకపోతున్నాను. ఇప్పటికీ ఇంట్లో రోటి పచ్చళ్ళు చేస్తాను. రాస్ రెసిడెన్షియల్ స్కూల్లో మానసిక వికలాంగులైన పిల్లలకు పాఠాలు చెపుతాను” అని వివరించారు మరొక అటవీ శాఖాధికారి సతీమణి భారతి.

అయిదేళ్ళుగా వివిధ తీర్థాలు తిరుగుతూ, అడవిలో తిరగడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్న ఆచార్య కుసుమకుమారి ట్రెక్కింగ్ గురించి ఇలా వివరించారు.

పుల్లట్లదారిలో నడుస్తున్న ఆచార్యకుసుమకుమారి(ఫైల్ ఫొటో)

“ట్రెక్కింగ్ కు వెళ్ళడం వల్ల మనం ప్రకృతిలో లీనమవుతాం.  అడవిలో ఉన్నప్పుడు మన మనసులో ప్రకృతి తప్ప మరేం ఉండదు. మనలో ఉండే స్థాయి భేదాలు మర్చిపోతాం. ఒక మహాద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని దర్శింగలుగుతాం. శరీరం తేలికపడుతుంది. గుండెకు, మోకాళ్ళకు మంచి వ్యాయామం లభిస్తుంది. శరీరాన్ని ఆ మాత్రం కష్టపెట్టడం ఆరోగ్యానికి మంచిదే కదా!

“మహిళలు నిద్రలేచినప్పటి నుంచి ఇంటి పనులతో సతమతమవుతుంటారు. మహిళలు ట్రెక్కింగ్ కు రావడం నిజంగా గొప్ప సాహసం. దీని వల్ల మానసిక వికాసం కలుగుతుంది. ట్రెక్కింగ్ ను ఒక రకంగా ‘ఉమన్ నెట్ వర్కింగ్’ అని చెప్పవచ్చు.

“ఒకప్పుడు స్త్రీలు పేరంటాలు చేసేవారు.  పేరంటానికి అందరినీ పిలిచి, తాంబూలాలిచ్చి, అందులో శెనగలు, అరటి పండు పెట్టే వాళ్ళు. పాటలుపాడేవారు. పేరంటం పేరుతో ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం లభించేది. కష్టసుఖాలను పంచుకునేవారు. నాచిన్నప్పుడు మా అమ్మ వెంట నేను కూడా పేరంటానికి వెళ్ళేదాన్ని. పేరంటం ఒకప్పటి ‘ఉమన్ నెట్ వర్కింగ్’ అని చెప్పవచ్చు.” అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

“ట్రెక్కింగ్ అంటే ఒక రకమైన సాహసం.  మహిళలు ట్రెక్కింగ్ కు రావడం వల్ల దైనందిన జీవితంలో కనిపించని సాహసం ఇక్కడ కనిపిస్తుంది. పురుషులకంటే ఏవిధంగానూ తీసిపోమన్న భావన వారిలో కలుగుతుంది.  అంతా కలిసి పాటలు పాడతారు. కలిసి వంటలు చేస్తారు.  నిద్రాణంగా ఉన్న మహిళల శక్తియుక్తులు ట్రెక్కింగ్ వల్ల బైటకు వస్తాయి. దీంతో జంకు పోయి, నిస్సంకోచంగా, నిర్భయంగా సంచరించవచ్చనే ధైర్యం ఏర్పడుతుంది.”

కుటుంబాలతో అడవికి

 

నిజమే మహిళలు అన్నిటా పోటీపడుతున్నారు.  ఏ రంగంలోనూ తక్కువ కాదని చాలామంది రుజువు చేస్తున్నారు. భారత సంతతికి చెందిన తొలి మహిళా వ్యోమాగామిగా కల్పనా చావ్లా అంతరిక్షంలోకెళ్ళింది.  భావనా కాంత్ తొలి మహిళా యుద్ధ విమానాల పైలట్ గా 2016లో ఎంపికయ్యింది.

భారత సైన్యంలో కేవలం వైద్యరంగానికి పరిమితమైన మహిళలు, ఇంజినీరింగ్, సిగ్నల్స్ రంగాలకు కూడా విస్తరించారు. ఇటీవలే, మహిళా  లెఫ్టనెంట్ కర్నల్ లకు తొలిసారిగా కర్నల్ ప్రమోషన్ లభించింది.

ఇప్పటి వరకు షార్ట్ సర్వీస్ కమిషన్ కు మాత్రమే పరిమితం చేసిన మహిళలను పర్మనెంట్ కమిషన్ కు ఎందుకు ఎంపిక చేయరని ఇటీవల సుప్రీం కోర్టు భారత రక్షణ శాఖను ప్రశ్నించింది.మహాసముద్రమంత లోతైన, ఆకాశమంత ఎత్తైన అవకాశాలు మహిళలకు కళ్ళ ముందుకనిపిస్తున్నాయి.

అక్కడి పర్వతారోహణలో భూమన్

ఇక ఆలస్యమెందుకు!?

‘మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనుకెనోయ్’ అన్న గురజాడ మాట ఎలాగూ ఉండనే ఉంది.

(ఆలూరు రాఘవశర్మ,సీనియర్ జర్నలిస్టు,తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *