విఫలమవుతున్న పాత కథనాలు: ఆఫ్ఘనిస్తాన్ పై కొత్త అవగాహలు
రచన: డాక్టర్ రాంజీ బరూడ్ అనువాదం: డాక్టర్. యస్. జతిన్ కుమార్
ఇరవై సంవత్సరాలుగా, రెండు ఆధిపత్య కథనాలు ఆఫ్ఘనిస్తాన్ పై చట్టవిరుద్ధమైన అమెరికా దండయాత్ర, ఆక్రమణల గురించి మన అభిప్రాయాలకు రూపు దిద్దుతూ వచ్చాయి. ఈ కథనాలలో ఏదీ కూడా ‘చట్టవిరుద్ధం’, ‘దాడి ‘ ‘ఆక్రమణ’ వంటి పదాలను ఉపయోగించడాన్ని అంగీకరించదు.
ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ‘సైనిక జోక్యం’ అక్టోబర్ 7, 2001 న ప్రారంభమయ్యింది. ఇది ‘ఉగ్రవాదంపై ప్రపంచ యుద్ధం’ అని అభివర్ణించి చేసిన అధికారిక ప్రారంభం. ఈ యుద్ధ వ్యూహమంతా దాదాపు పూర్తిగా అమెరికా ప్రభుత్వ వ్యూహకర్తలకు వదిలివేశారు. మాజీ అధ్యక్షుడు, జార్జ్ డబ్ల్యు. బుష్, అతని వైస్ ప్రెసిడెంట్- డిక్, రక్షణ వ్యవహారాల కార్యదర్శి-డోనాల్డ్ రమ్స్ఫెల్డ్, ఇతర అధికార ప్రతినిధులు, నయా సంప్రదాయ [నియో కన్జర్వేటివ్] ‘మేధావుల’ సైన్యమూ, పాత్రికేయులూ, ఆఫ్ఘనిస్తాన్ ను తీవ్రవాదుల నుండి విడిపించడానికి, ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి, అదనంగా ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, అణచి వేయబడిన ఆదేశ మహిళలను విముక్తి చేయడానికి- ఇదే పరిష్కార మార్గం అని చెప్పి ఈ సైనిక రణ ఎంపికను సమర్థించారు.
ఇలా చెప్పి అప్పటికే యుద్ధంతో దెబ్బతిన్న,అత్యంత పేద దేశంలో అమెరికా మొదలెట్టిన యుద్ధం న్యాయమైనదిగా చిత్రించారు. ఒక కారణం చూపించి ఆమోద ముద్ర వేశారు. అది హింసాత్మకమైనా, అది మానవతావాదం అని చెప్పి సమర్ధించుకున్నారు. మరొక కథనం, ఇది కూడా పాశ్చాత్యులదే, బుష్ పరిపాలన ఉపయోగించిన ఈ గంగ్-హో[తగిన సాధారణ చికిత్సలు లేకుండా, దూకుడుగా శస్త్రచికిత్సకు పూనుకోవటం] విధానాన్ని సవాలు చేసింది, ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా విధించలేమని వాదించింది, అంతర్జాతీయ రాజకీయాలపై బిల్ క్లింటన్ బహుళపక్ష విధానాన్నివాషింగ్టన్ కు గుర్తు చేసింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లేదా ఇంకే చోట్లలో అయినా విదేశాంగ విధాన రూపకల్పనలో “ కొట్టి పారిపోయే” [‘కట్ అండ్ రన్’] శైలికి వ్యతిరేకంగా హెచ్చరించింది.
ఈ రెండు కథనాలు పైకి విరుద్ధంగా కనిపించినప్పటికీ, వాస్తవానికి, ఆఫ్ఘనిస్థాన్లో కానీ, మరోచోట కానీ యునైటెడ్ స్టేట్స్ను కలగ జేసుకునే హక్కుగల నైతిక శక్తిగా ఇద్దరు భావిస్తున్నారు. మౌలికంగా ఇరు వాదనలు ఒకే కోవకు చెందినవి. తమను తాము ‘యుద్ధ వ్యతిరేకి’ అని చెప్పుకునే వారు ఇతర దేశాలలో జోక్యం చేసుకోవటం సరైనదని ని ఎలా భావిస్తారు? ఇరు పక్షాలు కూడా అమెరికన్లకు అసాధారణ ‘మానిఫెస్ట్ డెస్టినీ’ హక్కులున్నాయనే భావనకు బద్ధులైన వారే. [అంటే అమెరికా ప్రజలు చాలా విశిష్టమైన వారనీ వారి విస్తరణ అంటే ప్రజాస్వామ్యం విస్తరించటమనీ, అది అత్యంత అవసరమనీ, అనివార్యమనీ వారి భావన. 1840 నుంచీ అమెరికన్ పాలకులు ప్రచారం చేస్తున్న సంస్కృతి ఇది. ]
ఈ రెండు వైఖరుల మధ్య ప్రధాన వ్యత్యాసం- అనుసరించే విధానం [మెథడాలజీ]గురించి మాత్రమే గాని, మరొక దేశం యొక్క వ్యవహారాల్లో ‘జోక్యం’ చేసుకునే హక్కు అమెరికాకు ఉందా?అనే మౌలిక సూత్రానికి చెందినది కాదు. ‘ఉగ్రవాదాన్ని నిర్మూలించటానికి తాము ఏ దేశంలో నయినా చొరబడవచ్చా’ ‘ బాధిత జనాభాకు సహాయం చేయటం కోసం ఏ దేశం లోకమయినా ప్రవేశించ వచ్చా?’, “ఆ ప్రజలు తమకు తాము సహాయం చేసుకోలేని దుస్థితిలో వున్నారా? ఒక పాశ్చాత్య రక్షకుడి కోసం నిరాశతో వేచి ఉన్నారా? అనే అంశాల పట్ల వారి ఆలోచనలలో భేదమేమీ లేదు. దొందూ దొందే.
ఏదేమైనా, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఎదుర్కొన్న అవమానకరమైన ఓటమి, మనలో ఒక సరికొత్త ఆలోచనా విధానాన్ని ప్రేరేపించాలి, ఇది ఆఫ్ఘనిస్తాన్ గురించి, ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో వున్న అన్ని పాశ్చాత్య కథనాలను సవాలు చేయాలి
అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో స్పష్టంగా విఫలమైంది. ఈ వైఫల్యం సైనికంగానూ, రాజకీయంగానూ మాత్రమే కాదు – ‘ప్రభుత్వ నిర్మాణం’ ఇంకా అన్ని ఇతర విషయాలలోకూడా. అసలు ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా-పాశ్చాత్య మీడియా వండివార్చిన కథనాలూ విఫలమయ్యాయి. రెండు దశాబ్దాలుగా అమెరికాను ఒక నైతిక శక్తిగా నివేదించిన ప్రధాన స్రవంతి మీడియా ఇప్పుడు గందరగోళంలో వున్నది. కాబూల్ నుండి తొందరపాటుగా తిరోగమించటం గురించి, విమానాశ్రయంలో రక్తసిక్తమైన మాయాజాలం గురించి, అసలు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఎందుకు ఉంది? అనే దాని గురించి సాధారణ ప్రజల వలె యుఎస్ నిపుణులు కూడా గందరగోళానికి గురయ్యారు.
ఇంతలో, ‘మానవతావాద జోక్యం వాదులు’ –“ఆఫ్ఘన్ ప్రజలకు వాషింగ్టన్ ‘ద్రోహం’ చేసిందని, ఆఫ్ఘాన్లను వారి విధికి వారిని వదిలి వేశారనీ, వారిని మధ్యలో వదిలేసి అమెరికన్లు నిష్క్రమించారనీ” ఆందోళన పడుతున్నారు. “ఆఫ్ఘన్లు తమ సొంతవ్యవస్థలు లేని నిస్సహాయ స్థితిలో కూరుకు పోయారనో లేదా తమ దేశంపై దాడి చేయాలని అమెరికన్ మిలిటరీ ని ఆఫ్ఘన్ ప్రజలు ఆహ్వానించినట్లుగానో, లేక ఆమెరికన్లను తమ ప్రజాస్వామ్య ప్రతినిధులుగా ఎన్నుకున్నట్లుగానో వీరు వూహించుకుని బాధపడుతున్నారు..
ఆఫ్ఘనిస్తాన్ పై ఇరవై సంవత్సరాలుగా మన సమిష్టి అవగాహనను క్రుంగదీసిన అమెరికా-పాశ్చాత్య మీడియా ప్రచారంవల్ల తాలిబన్లు దేశాన్ని వేగంగా స్వాధీనం చేసుకోవడానికి దారితీసిన డైనమిక్స్ గురించి కొంచెం కూడా అవగాహన లేకుండా పోయింది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సామాజిక-ఆర్థిక నిర్మాణానికి ఏమీ సంబంధం లేని దానిగాను పూర్తిగా విడిపోయి వున్నది గాను తాలిబాన్ సమూహం గురించి మీడియాలో చెబుతూ వచ్చారు.అందుకే తాలిబన్ల విజయం దిగ్భ్రాంతి కలిగించడమే కాకుండా చాలా మందిని గందరగోళంలోకి నెట్టి వేసింది.
ఇరవై సంవత్సరాలుగా, తాలిబన్ల గురించి మనకు తెలిసిన కొద్దిపాటి వివరాలు కూడా పాశ్చాత్య మీడియా విశ్లేషణలు, సైనిక గూఢచార అంచనాల ద్వారా తెలియ జేయబడిన విషయాలు మాత్రమే .ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన ఏ రాజకీయ చర్చల నుండైనా తాలిబన్ ల దృక్పథాన్ని పూర్తిగా తొలగించుతూ, ప్రత్యామ్నాయ ఆఫ్ఘన్ జాతీయ కథనాన్ని అమెరికా, దాని నాటో భాగస్వాములు జాగ్రత్తగా నిర్మించారు. కొందరిని ‘మంచి ఆఫ్ఘన్లు’ అని చెప్పారు. వీరు పాశ్చాత్య తరహా దుస్తులు ధరించి, ఇంగ్లీష్ మాట్లాడుతారు. అంతర్జాతీయ సమావేశాలకు హాజరవుతారు మహిళల సమానత్వాన్ని గౌరవిస్తున్నా మంటారు. వాషింగ్టన్ యొక్క ఔదార్యం నుండి వారు చాలా ప్రయోజనం పొందారు. కాబట్టి, వారు తమ దేశాన్ని అమెరికా ఆక్రమించడాన్ని స్వాగతించారు.
ఆ ‘మంచి ఆఫ్ఘన్లు’ నిజంగా ఆఫ్ఘన్ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తే, 3,00,000 మంది ఉన్న వారి సైన్యం తమ ఆయుధాలను వదిలి, ఏమాత్రం పోరాడకుండా, వారి అధ్యక్షుడితో పాటు దేశం వదిలి ఎందుకు పారిపోయారు? 75000 మంది మాత్రమే వున్న తాలిబన్లకు –బలమైన ఆయుధాలు లేనివారు, కొన్నిసార్లు పోషకాహార లోపం ఉన్న వారు, కేవలం తమకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనిపించిన వారి చేతులలో ఎలా తోక ముడిచారు? తాలిబాన్లు కొద్ది రోజుల్లోనె బలీయమైన శత్రువులను ఎందుకు ఓడించగలిగారు?
తాలిబన్ల మాదిరిగానే, తక్కువ సైనిక శక్తి కూడా చాలా కాలం కొనసాగవచ్చు, చివరికి అనేక సంవత్సరాల తరువాత ఒక క్రూరమైన యుద్ధంలో విజయం కూడా సాధించవచ్చు. అయితే దానికి దేశంలోని అధిక ప్రాంతాలలోని ప్రజల నుండి, గణనీయమైన అట్టడుగు మద్దతు లేకుండా మాత్రం సాధ్యం కాదు.. ఆగస్టు 15న కాబూల్ లోకి ప్రవేశించిన తాలిబన్లలో ఎక్కువ మంది అమెరికా తమ దేశంపై దాడి చేసినప్పుడు,చిన్న పిల్లలు, కొందరు పుట్టనే లేదు. మరి వారిని ఆయుధాలను మోయడానికి బలవంతం చేసింది ఏమిటి? గెలవలేని యుద్ధం చేయడానికి, చంపడానికి, చావడానికి కూడా వారిని పురికొలిపిన దేమిటి ? , చాలామంది ఇతరుల మాదిరిగా వారు అమెరికన్ల కోసం పనిచేసే లాభదాయకమైన వ్యాపారంలో ఎందుకు చేరలేదు?
మేము తాలిబన్ కథనాన్ని కూడా అర్థం చేసుకోవడం ప్రారంభించాము, ఎందుకంటే వారి ప్రతినిధులు నెమ్మదిగా చాలా మందికి పూర్తిగా తెలియని విషయాలపై తమ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. సమాచారం అందిస్తున్నారు. అది వినడానికి, చర్చించడానికి లేదా అర్థం చేసుకోవడానికి మిమ్మల్నిఅనుమతించలేదు.
ఇప్పుడు అమెరికా, దాని నాటో మిత్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్ ను విడిచిపెడుతున్నాయి, వారి మానవతా లక్ష్యం ఇంత ఇబ్బందికరమైన ఓటమికి ఎందుకు దారి తీసిందనే విషయాన్ని సమర్థించలేక, వివరించలేక మౌనం వహించాయి. ఆఫ్ఘన్ ప్రజలు విసురుతున్నతమ స్వంత జాతీయ కథనపు సవాలుకు జవాబు ఇవ్వలేక పోతున్నారు ఇప్పుడు అఫ్ఘాన్లు వారి శత్రువులను అధిగమించి పురోగ మించాలంటే – తాలిబాన్లు, తదితరులు రాజకీయ భేదాలకు అతీతంగా,భావజాలంతో సంబంధం లేకుండా ఆఫ్ఘన్లందరూ కలిసి నడవాలి.
ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పుడు, ఆ దేశ ప్రజలకు నిజంగా ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం యొక్క అవసరం వుంది. ఇది విద్యకు, అల్పసంఖ్యాక వర్గాలకు, రాజకీయ అసమ్మతి వాదులకు,అందరికీ హక్కులను ఇవ్వాలి, ఇలా చేయటం పాశ్చాత్య ఆమోదం పొందడానికి కాదు, ఆఫ్ఘన్ ప్రజలందరూ గౌరవించబడటానికి, శ్రద్ధతో చూడబడటానికి . సమానంగా పరిగణించబడటానికి అర్హులు అనే గుర్తింపుఇవ్వడానికి . ఆఫ్ఘనిస్థాన్ ప్రజల స్వీయ-సేవ, పాశ్చాత్యులు వక్రీకరించిన చరిత్ర పరిమితులకు వెలుపల నిజమైన ఆఫ్ఘన్ జాతీయ కథను పెంచి పోషించాలి ఇప్పుడు.
[ రాంజీ బరూడ్ (Ramzy Baroud) ఒక జర్నలిస్ట్. ది పాలస్తీనా క్రానికల్ సంపాదకుడు. ఆయన ఐదు పుస్తకాల రచయిత. అతని తాజాపుస్తకం “ఈ గొలుసులు బద్దలు కొడతాం” (These Chains Will be Broken) ” ఇజ్రాయిల్ జైళ్లలో పోరాటం, ధిక్కారం యొక్క పాలస్తీనా కథలు” (స్పష్టత ప్రెస్). డాక్టర్ బరూడ్ ఇస్లాం మరియు గ్లోబల్ అఫైర్స్ (సిఐజిఎ) సెంటర్ లో, ఆఫ్రో-మిడిల్ ఈస్ట్ సెంటర్ (ఎఎంఇసి) లో ప్రవాస సీనియర్ రీసెర్చ్ ఫెలో.]
(డాక్టర్ జతిన్ కుమార్,సామాజిక, ఆర్థికవిశ్లేషకుడు, ఆర్థోపెడిక్ సర్జన్,హైదారాబాద్)