(రాఘవ శర్మ)
నగ్జల్ బరీ సంఘటనలు కాకరాలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దేశానికి అదే సరైన విముక్తి మార్గం అనుకున్నారు. విరసంలో సభ్యుడు కాకపోయినా, ఆ ఆలోచనతోనే ప్రయాణించారు.
కన్న కూతుళ్ళిద్దరూ లోపలికెళుతుంటే వీడ్కోలు పలికి కర్తవ్యబోధ చేసిన నిబద్దుడాయన. తమ పిల్లల్ని ఏ అమెరికాకో, ఏ యూరప్ దేశాలకో పంపించి హాయయిన జీవితం కోరుకునే కమ్యూనిస్టు నాయకులున్న ఈ రోజుల్లో, కన్న బిడ్డలను, అదీ ఆడ బిడ్డలను లోపలకు పంపించడం ఎంత సాహసం! ఎంత నిబద్ధత ! ఎంత గుండె నిబ్బరం!
ఆయన మాటల్లోనే విందాము ఇలా…
నేను చదివిన పుస్తకాలన్నిటినీ నా సహచరి సూర్యకాంతం చేత చదివించాను. ఆక్రమంలో రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్యమంతా చదివాను.
నా ఆలోచన తన ఆలోచనగా, నా సహచరి ముందుండి నన్ను నడిపించింది.
అప్పుడే 1967లో నక్సల్బరీ ఉద్యమం మొదలైంది. ఎప్పటికైనా ఈ దేశానికి నక్సల్ బరీ లాంటి ఉద్యమంతోనే విముక్తి జరుగుతుందని భావించాను. ఆ సంస్థ కాకపోయినా, అలాంటి సంస్థతోనే విముక్తి లభిస్తుందని భావించాను. పార్లమెంటరీ విధానం ద్వారా విముక్తి లభించదని నా నమ్మకం.
“ఊరందరిదీ ఒక సంగీతమైతే, మా నాన్నది ఒక సంగీతం” అనేది మా పెద్దమ్మాయి.అప్పుడు చాలా చిన్నది.ఈ రాజకీయాల వైపు రావడానికి ఎవరి ప్రోద్భలం లేదు.
నక్సల్ బరీ సంఘటనలు చూడడంవల్ల నా దృష్టి దానిపై పడింది.నేను సినిమాల్లో చేస్తున్నా, నా పిల్లల దృష్టి సినిమాలపైన పడకుండా జాగ్రత్త తీసుకున్నాం.
తల్లి పెంపకంలో ఎడ్యుకేట్ అయ్యారు. వారి బాధ్యతలన్నీ వాళ్ళ అమ్మే చూసింది. రేడియో నాటకాలు, డబ్బింగ్లు, సినిమా అవకాశాలు ఒకటి కాకపోతే మరొకటి దొరికేవి. కళకే నా జీవితాన్ని కేటాయించాను.
నేను, సూర్యకాంతం పుస్తకాలు చదివే వాళ్ళం. చర్చించే వాళ్ళం. ఆ ప్రభావం పిల్లలపై పడింది. పిల్లలు పూజలు చేయడం మానుకున్నారు.అమ్మ చేస్తే చేసుకోనీ అన్నారు.
పిల్లల ఆలోచన వల్ల ఆమె కూడా మారింది. పిల్లలు రితిక్ ఘటక్ సినిమాలు చూశాక వాటితో బాగా ప్రభావితం అయ్యారు. ఫిలిం సొసైటీ సినిమాలు చూసేవారు. డబ్బింగ్ రచయితగా శ్రీశ్రీతో కలిసి పనిచేశాను. శ్రీ శ్రీ నేనంటే చాలా అభిమానం.
విరసంతో…
“ఏమయ్యా విరసాన్ని వదిలేయడమేమిటి? విరసంలోకి రావాలి” అన్నారు కేవీయార్ .
“విరసంతో నెగ్గుకు రాలేను. సభ్యత్వం తీసుకుని కొనసాగలేను” అన్నాను నేను.
విరసం సభలకు రమ్మని 1980లో నన్ను పిలిచారు. కేవీయార్ అఖిల భారతవిప్లవ సాంస్కృతిక సంస్థ (ఏఐఎస్ఆర్ టీసీ)లో చురుగ్గా పనిచేస్తున్నారు.
మహాసభలకు కుటుంబంతో సహా వెళ్ళేవాడిని. నేను కూడా వారితో ఉన్నప్పటికీ, నేను చేసిందేమీ లేదు. నాకంటే నా పిల్లలపైన ప్రభావం బాగా పడింది.
అంతకుముందు ఎస్.ఎన్. త్రిపాటి ఇంగ్లీషులో ఉన్న కమ్యూనిస్టు ప్రణాళికను చదివి నా బుర్రలోకి ఎక్కించారు. అంత వరకు చిన్న చిన్న పుస్తకాలు చదవడమే తప్ప పెద్దగా రాజకీయ సిద్ధాంతాలు తెలియదు.
నాకు రాజకీయ బాట వేసింది త్రిపాటీనే. త్రిపాటి, వల్లం నరసింహారావు గారి దగ్గర నక్సల్ బరీ తొలితరానికి చెందిన రామనరసింహారావు పరిచయమయ్యాడు. ఆయన దర్శకుడు తిలక్ మ్ముడు.
“మనవాళ్లు చెప్పారు. కరెక్ట్ లైన్‌లో ఉన్నారు. థ్యాంక్స్” అని షేక్ హాండ్ ఇచ్చాను. దాంతో ఒక సాహసం చేశాను. విశాఖ పట్నం జైలునుంచి 1969లో కొందరు తప్పించుకున్నారు. వారికి నేను పదిహేను రోజులు ఆశ్రయం కల్పించాను. ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఈ విషయం ఏడాదికల్లా బైటపడింది.
పీఠాపురంలో ‘కీర్తిశేషులు’ నాటకం వేశాక పోలీసులు నన్ను పట్టుకున్నారు. నన్ను నెల్లూరు తీసుకొచ్చారు. ఏం చేస్తారో తెలియదు. షెల్టర్ ఇచ్చినవారంతా అప్రూవర్ గా మారారు. వారు నా పేరు చెప్పారు. వారికి షెల్టర్ ఇచ్చానని ఒప్పేసుకున్నా. నన్ను వదిలేశారు. అప్పుడే సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయి.
సినిమాలు చేసుకుంటూ పొలిటికల్ గా రిట్రేట్ అయ్యాను. హైదరాబాదుకు1980లోవచ్చాను. అప్పటికి నా సినిమా జీవితం అయిపోయినట్టేలెక్క.
తమిళనాడులో అన్ని గ్రూపులతో పరిచయాలుఏర్పడ్డాయి. అందరితో బాగా ఉండడం వల్ల అంతానన్ను సభలకు పిలిచేవారు.ఇక్కడ ఆంధ్ర దేశంలో కూడా నన్ను పిలిచేవారు.
‘మా భూమి’ 1980లో రిలీజ్ అయ్యింది. ఆ తరువాత మద్రాసు వాణి మహల్లో జాతుల మహాసభలు జగజ్జీయ మానంగా మూడు రోజులు జరిగాయి. గద్దర్ ప్రదర్శన.మొత్తం సినిమా రంగమంతా కదిలింది.
చెరబండ రాజు ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయనను ఆస్పత్రికి తీసుకెళుతుంటే నా రెండవ కుమార్తె సమత కూడా వచ్చింది. ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యింది. మా పిల్లలు చెరబండరాజు వర్ధంతిని చేస్తూ వస్తున్నారు.
“ఇక మనం ఏమీ చేయకపోయినా ఫరవా లేదు. రాబోయే తరం వారు అందుకుంటున్నారు” అన్నారు వల్లం నరసింహారావు.
వాణి మహల్ లో చెరబండ రాజు వర్ధంతిని జరిపాం.మరుసటి ఏడాది పోలీసులు అభ్యంతరం చెప్పారు.
దాంతో జానపద నృత్యాలు అన్న పేరుతో వాణి మహల్ లో చెరబండ రాజు వర్ధంతిని జరిపాం. ఆ గుమాస్తా పైన ఒత్తిడి తెచ్చి, మరుసటి ఏడాది జరగనీయకుండా చేశారు.
నేను, నాసహచరి సూర్యకాంతం హైదరాబాదులోని చండ్ర రాజేశ్వరరావు ఓల్డేజ్ హెూమ్ లో ఉంటున్నాం. నా సహచరి గత మార్చి 18న కన్నుమూసింది. మా చిన్న తమ్ముడే నా విషయాలన్నీ చూస్తూ ఉంటాడు.. ‘అమ్మ’ నాటకాన్ని శ్రీశ్రీ అనువాదం చేశారు. ప్రదర్శించాలని ప్రయత్నించాం. వెయ్యలేకపోయాం .
“చనిపోయిన వారితోను, బతికున్న వారితోను మాట్లాడే శక్తి ఒక్క అమ్మకే ఉంటుంది” అన్నది ఆ నాటకం సారాంశం.’లోపలకు వెళ్ళిపోతున్నాం నాన్నా’ అన్నారు నాకూతుర్లిద్దరూ.
“మీరు చూస్తున్నారు కదా. ఇలా లోపలకు వెళ్ళి అలా బైటికి వచ్చేస్తున్నారు. అలా చేసేట్టయితే వెళ్ళకండి. లోపలకెళ్ళి ఘర్షణ పడడం మంచిది కాదు. మీ నిర్ణయం మీరు తీసుకున్నారు. మళ్ళీ వెనక్కితిరిగి రాకండి. ముందు మీ అమ్మను కన్వీన్స్ చేయండి. ఆమ్మే మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆమెదే బాధంతా. నాదేమీ లేదు” అన్నాను.
వాళ్ళ నిబద్దత చాలా బలంగా ఉంది. మద్రాసులో ఉండగా మా చిన్నమ్మాయి తమిళ కవితలను తెలుగులోకి అనువాదం చేసేది. లోపలకెళ్లాక ఇంగ్లీషులో కథలు రాస్తోంది. ముప్ఫై ఏళ్ళుగా అక్కడుండి నెగ్గుకు వస్తున్నప్పుడు నాకు బాధ ఎందుకు?
చదువు పూర్తి చేసుకుని వెళ్ళండని నేను చెప్పిన దానికి మా పెద్దమ్మాయి తొలుత ఒప్పుకుంది కానీ.. ? మాచిన్నమ్మాయి ఒక చేదు నవ్వు నాపై విసిరేసి వెళ్ళిపోయింది.” అన్నారు గాద్గదిక స్వరంతో.
కాకరాల గొంతు పెగల్లేదు.కళ్ళవెంట జలజాలా రాలాయి. తల ఒంచుకుని కళ్ళు తుడుచుకున్నారు. అంతటితో మా సంభాషణ ఆగిపోయింది.(అయిపోయింది)
(అలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)