(బి.రామాంజనేయులు, విశ్రాంత ఐఎఎస్ అధికారి)
తరచూ కోర్టు మెట్లెక్కడం వాంఛనీయం కాదు
చేయని తప్పుకు మనమెందుకు శిక్ష అనుభవించాలి?
నిబంధనల ప్రకారమే నడుచుకునేలా ఐఎఎస్ అధికారుల సంఘం దిశా నిర్దేశం చేయాలి
తాజా పరిణామాలతో ఐఎఎస్ వ్యవస్థపై చులకన భావం
-సీనియర్ మాజీ ఐఎఎస్ అధికారి రామాంజనేయులు
నెల్లూరుజిల్లా తాళ్లపాక సాయిబ్రహ్మ అనే మహిళకు పరిహారం విషయంలో కోర్టు తీర్పును అమలుచేయకపోవడంతో అయిదుగురు ఐఎఎస్ అధికారులకు గౌరవ హైకోర్టు రెండువారాల నుంచి నెలవరకు జైలుశిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఇటీవల ఐఎఎస్ అధికారులకు తరచుగా కోర్టుల్లో శిక్షలు పడటం, చీవాట్లు తినడం ఐఎఎస్ కేడర్ ను ఆందోళనకు గురిచేస్తోంది.
రాజ్యాంగం ప్రకారం ప్రజలకు అందించాల్సిన సేవలపై న్యాయవ్యవస్థ, పాలనావ్యవస్థ, విధాన వ్యవస్థల మధ్య స్పష్టమైన అధికారాలు, బాధ్యతలు ఉన్న నేపథ్యంలో పాలనా వ్యవస్థలోని అధికారులు ఎందుకు న్యాయవ్యవస్థచేత తరచూ శిక్షించబడి చీవాట్లు తినాలి?
ఇటీవల కాలంలోనే పదేపదే ఇలా ఎందుకు జరుగుతుందనే విషయమై ఐఎఎస్ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీనిపై ఐఎఎస్ అధికారుల సంఘం చొరవ తీసుకొని పాలనా వ్యవస్థ నిబంధనల ప్రకారం నడుచుకునేలా దిశానిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వత్తిళ్లు సాధారణమే కానీ మితిమీరిన రాజకీయ వత్తిడిని నిరోధించాల్సిన బాధ్యత ఐఎఎస్ అధికారుల పైన, వారికి నాయకత్వం వహిస్తున్న సంఘాలపైన ఉంది.
ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలతో జూనియర్ ఐఎఎస్ అధికారులు, కొత్తగా రాష్ట్రానికి రావాల్సిన అధికారుల్లో ఆందోళన నెలకొని రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టాలంటేనే అనాసక్తి నెలకొంది. ఇటువంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత సీనియర్ ఐఎఎస్ అధికారులపై ఉంది.
రాజకీయ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి చేయని తప్పుకు జైలుకు వెళ్లడం, శిక్షల పాలుకావడం, నిందలు మోయాల్సి రావడం వల్ల యావత్ అధికార యంత్రాంగం మానసిక స్థయిర్యం కోల్పోవడమేగాక పాలనా వ్యవస్థకు వెన్నెముక లాంటి ఐఎఎస్ లపై చులకన భావం ఏర్పడటం ప్రజాస్యామ్య వ్యవస్థలో మంచి పరిణామం కాదు.