మట్టిబాట
మట్టి బాటలమీద
పాములు పాకినా పాతులుంటాయి.
పిట్టలు గింజల కోసం ముక్కుతో
ముద్దాడినా గురుతులుంటాయి.
పసిపిల్లల లేలేత పాదాల జాడలుంటాయి
ఇంకా
బరువెక్కినా గుండెలతో నడిచిన
పేదల పాదముద్రలుంటాయి.
కాయిదం పై కలం మోపి
ఆలోచనలు కనలేనప్పుడు
మట్టి దేహాలమీద నడిచిపొయి కవిత్వం రాసుకున్న
రంగు రంగుల వాక్యాలుంటాయి.
బిడ్డ తొలిసూరు కాన్పుకు నొప్పులొస్తే
పిండం అడ్డం తిరిగి నసపెడ్తుంటే
బండెద్దులు కట్టుకొని దవఖానకు పయనమైతే
తడిసిన మట్టిలో ఇరుక్కపోయిన
బండి చక్రాల చిరునామాలుంటాయి.
సోమరిపోతులు
కాలు లేపకుండా నడిసేటప్పుడు
కండ్లు నెత్తికెక్కి పోయేటప్పుడు
లోకం కనపడని వారికి
మేలుకొలుపు చేసే పోట్రాళ్లుంటాయి.
అర్ధరాత్రి పూట మెల్లగా పాకి
నత్తగుల్లలు గీసిన చిత్రలుంటాయి.
ఎద్దుల గిట్టెల నడుమ ఇనుపచువ్వ గుచ్చుకుంటే
బాటంతా కారిన రక్తపు చుక్కలుంటాయి.
ముసలవ్వ మోసుకొస్తున్న
కట్టెల మోపులో నుండి జారిపడినా
మొనదేలిన ముండ్లు పర్సుకొని ఉంటాయి.
కల్లం నుండి బస్తాలకెత్తుకొని బండిమీద తెస్తుంటే
సంచి బొక్కలు పడి
ధాన్యమంత చల్లిపోయిన రాశుల కుప్పలుంటాయి.
ఊరికి ఊరికి మధ్య దారులేసి
మనిషికి మనిషికి మధ్య వంతెనై నిలిచి
ఈ మానవ మనుగడను ఇంత దూరం మోసుకొచ్చింది
ఈ మట్టి బాటనే కదా..!
ఈ మట్టి బాటకు నేలకున్న చరిత్ర ఉంది
ఎన్నో చరిత్రలకు దారులేసినా
ఈ మట్టికి
ఈ బాటకు వందనం.
-అవనిశ్రీ.
9985419424.