-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
కాబూల్ ఎయిర్ పోర్టు దుర్ఘటన ఏ నేపధ్య స్థితిలో జరిగిందో చెప్పేందుకు 9వ భాగంలో ఒక నిర్దిష్ట స్థితిని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మరో కోణాన్ని కూడా ఆవిష్కరించాల్సి ఉంది. ఆనాటి అంతర్జాతీయ పరిస్థితి కూడా కాబూల్ ఎయిర్ పోర్టు దుర్ఘటనకి ఓ తెరవెనుక ప్రేరేపక కారకంగా మారే ఆవశ్యకత ఉంది. ఇది మరో కోణం.దానిని కూడా తెలుసుకోవాల్సి ఉంది.
అమెరికా & నాటో దేశాల అంచనాలకు పూర్తి విరుద్ధంగా కాబూల్ లో 15-8-2021న హఠాత్తుగా, అనూహ్యంగా తాలిబన్లు ప్రవేశించారనే ప్రచారం పచ్చి అబద్ధం. అది వట్టి మోసపూరిత ప్రచారం మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్ తాజా పరిణామాల్ని నిరంతరం పరిశీలించే రాజకీయ వర్గాలకు అందులో ఏదీ విస్మయం చెందేది లేదు. నిజానికి అవి ఓ వ్యూహంలో భాగమే. అందులో ఏదీ అనూహ్యమైనది లేదు. అది ఏ విధంగానూ ఆకస్మిక సంఘటనగా జరిగింది కాదు. ముఖ్యంగా అదేదీ అమెరికాకి తెలియనిది కాదు. తన స్వంత కీలుబొమ్మ సర్కార్ అధిపతి ఘనీ కాబూల్ విడిచిపెట్టి పారిపోవడం గానీ, తాలిబన్లు కాబూల్ లో ప్రవేశించడం గానీ ఆకస్మిక పరిణామాలు కావు. అవి ప్రపంచ ప్రజల మనసుల్లో ఆకస్మిక భయానక ఘటనలుగా అమెరికా ఆధ్వర్యంలోని మీడియా చిత్రించడం జరిగింది. ఎందుకు అలా జరిగిందో సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే, ఆనాడు అమెరికా ఏ నిర్దిష్ట దుస్థితిలో చిక్కుకుందో అర్ధం కావాలి.
ఆగస్టు 16న కాబూల్ ఎయిర్ పోర్టు దుర్ఘటన కంటే ఒకరోజు ముందు ప్రపంచ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసే రెండు సంఘటనలు జరిగాయి. (అవి అమెరికాకి మాత్రం తెలిసినవే) మొదటిది, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాధినేత ఘనీ దేశం విడిచి పారిపోవడం. రెండు కాబూల్ నుండి అమెరికా సైనిక ఉపసంహరణ పూర్తికాక ముందే తాలిబన్లు కాబూల్ లో ప్రవేశించడం. ఇవి బయటకు రెండూ విడివిడి సంఘటనలు గా కనిపిస్తాయి. కానీ లోతుగా పరిశీలిస్తే, అవి రెండూ పరస్పర సంబంధం (Inter linked) సంఘటనలు మాత్రమే. వాటి పూర్వాపరాలు అర్ధమైతేనే, దాని అంతర్గత వ్యూహం కూడా అర్ధమవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను నిశితంగా గమనించే రాజకీయ పరిశీలకులకి ఆరోజు కాబూల్ లో తాలిబన్ల ప్రవేశం ఓ సహజ పరిణామంగా అర్ధమవుతుంది.
29-2-2020 నాటి ఒప్పందం లోని పార్టు-1 లోని A క్లాజు ప్రకారం అది కుదిరిన రోజు నుండి 135 రోజుల్లో అమెరికా, దాని మిత్ర, సంకీర్ణ శక్తులు ఈ క్రింది చర్యల్ని చేపట్టాల్సి ఉంది.
అ-అమెరికా 8600 మంది సైనికుల్ని, ఇతర సంకీర్ణ శక్తులు కూడా అదే దామాషాలో తమ సైనికబలగాల్ని తగ్గించుకోవాలి.
ఆ-అమెరికా మరియు దాని సంకీర్ణ సైనిక కూటమి దేశాల సైనిక బలగాలు ఐదు సైనిక స్థావరాల్ని ఎత్తివేసుకోవాలి.
పై ఒప్పందంలోని పార్టు-2 లోని మొదటి షరతు ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నుండి విదేశీ సైనిక బలగాలు (అమెరికా & సంకీర్ణ) మరో 285రోజుల్లో, అంటేమరో తొమ్మిదిన్నర నెలలలో సంపూర్ణ ఉపసంహరణ జరగాలి. అంటే మిగిలిన అన్ని సైనిక స్తావరాల్ని ఎత్తివేసుకొని వెళ్లిపోవాలి.
అదేవిధంగా 10-3-2020 లోపు 5000 మంది ఖైదీలను ఆఫ్ఘనిస్తాన్ జైళ్లనుండి విడుదల చేయించే బాధ్యత అమెరికా చేపట్టాలి. మరోవైపున తమ చేతుల్లో ఖైదీలుగా ఉన్న వెయ్యు మందిని తాలిబన్లు విడుదల చేయాలి. అంతే కాక, అంతర్జాతీయ ఉగ్రవాదుల పేరిట తాలిబన్ల తలకాయలపై అమెరికా గతంలో ప్రకటించి కొనసాగుతున్న రివార్డుల్ని 27-8-2020 లోపు అమెరికా ఎత్తివేసుకోవాలి. ఈ విధంగా కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం 14 నెలల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ గడ్డ మీది నుండి అమెరికా, ఇతర విదేశీ సైనిక బలగాలు పూర్తిగా ఖాళీచేసి వెళ్లిపోవాలి. అంటే పార్టు-1 షరతుల్ని 135 రోజుల్లో, అంటే నాలుగున్నర నెలలలో అమలు చేయాలి. పార్టు-2 ప్రకారం మరో 285 రోజుల్లో అంటే తొమ్మిదిన్నర నెలలలో అమలు చేయాలి. అంటే అక్కడి నుండి పూర్తి ఉపసంహరణ జరగాలి. ఈ రెండు భాగాల ప్రక్రియ మొత్తం 420 రోజుల్లో, అంటే మొత్తం 14 నెలలలో పూర్తి కావాల్సి ఉంది.
పై ఉపసంహరణ జరిగే కాలంలో అమెరికా మరియు ఇతర సంకీర్ణ దేశాల సైనిక బలగాలపై ఎలాంటి గెరిల్లా దాడులు జరగబోవని తాలిబన్ల నుండి హామీ ఇవ్వడం జరిగింది. కేవలం తమ వైపు నుండే మాత్రమే కాకుండా, తమ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుండి ఆల్ ఖైదా వంటి ఇతర సంస్థల నుండి విదేశీ సేనలపై అలాంటి దాడులు జరక్కుండా కూడా తాలిబన్ల నుండి హామీ ఇవ్వడం జరిగింది.
ఒప్పందం పై సంతకాలు చేసిన తేదీ 29-2-2020. నాటి నుండి 14 నెలలు అంటే, 2021 ఏప్రిల్ 30 వ తేదీకి ఒప్పందపు కాలపరిమితి పూర్తవుతుంది.
సాంకేతికంగా చూస్తే పైన పేర్కొన్న ఒప్పందపు గడువు ముగిసే నాటికి విదేశీ సైనిక బలగాలు ఆఫ్ఘనిస్తాన్ గడ్డ మీద నుండి ఉపసంహరణ జరగక పోతే, అది ఒప్పంద ఉల్లంఘన క్రిందికి వస్తుంది. ఆ ఒప్పందం గడువు ముగిసిన తరువాత విదేశీ సైనిక బలగాల మీద గెరిల్లా దాడులు చేసి హక్కు తాలిబన్లకి వస్తుంది. అంటే, 30-4-2021తో ఒప్పందపు గడువు ముగిస్తే, 1-5-2021 నుండి అమెరికా మరియు ఇతర విదేశీ సైనిక బలగాల మీద గెరిల్లా దాడులు చేసే హక్కు, అవకాశం తాలిబన్లకు వస్తుంది. ఒకవేళ అమెరికా సైన్యాల పై అలాంటి గెరిల్లా దాడులకు తాలిబన్లు దిగితే, అది ఒప్పందపు ఉల్లంఘన క్రిందికి రాదు. ఆ సమయంలో తమకు పూర్తిస్థాయి సైనిక ఉపసంహరణకు మరికొంత గడువును పెంచాల్సిందిగా తాలిబన్లను అమెరికా కోరింది. ఇదో గమనార్హమైన అంశం.
నిజానికి 2020 ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ గ్రామీణ ప్రాంతం పై తాలిబన్లకి పూర్తిపట్టు వచ్చింది. 2010 లో లీకైన వాషింగ్టన్ రహస్య పత్రాల్లో స్వయంగా పెంటగాన్ సైన్యాధికారులే ఒప్పుకున్న నిప్పులాంటి నిజాలు వెలుగు చూశాయి. మూడింట రెండువంతుల భూభాగం పై తమ అమెరికాకి నియంత్రణ లేదని ఒప్పుకున్న వాస్తవం వాటిలో ఉంది. 2011 నుండి తమ సైన్యాల రవాణా (మోబిలిటీ) కి ఖైబర్, బోలాన్ కనుమ మార్గాలు మృత్యు మార్గాలుగా మారినట్లు అమెరికన్ రహస్య పత్రాల్లో సైతం వెల్లడైనది. 2015-16 ల నాటికి ఆఫ్ఘనిస్తాన్ లోని అత్యధిక గ్రామీణ భూభాగంలో తాలిబన్ల అణిచివేత కోసం గగనతలం నుండి వైమానిక బాంబింగ్ దాడులు తప్ప భూతల సైనిక దాడుల్ని చేయలేని దుస్థితిలో అమెరికా & సంకీర్ణ సేనలకు ఏర్పడింది. అట్టి దుస్థితిలోనే తాలిబన్లతో పై ఒప్పందానికి అమెరికా సిద్ధపడటం గమనార్హం.
పై పరిస్థితుల్లో కుదిరిన ఒప్పందపు భాగస్వాముల్లో ఎవరిది “పై చేయి” (అఫెన్సివ్) గా ఉంటుందో, ఎవరిది “క్రింది చేయి” (డిఫెన్సివ్) గా ఉంటుందో తెలియనిది కాదు. అంతర్జాతీయ రాజకీయ పరిశీలక వర్గాలు స్పష్టంగానే పై ఒప్పందం తాలిబన్ల వైపు మొగ్గుగా ఉందని వ్యాఖ్యల్ని చేయడం గమనార్హం. పై నేపథ్యంలో ఒప్పందపు పొడగింపుకు తాలిబన్లు అంగీకరించడం వెసులుబాటు వైఖరిని ప్రదర్శించడంగానే అంతర్జాతీయ పరిశీలకుల నుండి వ్యాఖ్యలు వినిపించడం కూడా గమనార్హం. ఐతే అదే సమయంలో, పొడగింపుకు అంగీకరిస్తూనే, తాలిబన్ల నుండి ఈ క్రింది ప్రతిపాదన వెళ్ళింది.
“మీరు కోరిన గడువు ఇస్తాం. ఐతే, ఈలోవుగా మీ అమెరికా మరియు సంకీర్ణ దేశాల సైనిక బలగాలపై గెరిల్లా దాడులు చేయకుండా, మా సైనిక బలగాలు ఘనీ సర్కార్ ని కూల్చివేసే పనిని చేపడుతూ ఉంటాయి. ఈ లోపే కాబూల్ లో సర్కార్ ని కూడా ఏర్పరుస్తాం.”
తాలిబన్ల నుండి వచ్చిన పై ప్రతిపాదనపై ఉభయ పక్షాల మధ్య తిరిగిచర్చలు జరిగాయి. ఇవి బైడెన్ ప్రభుత్వ హయాం లో జరిగాయి. ఒప్పందపు గడువు 31-8-2021వరకు పొడగించడం జరిగింది. ఇది అధికారికంగానే కుదిరింది.
ఈ గడువు పొదగింపు పై తాలిబన్లతో జరిగిన చర్చల్లో అమెరికా అనధికారికంగా మరో హామీని తాలిబన్లకి ఇచ్చిందనే విమర్శలు లేకపోలేదు. పాత సైనిక ఉపసంహరణ గడువు ముగిసిన రోజు నుండి కొత్తగా పొడగించే గడువు వరకూ తమ అమెరికా, ఇతర సంకీర్ణ సైనిక బలగాలపై తాలిబన్లు గెరిల్లా దాడులు చేయకుండా హామీ ఇచ్చినట్లైతే, తమ కీలుబొమ్మ ఘనీ సర్కార్ ని కూల్చుకునే తాలిబన్ల రాజకీయ ప్రక్రియకి తమకు అభ్యంతరం లేదని తాలిబన్ల కి బైడెన్ సర్కార్ హామీ ఇచ్చినట్లు ఓ విమర్శ ఉంది. ఈ రహస్య అవగాహన కుదిరిందనే పలు వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ పరిశీలక వర్గాల నుండి కూడా వినిపించాయి. తన కీలుబొమ్మ ఘనీ సర్కార్ ని బలిపెట్టి తన స్వంత లాభం చూసుకుందనే విమర్శలు బైడెన్ సర్కార్ పై పాశ్యాచ్య మీడియా లో కూడా వచ్చాయి. దాని ప్రకారమే ఘనీ సర్కార్ భద్రతకు గతంలో తానిచ్చిన హామీని అమెరికా బుట్టదాఖలు చేసిందనే పలు విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఆ ప్రకారమే ఒప్పందపు పాత గడువు ముగిసిన తర్వాత మే నెల నుండి పట్టణ ప్రాంతాల పై తాలిబన్ల దాడులు క్రమంగా పెరుగుతూ వచ్చాయనే వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే గడువుకు పొడగించిన కొత్త గడువు కంటే రెండు వారాల ముందే ఆగస్టు 15నాటికి రెండు సంఘటనలు జరిగాయనే ప్రవహారం ఉంది. అవే ఘనీ పరారీ సంఘటన. కాబూల్ లోకి తాలిబన్ల ప్రవేశం. ఇవి రెండూ ఆకస్మిక సంఘటనలు కాకపోగా, అమెరికాకి తెలిసి జరిగినవేననే ప్రవహారం ఉంది.
తన స్వీయ సైనిక బలగాల రక్షణ కోసం అమెరికా ఆదేశాల ప్రకారమే కీలుబొమ్మ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లాడనే విమర్శ కూడా ఉంది. అది వ్యక్తిగతంగా ఘనీ పలాయనం కాదనీ, ఘనీ కి అమెరికాయే పారిపోయే రహస్య అదేశాల్ని ఇచ్చిందనే విమర్శలు ప్రబల స్థాయిలోనే ఉన్నాయి. ఏది ఏమైనా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని సైతం కాపాడుకునే సామర్ధ్టం నేడు అమెరికా సర్కార్ కి లేకుండా పోయిందనే వాస్తవం వెలుగు చూసే స్థితి ఏర్పడింది. ఒకవేళ అదే వెల్లడైతే, మున్ముందు ప్రపంచ వ్యాప్తంగా కీలుబొమ్మ లేదా తొత్తు ప్రభుత్వాలలో అమెరికా పట్ల అవిశ్వాసం ఏర్పడే పరిస్థితి ఏర్పడవచ్చు. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, తైవాన్, ఈజిప్టు వంటి దేశాల్లోని తన తొత్తు ప్రభుత్వాల్ని మున్ముందు నిలబెట్టుకోవడం అమెరికాకి కష్టం. వాటి విశ్వాసాన్ని కోల్పోతే, అట్టి దేశాల సర్కార్లు మున్ముందు తన ప్రత్యర్థి రాజ్యాలైన చైనా, రష్యా ల వైపు మొగ్గుతాయనే భయం కూడా అమెరికాలో ఉంది. ఈ నేపధ్యంలో తన కీలుబొమ్మ ఘనీ సర్కార్ ని తాలిబన్లతో అవగాహనలో భాగంగానే బలి పెట్టిందనే విమర్శ తన మీద రాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత అమెరికాకి ఉంది. అది తాలిబన్ల తో కుదిరిన అవగాహన ప్రకారం జరిగిన సంఘటన కాదనీ, తన స్వంత అంచనాకు కూడా అందని రీతి లో అనూహ్యంగా జరిగిన యాదృచ్చిక సంఘటనలుగా చిత్రించాల్సిన అవసరం అమెరికాకి ఏర్పడింది. పై నేపద్య దృష్టితో వీటిని పరిశీలించాల్సి ఉంది.
ప్రపంచ ప్రజల కళ్ళు కప్పి, వారి దృష్టిని భావోద్వేగాలతో దారి మళ్లించాల్సిన అవసరం అమెరికాకి ఏర్పడ్డ సమయంలో కాబూల్ ఎయిర్ పోర్టు దుర్ఘటన జరగడం గమనార్హం. ఒకే ఒక్క గుండుకు పలుపిట్టల్ని పడకొట్టే వ్యూహంలో భాగంగానే నాటి దుర్ఘటనని చూడాల్సి ఉంది. పై జాతీయ, అంతర్జాతీయ పూర్వ రంగ పరిస్థితుల్లో నుండి ఆగస్టు 16 నాటి ఎయిర్ పోర్టు దుర్ఘటనను పరిశీలించాల్సి ఉంది. దాన్ని రేపటి 11వ భాగంలో చూద్దాం.