‘రామప్ప’కు యునెస్కో గుర్తింపు సరే! తదనంతర చర్యలేవీ?

(రామప్ప పరిరక్షణ కమిటి, వరంగల్)

క్రీ.శ.1213 లో కాకతీయులు నిర్మించిన అద్భుత ,అపురూప కళాఖండానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపునివ్వడం మనకు తెలిసిందే. జూలై 25న  యునెస్కో గుర్తింపు లభించటంతో యావత్ తెలంగాణ ప్రజలందరిలో సంతోషాలు వెల్లివిరిసి సంబురాలు జరుపుకున్నారు కూడ.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే యునెస్కో గుర్తింపు పొందిన మొదటి కట్టడంగా రామప్ప నిలిచింది.

ఈ సంబురాలకు సార్థకత చేకూర్చే చర్యలేవీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకుండా తాత్సారం చేస్తుండటం రాష్ట్ర ప్రజలను కలవరపాటు కలిగిస్తున్నది.
యునెస్కో గుర్తింపునిచ్చి యాభైరోజులు గడుస్తున్నా అనుగుణమైన చర్యలు గైకొనడంలో రాష్ట్రప్రభుత్వంలో చలనం లేదు.ముగ్గురు రాష్ట్రమంత్రులు రామప్పకు వచ్చి ఇదంతా మా ప్రభుత్వం ఘనతేనని డాంబికాలు పలికినారే తప్ప రామప్ప గుడి అభివృద్ధి పనులకవసరమైన నిధుల ముచ్చటే తీయలేదు.

రు.250 కోట్లు మంజూరి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారే తప్ప రాష్ట్ర ఫైనాన్స్ నిధులెన్ని కేటాయిస్తారో చెప్పక పోవడం వారి బాధ్యతా రాహిత్యమే.

రామప్పకు గుర్తింపునిచ్చిన యునెస్కో తమ బృందాన్ని అక్టోబర్ నెలలో ప్రపంచ వారసత్వ సంపద రక్షణకు ఉండాల్సిన ఏర్పాట్ల పరిశీలనకు రాబోతున్న సమాచారమున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రోజునాటికి కదలిక లేకపోవడం విచారకరం.

వాస్తవంగా రామప్ప గుడి అభివృద్ధి ఏడెనిమిది ప్రభుత్వ శాఖల సమన్వయంతో జరుగాల్సి ఉంది. అవి పురావస్తు, దేవాదాయ,పర్యాటక, ఉద్యానవన, అటవీ, రెవిన్యూ శాఖలను సమన్వయ పరిచి అభివృద్ధి పనులు చేపట్టాలి. ఈ శాఖలన్నింటిని సమన్వయ పరచడానికి ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియామకం జరుపాలి. ఆ లోపం కారణంగానే అభివృద్ధి అనేది అడుగుబట్టి పోతున్నది.

ఇప్పటికైనా యునెస్కో గుర్తింపుకు అనుగుణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప పరిరక్షణపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేసి త్వరితగతిన పనులు చేపట్టి నిధుల విడుదల వెల్లడి చేయాలి.

ప్రపంచ ముఖచిత్రంలో ఉన్న రామప్ప దేవాలయం చుట్టు ప్రక్కల 50 కి.మీ.మేర ఉపరితల గనులు (ఓపన్ కాస్టులు)గుట్టల తవ్వకాలను ప్రభుత్వం వెంటనే శాశ్వతంగా రద్దుచేస్తున్నట్లు ప్రకటించాలి.

రామప్ప గుడి చుట్టు ప్రక్కల ఉన్న వందెకరాల భూమిని సేకరించే క్రమంలో భూనిర్వాసితులకు న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయరాదు. దేవాలయ అభివృద్ధిలో పాలంపేట గ్రామప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి.

రామప్పకు వచ్చే పర్యాటకులకు గుడి పరిసరాల్లోనే మంచినీటి వసతి,శౌచాలయాలు,విశ్రాంతి గదులతో పాటు పిల్లలకోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాట్లు ఇప్పటికైనా కొనసాగించాలి.

అక్టోబర్ నెలలో యునెస్కో బృందం రానున్న నేపథ్యంలో వారి రాకను దృష్టిలో పెట్టుకొని తదనుగుణమైన ఏర్పాట్లు ప్రారంభించకపోతే తీవ్ర నష్టం చేకూర్చే అవకాశమున్నదని రచయితలు,చారిత్రక పరిశోధకులు,మేధావులతో పాటు రామప్ప పరిరక్షణ కమిటీ తీవ్ర ఆందోళన చెందుతోంది.

వెంటనే రాష్ట్రప్రభుత్వం మేల్కొని రామప్ప అభివద్ధి దిశగా అడుగులు ఆరంభిస్తుందని ఆశిద్ధాం అని

(నల్లెల్ల రాజయ్య, ఆకినేని రామ్మోహన్ రావు,గుండవరపు వేణుగోపాల్ ,వీరమల్ల శ్రీనివాస్, రామప్ప పరిరక్షణ కమిటీ.వరంగల్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *