యాభై మందికి పైగా తిరుపతి నుంచి బయలుదేరి కుక్కలదొడ్డి అటవీ పరిశోధనా కేంద్రం దగ్గర వద్ద కలుసుకున్నాం. సీనియర్ ట్రెకర్, శేషాచలం ప్రాంతం మీద విపరీతంగా పరిశోధన చేసిన భూమన్ గారితో మా టీం ముందుకు సాగుతూ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాలి. ఆయనతో కలసి ట్రెక్ చేయడం ఒక గొప్ప అనుభవం. ఆయన విజ్ఞానం అపారం. ఈ ప్రాంతంలో ఆయన తిరగని ప్రదేశం,చూడని తీర్థం లేవు. అన్నింటికంటే ముఖ్యంగా శేషాచలం తీర్థాల, గుండాల మీద ఆయన లోతైన పరిశోధనలు చేశారు. సాహిత్యం సమీకరించారు.
ఇక మా టీమ్ లోని ట్రెక్కర్లు బెంగుళూరు, హైద్రాబాద్, చెన్నై, తుంకూర్ ల నుండి వచ్చారు. అక్కడే టిఫిన్లు ముగించుకుని విష్ణుగుండంకు ప్రయాణం మొదలు పెట్టాం. కుక్కలదొడ్డికి ఎడమవైపున ఉన్న బాలపల్లి మీదుగా వెళ్లి, సిద్దలేరు బేస్ కాంప్ అక్కడి నుండి కంగుమడు చేరుకున్నాం.
ఎంతో అద్భుతంగా సాగింది ఈ ప్రయాణం. వర్షపు చినుకులు, కంటి నిండా పచ్చని అడవి, వంపులు తిరిగిన సన్నని మట్టి రోడ్డు. అడవి గాలితో కలసిన మట్టి వాసన. కెరక్కాయ చెట్లు, నేరేడు చెట్లు.ఎన్నో ఔషధ మొక్కలు, తీగలు.వెదురు పొదలు …అక్కడక్కడ భయపెట్టే ఏనుగు విసర్జితాలు…
కంగుమడుగు లో కాసేపు విరామం. తర్వాత ప్రశాంతంగా ఉన్న అడవిలో మారాకతో అలజడి మొదలయింది. చాలా మంది కంగుమడుగులో ఈత కొట్టి, కాసేపు సేద తీరాక, మా ప్రయాణం మళ్ళీ మొదలైంది….అక్కడి నుండి మూడేర్ల కురవ చేరుకుని. అక్కడ భోజనాలు కానిచ్చి…అక్కడి నుండి విష్ణు తీర్థం బయలుదేరాం..
రెండు కొండల మధ్య నీటి ప్రవాహం లేని.. రాళ్లు తేలిన వాగులో ప్రయాణం ఎలా వుంటూ దో చెప్పాలా.. పడ్డాం..లేచాం…మొత్తానికి చేరుకున్నాం..విష్ణుగుండం…అద్భుతమైన ప్రదేశం…చాలా ఇరుకుగా వుండే ఎత్తైన కొండల మధ్యలో నుండి పడే జలపాతం..మధ్యలో రెండు నీటి గుండాలు. చాలా అద్భుతంగా ఉంది .అక్కడి నుండి తిరిగి…మూడేర్ల కురవ చేరుకొని…రాత్రి అక్కడే విడిది…
నిప్పుల మీద కాల్చిన వంకాయ, మిరపకాయలతో పచ్చడి, కూరగాయలతో పప్పు సాంబార్…వేడివేడి అన్నం, రసం, వడియాలు..ఆ అడవిలో అన్ని వ్యయప్రయసాలకు ఓర్చి అన్ని సమకూర్చిన ట్రెక్ నిర్వాహకులకు నిజంగా రుణపడివుంటాం…మరుసటి ఉదయం…అడవిలో సూర్యోదయం…వేడివేడి టీ.. స్నానాలు అయ్యాక కిచిడి.. రాత్రి మిగిలిన అన్నంతో లెమన్ రైస్ చేశారు..టిఫిన్లు అయ్యాక…
మాకు సహకరించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ ప్రభాకర్ రెడ్డి గారికి, అటవీ సిబ్బందికి…సన్మాన కార్యక్రమం…తర్వాత తిరుగు ప్రయాణం…
విష్ణుగుండం ట్రెక్ జ్ఞాపకాలు ఎప్పటికీ మాలో పదిలం…చెప్పాలంటే ఇంకా చాలా ఉంది.
(కందాసి ప్రభాకర్)