సెప్టెంబరు 13వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి TTD అగరబత్తులు
దేశీయ గోవుల నుండి సేకరించిన పాల నుంచి పెరుగు తయారుచేసి, దాన్ని చిలికి వెన్న తయారుచేసి స్వామివారికి సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవలో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి చెప్పారు. సెప్టెంబరు 13వ తేదీ నుంచి ఏడు బ్రాండ్లతో పరిమళభరిత అగరబత్తులు భక్తులకు విక్రయం కోసం అందుబాటులోకి తెస్తామన్నారు. తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలు.
సెప్టెంబరు 9న వరాహ జయంతి
– సెప్టెంబరు 9న ఉదయం 11 నుండి 12 గంటల వరకు తిరుమలలో వరాహ జయంతి సందర్భంగా ఉత్సవమూర్తులకు అభిషేకం, మూలమూర్తికి ప్రోక్షణ నిర్వహిస్తాం.
సెప్టెంబరు 19న అనంతపద్మనాభ వత్రం
– సెప్టెంబరు 19న అనంతపద్మనాభ వ్రతంను పురస్కరించుకొని ఉదయం శ్రీవారి ఆలయం నుండి చక్రతాళ్వారును ఊరేగింపుగా తీసుకువెళ్ళి స్వామి పుష్కరిణిలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహిస్తాం.
హోలీ గ్రీన్ హిల్స్‌గా తిరుమల
– తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ హిల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఇందుకోసం దశలవారీగా డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను వినియోగిస్తాం.
– మొదటి దశలో 35 విద్యుత్ కార్లను(టాటా నెక్సాన్) తిరుమలలోని సీనియర్ అధికారులకు అందించాం. రెండో దశలో యాత్రికులకు ఉచిత బస్సులు ప్రారంభిస్తాం. తిరుమల-తిరుపతి మధ్య ఆర్‌టిసి విద్యుత్ బస్సులను నడిపే ప్రక్రియ తుది దశలో ఉంది. మూడో దశలో ట్యాక్సీలను విద్యుత్ వాహనాలుగా మార్పించే ప్రయత్నం చేస్తాం.
డిఆర్‌డిఓ పర్యావరణ హిత లడ్డూ సంచులు
– తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం బట్ట, జ్యుట్ సంచులు, గ్రీన్ మంత్ర సంస్థ పర్యావరణ హిత కవర్లు విక్రయిస్తున్నాం. ఇటీవల డిఆర్‌డిఓ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయాలు ప్రారంభించాం.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయం
– తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను సెప్టెంబరు 14న ప్రారంభిస్తున్నాం.
– ఇందుకోసం సెప్టెంబరు 8 నుండి 13వ తేదీ వరకు బాలాలయ కార్యక్రమాలు నిర్వహిస్తాం. భక్తులకు యథావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుంది. స్వామివారి కైంకర్యాలు కల్యాణ మండపంలోని బాలాలయంలో నిర్వహిస్తారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఐనా మహల్ పునఃప్రారంభం
– శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆధునీకరించిన ఐనా మహల్‌ను ఆగస్టు 22న పునఃప్రారంభించాం. ఇక్కడ రోజూ స్వామివారి ఊంజల్‌సేవ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం.
వర్చువల్ విధానంలో పవిత్రోత్సవాలు
– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి. శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతాం. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం.
సెప్టెంబరు 13వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి అగరబత్తులు
– టిటిడి ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో పరిమళభరిత అగరబత్తులు తయారు చేస్తున్నాం. సెప్టెంబరు 13వ తేదీ నుండి ఏడు బ్రాండ్లను భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచుతాం.
డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఎంఓయు
– వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు, క్యాలెండర్లు, డ్రై ఫ్లవర్ మాలలు, తదితరాలు తయారు చేయడానికి డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో సెప్టెంబరు 13వ తేదీ ఎంఓయు కుదుర్చుకుంటాం. ఈ ఉత్పత్తులను త్వరలో అందుబాటులోకి తెస్తాం.
పాఠకులకు అందుబాటులో కవిత్రయ మహాభారతం
– టిటిడి ఇటీవల పునఃముద్రించిన కవిత్రయ మహాభారతం 15 వాల్యుమ్‌లు (తెలుగు) రూ.4,100/-, వేదాలకు సంబంధించిన రూట్స్ (ఆంగ్ల) పుస్తకం రూ. 850/- భక్తులకు అందుబాటులో ఉంచాం. తిరుమల, తిరుపతిల్లోని టిటిడి ప్రచురణ విక్రయశాలల్లో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
అక్టోబరు నుండి పాఠకులకు ‘సప్తగిరి’ కాపీలు
– సప్తగిరి మాసపత్రిక ఎడిటోరియల్ బోర్డును ఇటీవలే పునఃవ్యవస్థీకరించాం. సరికొత్త డిజైన్, కంటెంట్‌తో అక్టోబరు నుండి కాపీలను పాఠకులకు చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
డైరీలు, క్యాలెండర్లు
– టిటిడి ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న డైరీలు, క్యాలెండర్లను ఈ ఏడాది అక్టోబరు మాసం నుండి భక్తులకు విక్రయించడానికి అందుబాటులోకి తీసుకొస్తాం.
ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు:
రాష్ట్రవ్యాప్తంగా శ్రావణపౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి వేడుకలు
– శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 22న శ్రావణపౌర్ణమి, ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి వేడుకలను టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల సమన్వయ సహకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాం.
శ్రీ శ్రీనివాస పంచాహ్నిక చతుర్వేద హవనం
– లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఆకాంక్షిస్తూ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి కోరిక మేరకు మైసూరు దత్త పీఠంలో సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస పంచాహ్నిక చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
షోడశదిన బాలకాండ పారాయణం
– లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు శ్రీవారిని ప్రార్థిస్తూ సెప్టెంబరు 3 నుండి 18వ తేదీ వరకు 16 రోజుల పాటు షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష నిర్వహిస్తున్నాం.
– తిరుమల వసంత మండపంలో ప్రతిరోజూ ఉదయం 16 మంది వేద పండితులు పారాయణదీక్ష చేస్తున్నారు. మరో 16 మంది పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో జప, తర్పణ, హోమాదులు నిర్వహిస్తున్నారు.
భాద్రపద మాస కార్యక్రమాలు
– కార్తీక, ధనుర్, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ, శ్రావణ మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది.
– సెప్టెంబరు 8వ తేదీ నుండి తిరుమల నాదనీరాజనంవేదికపై ఉదయం 6 నుండి 7 గంటల వరకు గరుడ పురాణం పారాయణం జరుగుతుంది.
– శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యాగశాలలో సెప్టెంబరు 10న
వినాయక చవితి, సెప్టెంబరు 11న రుషి పంచమి నిర్వహిస్తాం.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్
– ఎస్వీబీసి హింది, కన్నడ భాషలలో ఛానళ్ళు రానున్న అక్టోబరు నెలలో ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నాం.
– వేదాలు సామాన్య మానవుని జీవన విధానానికి అవసరమైన అనేక వైజ్ఞానిక అంశాలను తెలియజేస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ‘‘వేదం – జీవననాదం’’ అను కార్యక్రమాన్ని ప్రతి శని, ఆదివారాలలో రాత్రిపూట ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం చేసేలా కార్యక్రమాలు రూపొందించాము.
– అన్నమయ్య సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో యువతకు అన్నమయ్య సంకీర్తనలపై పోటీలు నిర్వహించేందుకు ‘‘ అదివో …. అల్లదివో….’’ పేరుతో కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తాం.
– తొలుత జిల్లాస్థాయిలో, ఆ తరువాత రాష్ట్రస్థాయిలో యువతకు పోటీలు నిర్వహిస్తాం. హైదరాబాద్, తిరుపతిలోని ఎస్వీబీసీ స్టూడియోల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం.
– తిరుపతి – అలిపిరి కాలినడక మార్గంలో జరుగుతున్న పైకప్పు నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేసి శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి ప్రారంభిస్తాం.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.