వరంగల్ మహిళా రచయిత్రులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య

కాలానుగుణమైన రచనలు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి – ఉపరాష్ట్రపతి
• ఆలోచనలను పెంచుకోవడం, నలుగురితో పంచుకోవడం మంచి అలవాటు
• మహిళల ఆలోచనలు సమాజాన్ని సానుకూల కోణంలో ప్రతిబింబిస్తాయి
• ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వరంగల్ కు చెందిన మహిళా రచయిత్రులతో ఉపరాష్ట్రపతి మాటామంతి
• రుద్రమ ప్రచురణలు పేరుతో మంచి పుస్తకాలను అందిస్తున్న వారి చొరవకు అభినందనలు

హైదరాబాద్, 5 సెప్టెంబర్ 2021

కాలానుగుణంగా ఎదురయ్యే సమస్యలను ప్రతిబింబిస్తూ చేసే రచనలు, భవిష్యత్ తరాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా దిశానిర్దేశం చేస్తాయని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రమ సాహిత్య, సామాజిక అధ్యయన వేదిక – వరంగల్ కు చెందిన ఆరుగురు రచయిత్రులు హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతిని కలిశారు.

ఆలోచనలు పెంచుకోవడం, వాటిని నలుగురితో పంచుకోవడం మంచిదన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా మహిళలు చొరవ తీసుకుని కథా సంకలనాలను స్వయంగా వెలువరిస్తుండటం అభినందనీయమని తెలిపారు. మహిళల ఆలోచనలు సమాజాన్ని సానుకూల కోణంలో ప్రతిబింబిస్తాయన్న ఆయన, భవిష్యత్తులోనూ వారి నుంచి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ముప్పిరిగొంటున్న వేళ, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మారుతున్న అలవాట్లు, జీవన విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు తదితర అంశాలను ప్రతిబింబిస్తూ 100 మందికి పైగా రచయిత్రులు రాసిన వివిధ కథలను ‘కరోనా కాలం కథలు’ పేరిట ప్రత్యేక సంకలనాన్ని రుద్రమ సాహిత్య, సామాజిక అధ్యయన వేదిక – వరంగల్ వెలువరించింది.

ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో డా.కొమర్రాజు రామలక్ష్మి, కుమారి అనిశెట్టి రజిత, డా. తిరునగరి దేవకీదేవి, డా. బండారు సుజాత, డా. మురాడి శ్యామల, శ్రీమతి తమ్మెర రాధిక ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *