ప్రకృతి పర్యావరణం అనే అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగుతున్న బహుజన బతుకమ్మ ప్రతి ఏటా ఏదో ఒక సమస్యను లేవనెత్తుతు 2021 సంవత్సరానికి 9 వ ఏడులోకి ప్రవేశిస్తుంది.
కరోనాతో కట్టడి గావింపబడి రెండేళ్లుగా ప్రజలు సతమతమవుతున్న పంట పొలాలు, వంట గదులు విరామమెరుగకుండా పని చేశాయి. కానీ వలసవాద జోక్యంతో మొదలై, బహుళజాతి కంపెనీలకు ఆటపట్టుగా మారిన మన పంటలు , మన వంటలు వింత వింత రోగాలకు చిరునామాగా మారాయి.
పైగా లక్షలాది రైతాంగాన్ని, చేతి వృత్తులను అప్పుల ఊబిలోకి నెట్టాయి. బలవన్మరణాల పాలు చేస్తున్నాయి. కాలుష్యం మానవాళి పాలిట వేల కరోనాలకు సమానంగా ఉంది. ఎక్కడో నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టరాదు అంటూ ఉద్యమించిన మనం మన వ్యవసాయ క్షేత్రాలను అంతకంటే ప్రమాద క్షేత్రాలుగా మార్చుకుంటున్నాం.
కావున పౌష్టికాహారం కోసం కరోనా కాలమంతా తల్లడిల్లిన మనం సురక్షిత పంటల కోసం గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిశగానే సహజ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని కోరుతూ ‘బహుజన బతుకమ్మ’ ఉత్సవాన్ని ఉద్యమంగా జరపాలని ‘అరుణోదయ’ నిర్ణయించింది.
ఈ మేరకు వ్యవసాయం, సాంస్కృతిక రంగాలలో పనిచేస్తున్న పలువురి మేధావులు, ప్రజాస్వామ్యవాదుల సూచనలు, సలహాలు కోరుతూ ఆగస్టు 30 ,2021న ఓంకార్ భవన్ లో ఒక సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో అనేక విలువైన సూచనలు రావడమే కాకుండా ప్రకృతి వ్యవసాయం, బహుజన బతుకమ్మ అనే పుస్తకం వెలువరించాలని నిర్ణయం జరిగింది. బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో వెలువడే ఈ పుస్తకంలో అగ్రికల్చర్ & కల్చర్ అంశాలను ను బతుకమ్మతో అనుసంధానిస్తూ రాయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ దిశగా రచయితలు తమ రచనలను bahujanabathukamma2021@gmail.com కు సెప్టెంబర్ 8,2021 వరకు పంపాలని తెలంగాణ బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.