హైదరాబాద్ : తెలంగాణలో మరొక 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరిక చేసింది. ఇదేవిధంగా ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హచ్చరిక చేసింది. బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీఢనం వల్ల అదివారం నాడు భారీ వర్షాలు కురుస్తాయని ఈ కేంద్రం చెప్పింది. అంతేకాకుండా, సోమ మంగళవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడ గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని కూడా ఈ కేంద్రం హెచ్చరించింది.
నిన్న మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు హైదరాబాద్ లో కురిసిన వర్షానికి నగరవాసులు అల్లాడిపోయారు. ఇపుడు మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాల బీభత్సం కు సిద్ధంగా ఉండాలి. వర్షాలు మరొక సారి విరుచుకు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.
ఇక, నిన్న కురిసిన వర్షానికి ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నగరం లోని లోతట్టు ప్రాంతాలు మరోమారు జలమయ్యాయి. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎగువ నుంచి వస్తున్నమూసి వరద కారణంగా మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. ఫలితంగా అంబర్‌పేట, దిల్‌సుఖ్ నగర్ మధ్య సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరింది. అంబర్‌పేటలోని ఆబ్కారీ కార్యాలయంలోకి అడుగు మేర నీరు చేరింది.
దిల్‌సుఖ్ నగర్ కోదండరామనగర్ వరద నీటిలో చిక్కుకుంది. సరూర్ నగర్ చెరువు నీరు రోడ్లపై నుంచి మోకాళ్ల లోతులో ప్రవహించింది. సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్‌లోని కుర్మగూడ (సైదాబాద్)లో అత్యధికంగా 10.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా మూసీనది ఉరకలు వేస్తోంది.